ప్రజారాజ్యం నుంచి ఆఫరొచ్చినా చెయ్యలేదు

ABN , First Publish Date - 2020-02-08T08:51:49+05:30 IST

బాలనటిగా మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న నటి రోజారమణి. ‘ఒడియా ఎన్టీఆర్‌’ అని పెద్ద పేరు తెచ్చుకున్న హీరో చక్రపాణి.

ప్రజారాజ్యం నుంచి ఆఫరొచ్చినా చెయ్యలేదు

బాలనటిగా మొదటి సినిమాకే జాతీయ అవార్డును అందుకున్న నటి రోజారమణి. ‘ఒడియా ఎన్టీఆర్‌’ అని పెద్ద పేరు తెచ్చుకున్న హీరో చక్రపాణి. సినిమాల్లోనే కాకుండా, భార్యాభర్తలుగా జీవితంలోనూ కలిసి నడుస్తున్న రోజారమణి - చక్రపాణి జంట 22-9-13న ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి ఎం.డి. వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో పాల్గొన్నారు. ఆ వివరాలు... 


నమస్కారం, ‘ఓపెన్‌హార్ట్‌’ కార్యక్రమానికి స్వాగతం. ఎన్ని సంవత్సరాల సినిమా జీవితం మీది?

చక్రపాణి : సినిమా పరిశ్రమలో ఆమెది 47, నాది 35- 36 ఏళ్ల అనుభవం.

రోజా : నేను పరిశ్రమలోకి బాలనటిగా వచ్చాను కదా. అందువల్ల నా అనుభవం ఎక్కువ. మేమిద్దరం కలిసి నటించింది ‘పునర్మిలన్‌’ అనే ఒడియా సినిమాలో. అదే ఈయనకు తొలి సినిమా.

చక్రపాణి : మన ఎన్టీఆర్‌గారు చేసిన ‘ఆడపడుచు’ను ఒడియాలో పునర్మిలన్‌గా తీశారు. అది పెద్ద హిట్టు..


రీల్‌ లైఫ్‌ నుంచి రియల్‌ లైఫ్‌లోకి హీరోహీరోయిన్లుగా వచ్చారు, ఎలా అనిపిస్తోంది?

రోజా : ముప్పయ్యేళ్లు దాటిపోయింది, ఇన్నేళ్లయిపోయిందా అనిపిస్తుంది. భగవంతుడి దయవల్ల హ్యాపీగా ఉన్నాం.


సినిమా వాళ్ల మేరేజ్‌ సక్సెస్‌ రేట్‌ తక్కువ. కాని మీరు అన్యోన్యంగా, సరదాగా ఉన్నారు. దీనికి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా సర్దుకుపోయినట్టు?

రోజా : ఒక్కరని చెప్పలేం.

చక్రపాణి : బండి నడవాలంటే రెండు ఎద్దులూ సమానంగా లాగాలి. దటీజ్‌ లైఫ్‌. అయినా నేను ఎక్కువ సర్దుకుపోయాను.

రోజా : ఆయన్నడిగితే ఆయన, నన్నడిగితే నేను - ఎవర్నడిగితే వాళ్లే ఎక్కువ సర్దుకుపోయామని చెబుతాం. ఏవో చిన్నచిన్నవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. అవి తప్పితే సర్దుకుపోయేంత పెద్ద సమస్యలేం లేవు. కుటుంబానికో, వ్యాపారానికో సంబంధించిన పెద్దపెద్ద నిర్ణయాలు ఏవైనా కలిసే తీసుకుంటాం.


మీ ఇద్దరిలో ముందు ఎవరు ప్రపోజ్‌ చేశారు?

రోజా : ఇద్దరం మాట్లాడుకున్నాం. మేం చేసిన తొలి సినిమాలో, తొలి సీనే పెళ్లిచూపులు. హేమాంబరధరరావుగారు నన్ను పిలిచి ‘అమ్మా రోజా, ఈ అబ్బాయి చక్రపాణి అని మన తెలుగబ్బాయే... ఒడియా బాగా వచ్చు’ అని పరిచయం చేశారు. అలా మేం ఐదు సినిమాల్లో నటించాం.

చక్రపాణి : అన్నీ మంచి సినిమాలు. సీతా లవకుశ, సతీ అనసూయ లాంటివి.

రోజా : ఆ సమయంలో ఈయన క్రమశిక్షణ, మాటతీరు, నెమ్మదితనం చూసి ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందనిపించింది. ఇద్దరం పెద్దవారికి చెప్పాం. ఎవరికీ ఏ అభ్యంతరాలూ లేవు. వెంటనే పెళ్లయిపోయింది. అప్పటికి నాకు 22 ఏళ్లు.


చిన్నవయసే కదా. పెళ్లయ్యాక ఎందుకు నటించడం మానేశారు? చక్రపాణిగారు వద్దన్నారా?

రోజా : అయ్యో, అదేమీ లేదండి. చిన్నప్పట్నుంచీ సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచమే తెలియదు. దర్శకులే నా టీచర్లు, తోటి నటీనటులే సహవిద్యార్థులు అన్నట్టుండేది.


దాంతో పెళ్లయ్యాక ఒక మూడు నెలలు బ్రేక్‌ తీసుకుందామనుకున్నా. నచ్చినప్పుడు నిద్ర లేవడం, సాయంత్రం సరదాగా బైట తిరగడం.. అలా కాలం గడిచిపోయింది. ఈలోగా మా బాబు పుట్టడం, సరదాగా వాణ్ని చూసుకోవడం - చివరికి అదే బాగుందనిపించి అలాగే కంటిన్యూ అయిపోయాను.

చక్రపాణి : నేనేమీ వద్దనలేదు. తనకెలా కావాలంటే అలా చేసుకోమన్నా.

రోజా : ఈయనగాని, ఈయన తల్లిదండ్రులుగాని, నా పేరెంట్స్‌గాని - ఎవ్వరూ ఇది వద్దు, ఇలా చెయ్యి అనలేదు. అన్నా నేను వినను కూడా. నటన దేవుడిచ్చిన వరం.


ఇప్పుడు మీ వ్యాపకం ఏమిటి?

చక్రపాణి : కొంతకాలం ఒడియా సినిమాలు తీశాను, తర్వాత ఛానెల్‌ నడిపాను, ఈమధ్య వరకూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశాను.


ఒకరికొకరు ఎన్ని మార్కులేసుకుంటారు?

రోజా : భర్తగా 60 శాతం, తండ్రిగా వంద శాతం.

చక్రపాణి : భార్యగా 60 శాతం, తల్లిగా వంద శాతం. పిల్లల విషయంలో అన్నీ తనే చూసుకుంటుంది.


40 శాతం ఎందుకు తక్కువ వచ్చాయి?

రోజా : ఏదైనా చెప్పగానే ఈయన నో అంటారు. ఉదాహరణకు మేమంతా సినిమాకెళతాం అంటే నేను రాను అంటారు, మళ్లీ రెడీ అయిపోతారు. వంట చేస్తే వంకలు పెడతారు. ఎవరైనా డ్రైవింగ్‌ చేస్తే నచ్చదు.

చక్రపాణి : అన్ని సినిమాలూ చూడలేను నేను. కొంచెం సందేశాత్మకంగా ఉంటే ఇష్టం. కానీ వీళ్లను హర్ట్‌ చెయ్యలేక వెళుతుంటాను. ఇక వంటంటారా, నేను అన్నిటినీ జాగ్రత్తగా చెయ్యాలంటాను. నాకు చిన్నప్పటి నుంచీ క్రమశిక్షణ, ఫ్రాంక్‌నెస్‌ అలవాటు.

రోజా : లౌక్యం తెలియదు ఈయనకు. ఒక సినిమా చూసొచ్చాక ప్రొడ్యూసర్‌ ఎలా ఉంది అని అడిగితే, ‘ఏం బాగాలేదు’ అని మొహమ్మీదే చెప్పేసి వచ్చేశారు. అలా చెప్పనవసరం లేదు కదా. ‘ఆల్‌ ద బెస్ట్‌’ అనో మరోటనో చెబితే సరిపోదా?


సినిమా పరిశ్రమకూ, ఫ్రాంక్‌నెస్‌కూ ఎలా పొసుగుతుంది?

చక్రపాణి : నేనొచ్చిన నేపథ్యం వేరు. నాకు కష్టసుఖాలు తెలుసు. ఇక్కడ అడ్జెస్ట్‌ అవడం కష్టమైంది. ‘కప్పు కాఫీ తాగితే, అది తిరిగి ఇచ్చేదాకా రుణపడి ఉంటావు. అది తీర్చడం కోసం మరో జన్మ ఎత్తాలి’ అని చెప్పేవారు మా నాన్న. అది బాగా ముద్రపడిపోయింది. తర్వాత నేను జైనమతాన్ని పరిశీలించా. మంత్రదీక్ష కూడా తీసుకున్నా. జీవహింస చెయ్యకూడదని నాన్‌వెజ్‌ మానేశా. కేక్‌, బిస్కట్‌ కూడా తినేవాణ్ని కాదు. దీనివల్ల మిగిలినవారితో వేరయిపోయాను. కానీ న్యాయం, ధర్మం అని కూర్చుంటే వేరేవాళ్లు అడ్డదారిలో ముందుకెళ్లిపోవడాన్ని గమనించాను. స్నేహితులు కూడా నచ్చజెప్పారు, దాంతో ఆ నమ్మకాలన్నీ వీగిపోయాయి.


మీ నేపథ్యం గురించి చెప్పండి.

చక్రపాణి : మా నాన్న రైల్వేలో మెకానికల్‌ ఇంజనీర్‌గా ఖుర్దాలో పనిచేసేవారు. మేం ముగ్గురన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెళ్లు మాకు. నేనొకసారి వైజాగు నుంచి మద్రాసు - హౌరా మెయిల్లో ఖుర్దా వెళుతున్నప్పుడు బాలయ్యగారు నన్ను చూసి ‘ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరు, సినిమాల్లో ప్రయత్నించు’ అని చెప్పారు. అలా నేను పరిశ్రమలోకి వచ్చాను. ఒడియా బాగా రావడం వల్ల - తెలుగులో రామారావుగారు చేసిన హిట్‌ సినిమాలన్నీ నేను ఆ భాషలో చేశాను.


మీరు ఏ వయసులో సినిమాల్లోకి వచ్చారు?

రోజారమణి : 1966లో భక్త ప్రహ్లాదతో నేను 5 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చాను. మా నాన్న సత్యంగారు సినిమా జర్నలిస్టుగా పనిచేసేవారు. మమ్మల్ని ఎప్పుడూ సినిమాలకుగాని, షూటింగులకుగాని తీసుకెళ్లేవారే కాదు. ఒకరోజు పిల్లలంతా ఆడుకుంటున్నప్పుడు సినిమా స్టూడియో నుంచి ఒక వ్యాన్‌ వచ్చింది. అందరం ఎక్కాం. వాళ్లు పేర్లన్నీ సరిచూసుకుని, ఆ జాబితాలో నా పేరు లేదని దింపేశారు. నేను ఒకటే ఏడుపు. ఏం జరిగిందని నాన్నొచ్చి అడిగితే ఇలాగైందని చెప్పాను. ‘నేనొక డైలాగ్‌ చెబుతాను, నువ్వు సరిగ్గా చెబితే తీసుకెళ్తాను’ అన్నారు. ‘ఇప్పుడు ఏడ్చుకుంటూ వెళ్లి అమ్మను పట్టుకో’ అంటే నేను నవ్వుకుంటూ వెళ్లాను. ‘ఏడవమంటే ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి.. ఇలాగైతే నువ్వేం సినిమా చేస్తావు’ అన్నారు. రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను.


మర్నాడు మా నాన్న సహోద్యోగి జీవీజీగారని ఆయన వచ్చి ‘కుట్టి ఇలా ఎందుకుంది’ అనడిగి, ఏవీఎమ్‌ స్టూడియోకు తీసుకెళ్లారు. అప్పటికి భక్తప్రహ్లాద షూటింగ్‌కు అంతా రెడీ. కానీ ప్రహ్లాదుడే దొరకలేదు. వాళ్లు అడగ్గానే నేను ‘గోదారి గ ట్టుంది...’ అని డ్యాన్స్‌ చేసి చూపించా. తర్వాత మేకప్‌ టెస్ట్‌ చేసి, ఫోటోషూట్‌ చేసి సరిపోయాననుకున్నారు. కానీ ‘ఈ పాప పాములతో, మంటలతో, అన్నిటినీ మించి ఎస్వీరంగారావుగారితో చెయ్యాలి. సెట్లోకి వెళ్లాక చెయ్యలేకపోతే కష్టం. ముందే ఒకసారి ప్రయత్నిద్దాం’ అనుకుని ఒక పామును తెచ్చి మెడలో వేశారు. మా అమ్మ భయపడిందిగాని, నేను భయపడలేదు. ముందే నేర్పించిన పాటకు లిప్‌ మూమెంట్‌ ఇమ్మంటే ఇచ్చేశాను. అలా ‘భక్తప్రహ్లాద’లో వేషం దొరికింది. అప్పట్లో నెలకు వెయ్యి రూపాయలు. జీతంలాగా.


మొదటి సినిమాతోనే మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా...

రోజా : అవును. ఆ సినిమాను రాష్ట్రపతి రాధాకృష్ణన్‌గారికి చూపెట్టారు. ఆయన సగం చూశాక, ‘ఈ అబ్బాయి బాగా చేశాడు’ అన్నారట. ‘అబ్బాయి కాదండి, అమ్మాయి’ అని చెబితే, ‘నేను ఆ పాపను చూడాలి’ అన్నారట. వెంటనే వాళ్లు ఢిల్లీ నుంచి ఫోన్‌ చేసి మర్నాటికల్లా వచ్చెయ్యమని చెప్పారు. మా నాన్న ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. మర్నాడు వెళ్లి రాష్ట్రపతితో పాటు మిగిలిన సగం సినిమా చూసి, భోజనం చేసి వచ్చేశాను. అప్పుడేమీ తెలియదు గాని, ఇప్పుడు తల్చుకుంటే అది గొప్పగా అనిపిస్తుంది. మొదట పనిమనిషి పాత్రనుకున్నా.. దానికి అవార్డు వచ్చింది..


ఇక అక్కణ్నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదనుకుంటా..

రోజా : పెళ్లయ్యేంత వరకూ, ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. దక్షిణాది భాషలన్నిటితో పాటు ఒరియా, హిందీ సినిమాలు కూడా చేసేదాన్ని. ఒక్కరోజు షూటింగ్‌ లేదంటే ఏడుపొచ్చేసేది.


అంత ఇష్టమన్నమాట. పన్నెండేళ్ల వయసులో ఇటు చిన్న కాదు, అటు పెద్ద కాదు - అని మా నాన్న మానెయ్యమన్నారు. అప్పుడే ‘చెంబరతి’ అని మలయాళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. కానీ అది పనిమనిషి పాత్ర. ముందు నచ్చలేదు గాని, తర్వాత మంచి పాత్ర అని అర్థమయింది. ఎవరు చూస్తార్లే అనుకుంటే, అది రికార్డులు సృష్టించింది. దానికీ అవార్డు వచ్చింది.


హీరోయిన్లకు ఎప్పుడు గౌరవం ఎక్కువ ఉండేది? అప్పుడా ఇప్పుడా?

రోజా : కాలాన్ని బట్టి అన్నీ మారుతున్నాయి. హీరో, హీరోయిన్లనే కాదు, ఒకప్పుడు అందరికీ అందరిపట్లా చాలా గౌరవం ఉండేది. అప్పట్లో నిర్మాత అంటే భగవంతుడితో సమానం. ఇప్పుడు అన్నీ తగ్గుతున్నాయి...


చక్రపాణిగారూ, మీరెందుకు విరమించుకున్నారు?

చక్రపాణి : సీత గీత దాటితే, నిమజ్జనం తర్వాత నాకు ఒడియాలోనే ఎక్కువ అవకాశాలొచ్చాయి. ఎన్టీఆర్‌ చేసిన హిట్లన్నీ నాకు ఇచ్చేవారు. తెలియకుండానే ఆ దారిలోకి వెళ్లిపోయాను. రజనీకాంత్‌ నాకు ఒకేడాది సీనియర్‌. రాజేంద్రప్రసాద్‌ నా రూమ్మేట్‌. చిరంజీవి, సుధాకర్‌ నాకు జూనియర్లు. పరిశ్రమలో పిసరంత లక్కు కూడా ఉండాలి. ‘కుక్కకాటుకు చెప్పుదెబ్బ’ సినిమా కోసం నన్ను ఖాయం చేసి ఆఫీసుకు రమ్మన్నారు. అప్పుడే చిరంజీవి ‘నన్ను కూడా తీస్కెళ్లి పరిచయం చెయ్యండి’ అని అడిగారు.

 

మేమిద్దరం ఆ ఆఫీసుకెళ్లి కూర్చుంటే వాళ్లకు అతను నచ్చాడు. అది కొంచెం రఫ్‌ అండ్‌ టఫ్‌ పాత్ర. దాంతో అది చిరంజీవికి వచ్చింది. సినిమాల్లో లక్‌ అంటే అదన్నమాట. నాకు పబ్లిసిటీ తెలియదు, చెప్పేవాళ్లు లేరు. నెట్‌వర్క్‌ పెంచుకోలేదు. నన్నందరూ ‘ఒడియా ఎన్టీఆర్‌’ అనేవారు. ఆ తర్వాత రామోజీరావుగారి నుంచి పిలుపొచ్చింది. ఈటీవీ ఒరియా అంతా నేనే చూసుకునేవాణ్ని. తర్వాత రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంలోకి వచ్చాను. అంతకుముందు నేను ట్రాన్స్‌పోర్ట్‌, హోటల్‌ ఇలాంటి చాలా వ్యాపారాలు చేశాను.


మీరు డబ్బింగ్‌ వైపు ఎలా వచ్చారు?

రోజా : తరుణ్‌ కొంచెం పెద్దయ్యాక డబ్బింగ్‌ చెప్పమని అడిగేవారు. మొదట్లో ఎందుకులే అని వద్దనుకున్నాను. మురళీమోహన్‌గారు ‘నిర్దోషి’కి చెయ్యమని అడిగితే కాదనలేకపోయాను. అది పెద్ద హిట్టు. దాంతో సుహాసినికి చాలా అవకాశాలు వచ్చాయి. అలా నేను రాధ, రాధిక, విజయశాంతి, యమున - వీళ్లందరికీ... దాదాపు 400 సినిమాల్లో డబ్బింగ్‌ చెప్పాను.

చక్రపాణి : తను ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లకూ డబ్బింగ్‌ చెప్పిందొకసారి. రాఘవేంద్రరావుగారు తీసిన సినిమా అది.

రోజా : ‘చిత్రం భళారే విచిత్రం’లో నరేశ్‌ ఆడగొంతుకు చెప్పింది నేనే.


మీ అబ్బాయిని ఆర్టిస్టును చెయ్యాలని ఎందుకు అనిపించింది?

రోజా : ఒక పెళ్లిలో నేను వాడినెత్తుకుని తిరుగుతుంటే మణిరత్నంగారి కోడైరెక్టర్‌ చూసి ఇంటికొచ్చి అడిగారు. మేం వాణ్ని సినిమాల్లోకి పంపాలని అనుకోలేదుగాని మణిరత్నంగారు అడిగారు కదాని మా తమ్ముణ్నిచ్చి పంపించాను. అలా వాడు ‘అంజలి’కి సెలెక్ట్‌ అయ్యాడు. షూటింగుకు మా చెల్లెల్ని పంపాను. అది పెద్ద హిట్‌. తరుణ్‌కు జాతీయ అవార్డు వచ్చిందని వార్తల్లో చూసినప్పుడు నాక్కూడా మానాన్నలాగా ఆనందంతో కళ్లనీళ్లొచ్చేశాయి. తల్లికీ కొడుక్కూ ఒకేలాగా గుర్తింపు రావడం అరుదు.


తరుణ్‌ కూడా ఉవ్వెత్తున వచ్చి డల్‌ అయిపోయినట్టున్నాడు...

రోజా : వాడికి క్రికెటర్‌ అవాలని ఉండేది. నాకు వాణ్ని లండన్‌ పంపించి ఎంబీయే చదవించాలని ఉండేది. పీసీ శ్రీరామ్‌గారు తీసిన యాడ్‌లో నటించాడు. అది చూసి అవకాశాలు వచ్చాయి. నీకేది ఇష్టమైతే అది చెయ్యి అని చెప్పాం. పరిశ్రమలో ఎగుడుదిగుళ్లు సహజమే.


తరుణ్‌ అమ్మకూచి అంటారు నిజమేనా?

రోజా : అబ్బాయిలు తల్లితో క్లోజ్‌గా ఉండటం, అమ్మాయిలు తండ్రికి దగ్గరగా ఉండటం మామూలే కదా. వాడు పరిశ్రమలోకి చిన్నప్పుడే వచ్చాడు. ‘కథలు వినడానికి మీరు కూడా రండి’ అని వాడితోపాటు నన్ను కూడా పిలిచేవారు. వాడికి కథ నచ్చకపోతే ఆ విషయాన్ని నన్ను చెప్పమనేవాడు. దానివల్ల ‘అన్నీ ఆవిడే చూసుకుంటుంది’ అని పుకారొచ్చింది. కొన్నాళ్లయ్యాక ‘అన్నీ నువ్వే చూసుకో’ అని చెప్పేశాను. అయినా హిట్టయితే ‘ఆవిడ బాగా చేసింది’ అంటారు, లేకపోతే ఇలా మాట్లాడతారు.


ఇప్పుడున్న యూత్‌లో ప్లస్‌లూ మైనస్‌లూ ఏం కనిపిస్తున్నాయి?

రోజా : మా చిన్నప్పుడు మర్ఫీ రేడియోను సైతం ముట్టుకోనిచ్చేవారు కాదు. కాని ఇప్పుడు సెల్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ అన్నీ వాళ్ల చేతిలో ఉన్నాయి.


తరుణ్‌ పెళ్లెప్పుడు?

రోజా : తర్వలోనే. పిల్లలిద్దరికీ ఒకేసారి చేసెయ్యాలనుకుంటున్నాం.


ఎవ్వరికీ చెప్పని విషయాలేమైనా ఉన్నాయా? 

రోజా : అలాంటివేం లేవు. ఒకవేళ ఉన్నా ఎవరితో చెప్పుకోను. నాలోనేనే మాట్లాడుకుంటాను. నన్ను ఎవరైనా హర్ట్‌ చేస్తే ఇక వాళ్లతో మాట్లాడను.

చక్రపాణి : నేనే విషయాన్నీ మనసులో దాచుకోను. ఎప్పటిది అప్పుడు తేలిపోవాలి. నాకు కోపం ఉన్నంతసేపే, తర్వాత ఇక ఏమీ ఉండదు.


తర్వాత లైఫ్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు?

రోజా : పిల్లల పెళ్లి చెయ్యాలి. నాకు సేవ అంటే ఇష్టం. ప్రజారాజ్యం నుంచి ఆఫరొచ్చినా చెయ్యలేదు. నాకు ఇందిరాగాంధీ, మదర్‌ థెరిసా అంటే ఇష్టం. మూగజంతువులకు సేవ చెయ్యాలనుకుంటున్నా.

చక్రపాణి : జంతువులకుండే విశ్వాసం మనుషులకుండదు. నిష్టూరంగా అనిపించినా ఇది నిజం.


మీరనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. ధేంక్యూ.

Updated Date - 2020-02-08T08:51:49+05:30 IST