బాక్సింగ్ డే టెస్ట్... మూడో రోజూ టీమిండియాదే

ABN , First Publish Date - 2020-12-28T19:45:57+05:30 IST

బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసీస్‌ను రెండో ఇన్నింగ్సులోనూ కట్టడి చేసింది టీమిండియా. మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 133 పరుగులు చేసింది.

బాక్సింగ్ డే టెస్ట్... మూడో రోజూ టీమిండియాదే

మెల్‌బోర్న్: బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసీస్‌ను రెండో ఇన్నింగ్సులోనూ కట్టడి చేసింది టీమిండియా. మూడో రోజు ఆట నిలిచే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్ 133 పరుగులు చేసింది. ప్రస్తుతం రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. గ్రీన్(17), కమిన్స్(15) క్రీజులో ఉన్నారు. 99 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినా... తర్వాత మరో వికెట్ పడకుండా క్రీజులో కుదురుకున్నారు. మంగళవారమూ టీమిండియా ఇదే జోరు కనపబరిస్తే.. 1-1తో సిరీస్‌ను సమం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 




ఇదిలా ఉంటే, ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే కంగారులు తొలి వికెట్ కోల్పోయారు. జట్టు స్కోర్ నాలుగు పరుగుల దగ్గర జో బర్న్స్(4) పెవిలియన్ చేరాడు. ఉమేశ్ బౌలింగ్‌లో పంత్ చేతికి చిక్కాడు. మాథ్యూ వేడ్, మార్నస్ క్రీజులో కుదురుకుంటుండగా రవీంద్ర జడేజా ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టారు. అశ్విన్ బౌలింగ్‌లో మార్నస్(28) పెవిలియన్ బాటపట్టాడు. స్మిత్‌ను బుమ్రా బోల్తాకొట్టించాడు. 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక క్రీజులో పాతుకుపోయిన మాథ్యూ వేడ్(40) రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. ఆ కాసేపటికే.. ట్రవీస్‌ను సిరాజ్ అవుట్ చేయగా, కెప్టెన్ టిమి పైన్‌ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపాడు. దీంతో 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఆసీస్. భారత బౌలర్లలో బుమ్రా, యాదవ్, సిరాజ్, అశ్విన్ చెరో వికెట్ తీయగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీసుకున్నారు. 


అంతకుముందు, 277/5 ఓవర్ నైట్ స్కోర్ మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 49 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కెప్టెన్ రహానే(112), జడేజా(57), శుభ్‌మన్ గిల్(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. లయన్‌ బౌలింగ్‌లో జడేజా షాట్‌ కొట్టగా... పరుగు కోసం ప్రయత్నించిన క్రమంలో రహానే అవుట్ అయ్యాడు. దీంతో ఇద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కాసేపటికే మిగిలిన నాలుగు వికెట్లు పడిపోయాయి. జడేజా, ఉమేశ్‌ యాదవ్‌(9), అశ్విన్(14)‌, బుమ్రా(0) పెవిలియన్ చేరారు. ఇక ఆసీస్ బౌలర్లలో స్టార్క్, గ్రీన్ చెరో మూడు వికెట్లు, కమిన్స్ రెండు, హాజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2020-12-28T19:45:57+05:30 IST