బాహుబలి చూశా.. అది వాపే కాని బలుపు కాదు.. అంత కష్టపడనక్కర్లేదు

ABN , First Publish Date - 2020-02-08T08:12:50+05:30 IST

దొర ఏందిరో, దొర పీకుడేందిరో అంటూ దొరల పెత్తనాన్ని ఎదిరించి, దళితుల్లో బలాన్ని నింపి, అప్పట్లోనే సంచలనమైన మాభూమి సినిమా కథను రాసి, నిర్మాతగా పనిచేసిన వ్యక్తి బి. నరసింగ రావు.

బాహుబలి చూశా.. అది వాపే కాని బలుపు కాదు.. అంత కష్టపడనక్కర్లేదు

దొర ఏందిరో, దొర పీకుడేందిరో అంటూ దొరల పెత్తనాన్ని ఎదిరించి, దళితుల్లో బలాన్ని నింపి, అప్పట్లోనే సంచలనమైన మాభూమి సినిమా కథను రాసి, నిర్మాతగా పనిచేసిన వ్యక్తి బి. నరసింగ రావు. కేవలం ఒక అర డజను సినిమాలు మాత్రమే తీసినా తనకు డైరెక్టర్‌గా, నిర్మాతగా అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చిందంటున్నారాయన. '45 సంవత్సరాల్లో 4 సినిమాలు చేశానంటే, వాటిలో నా ప్రాణం పెట్టి తీశానని, అందుకే అవి చాలా విలువైనవి' అని అంటున్నారాయన. మీకు చంద్రబాబుతో, పీవీ నరసింహరావుతో పరిచయం ఉంది కదా, మరి రాజకీయంగా ఎప్పుడూ ప్రయత్నించలేదా అని అడిగితే, రాజకీయంలో భాదలే కానీ, సుఖాలు లేవని కుండబద్దలు కొట్టి క్లారిటీ ఇచ్చారాయన. ఇంకా తన వ్యక్తిగత, సినిమాపరమైన ఎన్నో విశేషాల గురించి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 07-01-2018న నిర్వహించినటువంటి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారాయన... ఆ పూర్తి వివరాలు ఇవే....

 

ఆర్కే: ఒక అరడజను సినిమాలు తీశారా? నిర్మాతగా, దర్శకునిగా..?

నరసింగరావు: 6 సినిమాలకు డైరెక్షన్‌ చేశాను. అందులో ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించాను.

 

ఆర్కే: తీసినవి కొన్ని సినిమాలే అయినా అంతర్జాతీయంగా పేరొచ్చింది. ఈ నలభై ఏళ్ల సినీ ప్రయాణం ఎలా అనిపించింది?

నరసింగరావు: సినిమా అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. నటుడు కావాలనే కోరిక ఉండేది. ఫైన్‌ ఆర్ట్స్‌ చదువుతున్నప్పుడు ఆర్‌.ఆర్‌ ల్యాబ్స్‌లో ఒక ఫిల్మ్‌క్లబ్‌ ఉండేది. అక్కడ సత్యజిత్‌రే సినిమాలు వేస్తున్నారు. నన్ను పిలిస్తే వెళ్లాను. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి అబ్బాయి మాతో చదువుకున్నాడు. తను అక్కడికొచ్చాడు. అప్పటి వరకు సినిమా అంటే ఆటలు, పాటలు, జానపదం. ఆ సినిమా ప్రభావం చాలా పడింది. సినిమాలను జీవితానికి ఇంత దగ్గరగా, సహజంగా ఉండేలా తీయొచ్చా? అనిపించింది. అప్పుడే నాలో ఆలోచన మొదలయింది. తరువాత ఫైన్‌ఆర్ట్స్‌ చదువు పూర్తయ్యాక మా నాన్నగారు ‘ఫ్యామిలీని ఉద్ధరిస్తాడు వీడు’ అని తీసుకెళ్లాడు. నాకేమో అటు మనసు వినలేదు. నాటకాలు, పాటలు, ‘జననాట్యమండలి’లో యాక్టివ్‌గా ఉన్నాము. ఆ టైంలోనే ఎమర్జెన్సీ. అయితే మేం చేసిన యాక్టివిటీ నాటకరంగానికి సంబంధించినదే తప్ప పొలిటికల్‌ కాదు.

 

ఆర్కే: ఎంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు?

నరసింగరావు: రెండు సంవత్సరాలు.

 

ఆర్కే: అజ్ఞాతం అంటే ఎక్కడుండే వారు? ఇప్పటి వాళ్లకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ!

నరసింగరావు: వాళ్లకు దొరక్కుండా ఉండాలి. హైదరాబాద్‌లోనే ఉండేవాళ్లం. పోలీస్‌ ఇంటరాగేషన్‌లో ఎమర్జెన్సీ టైంలో ఎక్కడున్నారని అడిగారు. గడిచిన ఆరునెలలుగా మెహిదీపట్నంలో ఉంటున్నాం అని చెప్పా. అప్పుడు ఆ పోలీస్‌ అధికారి ‘‘మా ఇంటి పక్కనే ఉంటున్నారు, కానీ మాకు దొరకడం లేద’’ని అన్నారు. అజ్ఞాతం నుంచి బయటకొచ్చాక ఏం చేయాలనుకుంటుంటే రవీంద్రనాథ్‌ అని ఫ్రెండ్‌ ఉండేవాడు. తను లెఫ్టిస్ట్‌. తను ‘నీకు సినిమా అయితే బాగుంటుంది’ అని చెప్పి తీసుకెళ్లాడు. తర్వాత దర్శకుడు గౌతమ్‌ఘోష్‌ పరిచయం కావడం, సినిమా తీయడం జరిగింది.

 

ఆర్కే: మీది భూస్వామ్య కుటుంబం. కానీ వామపక్ష భావజాలం వైపు వెళ్లడానికి ఎవరైనా వ్యక్తులు కారణమా? సంఘటనలా?

నరసింగరావు: ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నేనీ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. ఒకరోజు నేను ఫైన్‌ ఆర్ట్స్‌లో కాలేజ్‌లో అడ్మిషన్‌ కోసం వెళ్లాను. అక్కడ అందరూ బొమ్మలు గీస్తున్నారు. నేను వెళ్లి టెస్టు రాద్దామని కూర్చున్నాను. ఒక బ్లేడ్‌ ఇచ్చి గీయమన్నారు. అది కూడా గీయరాలేదు. టెస్టు పాసైతేనే సీటొస్తుంది. నాకు గురుమూర్తి అని ఫ్రెండ్‌ ఉండేవాడు. తను అక్కడ పనిచేసే విఠల్‌ అనే టీచర్‌తో ‘తను నటుడు’ అని పరిచయం చేశాడు. ఆయన నాటకాలు రాస్తుంటాడు, ఆడిస్తుంటాడు. అతను నా దగ్గరకొచ్చి బేరంపెట్టాడు. ‘నువ్వు నాటకాలు వేస్తావట కదా! వేస్తావా?’ అని అడిగాడు. ‘వేస్తాన’ని చెప్పాను. అప్పటికే రవీంద్రభారతిలో నాటకాలు వేశాను. ఆయనే ఫైన్‌ఆర్ట్స్‌లో సీటిప్పించాడు. మా రూమ్మేట్‌ రవీంద్రనాథ్‌ పక్కా కమ్యూనిస్టు. ఆయన ఆ పుస్తకాలన్నీ తెచ్చేవాడు. నాకు కమ్యూనిజం నచ్చేది కాదు. మా ఇద్దరి మధ్య రోజూ మాటల యుద్ధం నడిచేది. ‘రెండేళ్లు ఆగు, వాళ్లు వీళ్లు, వీళ్లు వాళ్లు’ అవుతారు అని అనేవాడు. కాలక్రమేణా శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, గోర్కీ ‘అమ్మ’ పుస్తకాలు పరిచయం చేశాడు. అవి చదివాక నాలో చాలా మార్పు వచ్చింది.

 

ఆర్కే: మీ బ్రదర్స్‌, సిస్టర్స్‌ ఎంత మంది?

