మ్యాచ్ ఫిక్సింగ్‌కు మరో క్రికెటర్ బలి.. 6ఏళ్ల నిషేధం

ABN , First Publish Date - 2020-05-11T01:34:44+05:30 IST

పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం పడిన విషయాన్ని మరిచిపోక ముందే మరో క్రికెటర్‌ ఫిక్సింగ్ మహమ్మారి కోరల్లో...

మ్యాచ్ ఫిక్సింగ్‌కు మరో క్రికెటర్ బలి.. 6ఏళ్ల నిషేధం

కాబూల్: పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం పడిన విషయాన్ని మరిచిపోక ముందే మరో క్రికెటర్‌ ఫిక్సింగ్ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నాడు. ఆఫ్ఘాన్ కీపర్ షఫికుల్లా షఫిక్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు 6ఏళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అతడిపై నాలుగు రకాల కేసులను ఏసీబీ(ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు) నమోదు చేసింది. వీటికి సంబంధించి తాను తప్పు చేసినట్లు షఫిక్ అంగీకరించాడు కూడా. ఆఫ్ఘాన్ ప్రీమియర్ లీగ్‌ 2018, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2019 టోర్నీలలో ఆడిన షఫిక్.. ఏసీబీ యాంటీ కరప్షన్ కోడ్‌‌లోని నాలుగు విధులను అతిక్రమించినట్లు ఏసీబీ పేర్కొంది. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడడంతో పాటు, మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించిన వారి గురించి బోర్డుకు తెలియపరచకపోవడం వంటి తప్పులకు షఫిక్ చేసినట్లు వెల్లడించింది.


ఏసీబీ యాంటీ కరప్షన్ కోడ్ సీనియర్ మేనేజర్ సయ్యద్ అన్వర్ సా ఖురేషీ మాట్లాడుతూ, ‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ సీనియర్ క్రికెటర్ ఇలాంటి తప్పులకు పాల్పడడం బాధాకరం అన్నారు. ఏసీఎల్ 2018లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు షఫిక్ అంగీకరించాడు. బీపీఎల్ 2019 సందర్భంగా కూడా ఫిక్సింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మరో జట్టు సభ్యుడిని కూడా ఫిక్సింగ్‌ చేసేందుకు షఫిక్ పురిగొలిపాడు. అయితే అది ఫలించలేద’ని ఖురేషీ చెప్పుకొచ్చారు. ఈ శిక్ష మిగతా ఆటగాళ్లకు ఓ గుణపాఠంలా ఉంటుందని, క్రికెట్‌లో తప్పుడు పనులు చేసి తప్పించుకోగలమని అనుకోవద్దని హెచ్చరించారు. 


ఇదిలా ఉంటే 30  ఏళ్ల షఫికుల్లా షఫిక్‌పై 6 ఏళ్ల నిషేధం విధించడంతో అతడు మళ్లీ జాతీయ జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ఇప్పటివరకు 24 వన్‌డే మ్యాచ్‌లు ఆడిన షఫిక్ 430 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే 46 టీ20ల్లో పాల్గొని 494 రన్స్ చేశాడు.

Updated Date - 2020-05-11T01:34:44+05:30 IST