డీసీహెచ్‌ఎల్‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి

ABN , First Publish Date - 2020-07-18T08:57:30+05:30 IST

బీసీసీఐతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదంలో డెక్కన్‌ చార్జర్స్‌ పైచేయి సాధించింది. 2012లో ఐపీఎల్‌ నుంచి తమను అర్ధంతరంగా తొలగించినందుకు ...

డీసీహెచ్‌ఎల్‌కు రూ. 4800 కోట్లు చెల్లించండి

బీసీసీఐని ఆదేశించిన ఆర్బిట్రేటర్‌

ఐపీఎల్‌ నుంచి ‘చార్జర్స్‌’కు ఉద్వాసనపై తీర్పు 


ముంబై: బీసీసీఐతో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదంలో డెక్కన్‌ చార్జర్స్‌ పైచేయి సాధించింది. 2012లో ఐపీఎల్‌ నుంచి తమను అర్ధంతరంగా తొలగించినందుకు బీసీసీఐపై చార్జర్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ (డీసీహెచ్‌ఎల్‌) బాంబే హైకోర్టులో కేసు వేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు బాంబే కోర్టు అప్పట్లో ఆర్బిట్రేటర్‌గా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీకే ఠక్కర్‌ను నియమించింది. ఈ కేసును విచారించిన టక్కర్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు. అన్యాయంగా తమను లీగ్‌ నుంచి తప్పించారన్న డీసీహెచ్‌ఎల్‌ వాదనతో ఏకీభవిస్తూ వారికి నష్టపరిహారంగా రూ. 4800 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించారు. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఈ సెప్టెంబరు దాకా బోర్డు గడువిస్తున్నట్టు తీర్పులో పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన డెక్కన్‌ చార్జర్స్‌ జట్టు  ఐపీఎల్‌ రెండో ఎడిషన్‌ (2009)లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత మూడేళ్లు లీగ్‌లో కొనసాగిన చార్జర్స్‌.. ఆటగాళ్లకు ఫీజులు చెల్లించకపోవడం, బ్యాంకు లావాదేవీల్లో అవకతవకలు లాంటి ఆరోపణలు ఎదుర్కోవడంతో 2012 సెప్టెంబరులో జట్టును ఐపీఎల్‌ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీన్ని కోర్టులో సవాల్‌ చేసిన యాజమాన్యం ఇప్పుడు క్రికెట్‌ బోర్డుపై గెలిచింది. కాగా, ఈ తీర్పుపై బీసీసీఐ న్యాయ సలహాదారు సంస్థ మనియార్‌ శ్రీవాస్తవ అసోసియేట్స్‌ స్పందిస్తూ.. ‘తీర్పు పూర్తి కాపీ కోసం ఎదురుచూస్తున్నాం. దాన్ని అందుకున్నాక, మా తదుపరి చర్యలేంటన్నది ప్రకటిస్తాం’ అని వ్యాఖ్యానించింది. 

Updated Date - 2020-07-18T08:57:30+05:30 IST