నరసింగరావు: బ్రదర్స్‌ ఐదుగురు, సిస్టర్‌ ఒకరు.

 

ఆర్కే: ‘దాసి’ సినిమా ఆల్‌టైం హిట్‌. దొరల గడీల్లోనే పెరిగిన మీరు ఆ సినిమాను ఎలా తీయగలిగారు. ఆ సినిమాలో చూపించిన సన్నివేశాలు మీ ఇంట్లో చూశారా?

నరసింగరావు: ఆ రోజుల్లో అంటరానితనం చాలా ఎక్కువగా ఉండేది. అయితే మా నాన్న అలాంటివి పట్టించుకునే వాడు కాదు. అభ్యుదయవాది. నేను ఆరేడేళ్ల వయస్సున్నప్పుడు మా ఇంట్లో అరవై, డెబ్భై మంది పనివాళ్లు ఉండేవారు. ఉదయాన్నే లేచి చలికాచుకునే వారు. నేను ఎప్పుడైనా పొద్దున లేస్తే వెళ్లి మంట దగ్గర కూర్చుంటే వాళ్లు దూరం జరిగేవాళ్లు. వాళ్లనూ, వాళ్ల పేదరికాన్నీ చూస్తే బాధనిపించేది. మా ఇంటి పక్కన గొల్లోళ్లు ఉండేవారు. మా ఇంట్లో తెలియకుండా వాళ్ల ఇంటికెళ్లి కూర్చుండేవాణ్ణి. మా చుట్టాల ఇంటికెళ్లినప్పుడు పనివాళ్లను బండ బూతులు తిట్టడం విన్నాను. ఆ అనుభవంతోనే ‘మా ఊరు’ సినిమాకు డైలాగులు రాశాను. నేను విన్నవే రాశాను.

 

ఆర్కే: ‘దాసి’ సినిమా తరువాత మీ బంధువులు, మీ కమ్యూనిటీ వాళ్లు ఏమీ అనలేదా?

నరసింగరావు: చెబితే నమ్మరు కానీ ఇప్పటికీ మా బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు వెళితే అందరూ విష్‌ చేస్తారే తప్ప పెద్దగా మాట్లాడరు. ఇప్పటికీ వారికి నేను నక్సలైట్‌నే! వాళ్ల వారిలో ఒకరిగా నన్ను కౌంట్‌ చేయరు.

 

ఆర్కే: ‘దాసి’ సినిమాకు రాష్ట్రప్రభుత్వ అవార్డు రాలేదనుకుంటా?

నరసింగరావు: రాలేదు.

 

ఆర్కే: చదివింది పీయూసీ కదా! ఇంగ్లీష్‌ భాష మీద అంత పట్టెలా వచ్చింది?

నరసింగరావు: నా జీవితంలో ఏదీ నేను గురుతః నేర్చుకోలేదు. నా సొంతంగా ప్రాక్టీస్‌ ద్వారా నేర్చుకున్నాను. ఒక్క పెయింటింగ్‌ మాత్రమే ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌లో నేర్చుకున్నాను.

 

ఆర్కే: మీకు చాలా చిన్న వయసులో పెళ్లయింది అనుకుంటా?

నరసింగరావు: 17 ఏళ్ల వయసులో పెళ్లయింది. 22 ఏళ్లకే నలుగురు పిల్లలు.

 

ఆర్కే: పిల్లలు ఏం చేస్తున్నారు?

నరసింగరావు: ఒక అమ్మాయి ఎంఎ ఇంగ్లీష్‌ లిటరేచర్‌ చేసింది. పెద్దబ్బాయి అటోమొబైల్స్‌లో ఉన్నాడు. రెండోవాడు కంప్యూటర్‌సైన్స్‌. మూడోవాడు ఫిల్మ్‌మేకింగ్‌.


ఆర్కే: మాభూమి, ‘దాసి’లాంటి సినిమాలు తీసిన మీకు ‘హరివిల్లు’ సినిమా తీయమని రామానాయుడు ఆఫర్‌ ఎలా ఇచ్చారు?

నరసింగరావు: రామానాయుడుకు నాతో సినిమా తీయాలని కోరిక. ఏదో కథ అనుకున్నాం కానీ కుదరలేదు. ఒకసారి చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వెళ్లాము. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల సినిమాలకు సబ్సిడీ కూడా ఇస్తోందప్పుడు. చేస్తే మనం బాగుంటుందేమో అంటే ‘మీరు రేపే రండి! మాట్లాడదాం’ అన్నారు. నేను చెప్పిన కథ నచ్చింది. అలా ‘హరివిల్లు’ సినిమా వచ్చింది.


ఆర్కే: ఇటీవల కాలంలో మీరు కమర్షియల్‌ సినిమాలు చూస్తున్నారా?

నరసింగరావు: పెద్దగా లేదు. గత ముప్ఫై నలభై ఏళ్లుగా నేను థియేటర్‌కు వెళ్లింది నాలుగైదు సార్లే అనుకుంటా.


ఆర్కే: మిమ్మల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసిన సినిమాలేంటి?

నరసింగరావు: కొన్ని వందల సినిమాలున్నాయి. కానీ కమర్షియల్‌ కాదు.

 

ఆర్కే: మరి ‘బాహుబలి’కి అంత పేరొచ్చింది కదా!

నరసింగరావు: ‘బాహుబలి’ చూశాను. అది వాపే కాని... బలుపు కాదు. అందులో రాజమౌళి యుద్ధం, భల్లాలదేవకు సంబంధించి క్రోదం చూపిస్తాడు. దానికి అతను ఎంతో సమయం తీసుకొనిండొచ్చు... ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ నా ‘దాసి’ సినిమాలో అంత కోపాన్ని ఒక్క ఎక్స్‌ప్రెషన్‌లో చూపించాను. అంత కష్టపడక్కర్లేదు. అయితే టెక్నికల్‌గా రాజమౌళి మనం కూడా ఇట్లా చేయొచ్చని ధైర్యం చేసి తీశాడు. అందుకు అతన్ని అభినందిస్తాను. కానీ... దాన్ని హాలీవుడ్‌తో పోల్చలేం. హాలీవుడ్‌ పద్ధతిలో చేశాడు అంతే. ఉదాహరణకు ‘బెన్‌హర్‌’ సినిమాలో గుర్రపు బగ్గీల సీన్‌కు 110 కెమెరాలు ఆ రోజుల్లో పెట్టారు. హాలీవుడ్‌లో దర్శకుడంటే కేవలం దర్శకత్వ బాధ్యతలే చూస్తాడు. కాస్టూమ్స్‌ బాధ్యత వేరొకరిది. అంతా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. కానీ మన దగ్గర దర్శకుడే కథ, పాటలు, ఎడిటింగ్‌... అన్నీ చేస్తాడు.

 

ఆర్కే: మీరు తీసిన సినిమాలకు బెస్ట్‌ కాంప్లిమెంట్‌ కానీ, విమర్శ కానీ ఉన్నాయా?

నరసింగరావు: చాలా అభినందనలు వచ్చాయి. ‘రంగుల కల’ చూసిన తరువాత సరోజినినాయుడు తమ్ముడు హరీంద్రనాథ్‌ ఛటోపాధ్యాయ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆరుద్ర గారు ‘ఆంధ్రజ్యోతి’లో 16 పేజీల రివ్యూ రాశారు. నేను చేసిన కొన్నిటికైనా చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. ‘దాసి’ చూశాక బెంగాల్‌ ప్రముఖ దర్శకుడు తపన్‌ సిన్హా, కర్ణాటకకు చెందిన జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత యూఆర్‌ అనంతమూర్తి, రాజ్‌కపూర్‌ పెద్ద కుమారుడు రణధీర్‌ కపూర్‌ వేర్వేరు సందర్భాల్లో ఒకే మాట అన్నారు... ‘మై కంట్రీ ఈజ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ’ అని! మా అమ్మ, నాన్నలిద్దరూ ఆనందించారు.

 

ఆర్కే: సాధారణంగా వేలెత్తి చూపినట్టుంటాయి కదా మీ సినిమాలు..!

నరసింగరావు: అంటే... నాకు నేను చూపించుకోవడం (నవ్వు). ఐ యామ్‌ ద వన్‌ ఆఫ్‌ ద రిప్రజెంటివ్‌ ఆఫ్‌ ద ఫ్యూడల్‌ ఫ్యామిలీ! నేను చెప్పేదేంటంటే... కాలానికి తగ్గట్టు మారుతుండాలని! మనిషిని మనిషిగా చూడండన్న సందేశం తప్ప వాటిల్లో ఏమీ లేదు.

 

ఆర్కే: మీరు తీవ్రమైన వామపక్ష ప్రభావితం నుంచి ఇప్పటిదాకా ప్రయాణం చేశారు కదా! ఇంకా వామపక్ష భావజాలానికి ఉనికి గానీ, భవిష్యత్తు గానీ ఉందని నమ్ముతున్నారా?

నరసింగరావు: వామపక్ష భావజాలమన్నది సిద్ధాంతమే కాదు... ఒక జీవన విధానం. మనుషులంతా సమానంగా ఉండాలన్న ధోరణిలో నుంచి వచ్చిందది. మార్క్స్‌ వెరీ రిచెస్ట్‌ పర్సన్‌. అంటే కమ్యూనిజంలో ఎలాంటి తప్పూ లేదు. జీవితంలో ఎప్పుడూ భిన్న భావజాలాలు ఉంటాయి. అక్కడ ఘర్షణ ఉంటుంది. అదెప్పటికీ ఉండాలి. మార్క్స్‌ స్టేట్‌ మిషనరీ పోవాలంటాడు. కానీ అది బలవంతంగా రద్దు చేయకూడదంటాడు. కొమ్మకు ఆకు పండి ఎలా రాలిపోతుందో అలా రాలిపోవాలంటాడు. అలాగే... సమాజానికి కమ్యూనిజం పనికిరానప్పుడు దానంతట అది రాలిపోతుంది. కమ్యూనిజం వంటివన్నీ పేదరికం నుంచి వచ్చాయి. పేదరికాన్ని మనం నిర్మూలించగలిగితే ఏ ఇజమూ ఉండదు! కానీ చేశామా? భవిష్యత్తులో చేయగలమా? భారత్‌ నిదానంగా ఒక్కోటీ అధిగమిస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

ఉదాహరణకు ‘బాహుబలి’ తీయడం చిన్న విషయం కాదు. ‘మేం కూడా చేయగలం’ అనే సందేశాన్ని పంపిందా సినిమా. ఆ క్రమంలో తప్పకుండా అభినందిస్తాను. మన స్థాయిలో మనకది హాలీవుడ్‌ మూవీనే! చెప్పేదొక్కటే... కమ్యూనిజం గురించి ఆలోచించే ముందు... మన సమస్యల్ని మనం ఎంత వరకు పరిష్కరించుకోగలిగామన్నది నేను ఆలోచిస్తుంటాను. ప్రజలు చాలా బాధ పడుతున్నారు. మన ప్రభుత్వాలవి కేవలం స్కీములు మాత్రమే. రాజీవ్‌గాంధీ ఒకసారి చెప్పారు... ‘నేను రూ.100 సామాన్యుడి కోసం విడుదల చేస్తున్నాను. కానీ రూ.5 కూడా వారికి చేరడం లేదు’ అని! కానీ... ఇప్పుడు కేసీఆర్‌ స్కీమ్స్‌లో రూ.60.-రూ.70 రూపాయలు వెళుతున్నాయి. ఇది కమ్యూనిజానికి కూడా ఒక సమాధానం లాంటిది. అయితే ఈ ప్రభుత్వాలు ఎంత వరకు ఉంటాయి... ఎంత వరకు సస్టెయిన్‌ అవుతాయి... ఎంత వరకు ఈ దేశాన్ని మార్చే పరిష్కారాలు వెతుకుతాయన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

 

ఆర్కే: గతంలో ఇరవయ్యేళ్ల వయసులో కమ్యూనిజం భావాలు వాటంతటవే పొంగుకొచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదు!

నరసింగరావు: ఇప్పుడు మొత్తం సోషలాజికల్‌ సిస్టమ్‌ మారిపోయింది. ఆలోచనా విధానం మారింది. మా రోజుల్లో మేం చాలా రొమాంటిక్‌గా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు కుర్రాళ్లు చాలా ప్రాక్టికల్‌. ఇప్పుడు మనమో ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లామనుకోండి... వాడు వాళ్లబ్బాయిని పిలుస్తాడు. వాడు నిక్కరేసుకుని ఉంటాడు. ‘ఫలానా నర్సింగరావు గారురా... మన ఫ్రెండ్‌’ అంటుంటే... ‘హాయ్‌’ అని వెళ్లిపోతాడు. ఇదివరకు మా బాపు ఉన్నప్పుడు వాళ్లతో మేం సిద్ధాంతాలపై పోట్లాడేవాళ్లం. ఇప్పుడు కొడుకుని తండ్రి ఏమన్నా అంటే... ఓ రెండు నిమిషాలు చూస్తాడు.. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాడేం మాట్లాడడు. ఇక పోట్లాడటం ఎట్లా? (నవ్వు). సో... మీరన్నట్టు టైమ్‌ కంప్లీట్‌గా మారిపోయింది.

 

ఆర్కే: తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమం మీద సినిమా తీద్దామని మీకు ఎందుకు అనిపించలేదు?

నరసింగరావు: ఐ వజ్‌ ఏ పార్ట్‌ ఆఫ్‌ ఇట్‌! (నవ్వు). అలాంటి సినిమాలు తీయాలంటే... వన్‌ షుడ్‌ బి వెరీ హానెస్ట్‌ టూ ద సబ్జెక్ట్‌. అదీ కాకుండా వెరీమచ్‌ కాంటెంపరరీ. నారాయణ మూర్తి, కె.ఎ.అబ్బాస్‌ లాంటి వాళ్లు చేశారు. కానీ తరువాతి రోజు వాళ్లు దులుపుకోగలరు. కానీ నర్సింగరావు అలా కాదు కదా! అందులోని అణువణువూ సపోర్ట్‌ చేసుకోవాలి. అంత ఆథెంటిక్‌గా ఉండాలి. నా ఉద్దేశంలో నక్సలైట్‌ ఉద్యమంపై ఎవరూ సీరియస్‌గా చేయలేదు. పొయిట్రీ రాయడం మొదలు పెట్టిన తరువాత నాలో కూడా తాత్విక ధోరణి వచ్చింది. బహుశా వయసుతో వస్తుందేమో అది! సో... ఇప్పటికీ నేను ప్రజలను ప్రేమిస్తుంటాను. సంఘీభావం ప్రకటిస్తుంటాను. కానీ ఇప్పుడు నక్సలైట్లు ఏంచేస్తుంటారంటే నేను చెప్పలేకపోవచ్చు.


ఆర్కే: గద్దర్‌తో మీకు అంత పరిచయం ఎప్పుడయింది?

నరసింగరావు: గద్దర్‌ నా వద్దకు వచ్చాడు. జననాట్యమండలికి సంబంధించిన ‘ఆర్ట్‌ లవర్స్‌’ అని ఉండేది. అలా విప్లవాత్మక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వచ్చాడు. ‘నేను బుర్రకథలు అవీ చెబుతాను’ అంటే... మేం అతనికి ట్రైనింగ్‌ ఇచ్చాం. నాకంటే వయసులో ఒకటి రెండేళ్లు చిన్నవాడు. వియ్‌ ఆర్‌ లైక్‌ బ్రదర్స్‌. గద్దర్‌ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో అంత పెద్ద కళాకారుణ్ణి చూడలేదు. అంత వైబ్రెంట్‌ ఆర్టిస్ట్‌.

 

ఆర్కే: మీకు కనెక్ట్‌ అయిన పర్సన్స్‌ కూడా వామపక్ష భావజాలం ఉన్న వాళ్లే!

నరసింగరావు: ఆర్ట్‌ లవర్స్‌ నుంచి జననాట్య మండలి పుట్టింది. దాంట్లో నుంచి వచ్చిన మూవ్‌మెంటులో నుంచి వచ్చిన వాళ్లే ఈ రోజున్న అందెశ్రీ, గోరటి వెంకన్న, రసమయి బాలకిషన్‌, సంధ్య, విమల వంటివారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అక్కడ ప్రజా కవులు కీలక పాత్ర పోషించారు. అలాంటి మూవ్‌మెంట్‌ 1970ల్లో ఇక్కడ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కూడా అదే ముఖ్య భూమిక వహించింది. ఐ యామ్‌ ద పర్సన్‌ హూ స్టార్టెడ్‌ అని కాదు... ఐ యామ్‌ ద పర్సన్‌ హూ పార్టిసిపేటెడ్‌! దట్స్‌ వాట్‌ ఐ బిలీవ్‌. నేను చరిత్ర నిర్మాతను కాదు... చరిత్ర నిర్మాతలు ప్రజలు. గద్దర్‌ గానీ, నేను గానీ అదే నమ్ముతాం. గద్దర్‌ లాంటి కళాకారుడితో నా జీవితం నలభై ఏళ్లు నడవడం అదృష్టం.

 

ఆర్కే: మిమ్మల్ని ఎవరూ సాంఘిక బహిష్కరణ చెయ్యలేదా?

నరసింగరావు: (నవ్వు)... నక్సలైట్లంటే భూస్వాములకు ఎందుకు భయం? వాళ్లు చంపుతారో... లేక ఉన్నది లాక్కెళతారో అనే కదా! నా దగ్గర ఏమీ ఉండదు కాబట్టి నాకు బాధ లేదు. 1991లో నేనో కవిత రాశాను...

కళ్లు తెరిచే సరికి తల్లి ఒడిలో

ఊహ వచ్చే సరికి ఊరి బడిలో

జీవితాంతం సంసార సాగరం

ఒంటరిగానే అంతిమ పయనం

...మనం ఏం తేలేదు... ఏం తీసుకుపోలేం. ఈ లోపలనే ఎందుకు ఇన్ని ఆరాటాలు! ఉదాహరణకు టాటా, బిర్లాలు. వాళ్లని దేశ సేవకులనుకుంటాను నేను. ఎన్నో ఇండస్ర్టీలు పెట్టి, అభివృద్ధి చేశారు.

 

ఆర్కే: మీ బాపు నుంచి ఏదన్నా పొలం వచ్చిందా?

నరసింగరావు: 200 ఎకరాలు వచ్చింది. అంతా కరిగించేశాను (నవ్వు). ఇప్పుడుంటున్న ఇల్లు, రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఐ యామ్‌ వెరీ హ్యాపీ.


ఆర్కే: చంద్రబాబు, పీవీ నరసింహరావుతో కొంత కాలం పనిచేశారు. రాజకీయపరంగా ఎందుకు ఆలోచన చెయ్యలేదు?

నరసింగరావు: నేను రాజకీయాలు వాళ్లతో ఎప్పుడూ మాట్లాడలేదు. రామారావు గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పీవీ గారితో కానీ సాంస్కృతిక విషయాలు మాట్లాడేవాళ్లమంతే. రాజకీయాల్లో బాధలే కానీ... సుఖాలున్నాయని అనుకోను.

 

ఆర్కే: కేసీఆర్‌తో మీకు పరిచయం లేదా?

నరసింగరావు: వ్యక్తిగతంగా పరిచయం లేదు. మా అన్నయ్య కాంతారావుకు పరిచయం ఉంది.

 

ఆర్కే: మీ జీవన శైలి, ఆలోచనా విధానంతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా?

నరసింగరావు: నా జీవితం పట్ల నాకు 200 పర్సెంట్‌ సంతృప్తి ఉంది.

 

ఆర్కే: మరి ఒక భర్తగా, ఒక తండ్రిగా వాళ్లకి ఎంత ఆనందాన్ని ఇచ్చి ఉంటారు?

నరసింగరావు: తక్కువ. కానీ రాధాకృష్ణగారూ... ఒక వైపునకు వెళితే ