బగాన్‌ బోణీ

ABN , First Publish Date - 2020-11-21T10:16:41+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో అంచెలో శుభారంభం అందుకుంది.

బగాన్‌ బోణీ

ఐఎస్‌ఎల్‌ తొలి మ్యాచ్‌లో

కేరళపై విజయం


బాంబోలిమ్‌ (గోవా): డిఫెండింగ్‌ చాంపియన్‌ ఏటీకే మోహన్‌ బగాన్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో అంచెలో శుభారంభం అందుకుంది. శుక్రవారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో 1-0 స్కోరుతో  కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. బగాన్‌ తరపున 67వ నిమిషంలో ఫార్వర్డ్‌ రాయ్‌కృష్ణ గోల్‌ చేశాడు. ఈ గెలుపుతో బగాన్‌కు మూడు పాయింట్లు లభించాయి. తొలి మ్యాచ్‌ కావడంతో రెండు జట్లు రక్షణాత్మక ధోరణిలో ఆడాయి. అయితే ఆట ఆరంభంలో కార్నర్‌నుంచి హెర్నాండెజ్‌ అందించిన పాస్‌ను రాయ్‌కృష్ణ షాట్‌గా మలిచినా..బంతి గోల్‌ పోస్ట్‌కు దూరంగా వెళ్లడంతో మోహన్‌ బగాన్‌ గోల్‌ అవకాశం చేజారింది. ప్రథమార్థం గోల్స్‌ లేకుండా ముగియగా..67వ నిమిషంలో మన్వీర్‌ సింగ్‌నుంచి అందుకున్న క్రాస్‌ పాస్‌ను గోల్‌లోకి పంపించిన కృష్ణ..బగాన్‌కు ఖాతా తెరిచాడు. ఇక..శనివారం జరిగే మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌-ముంబై సిటీ తలపడతాయి. 

Read more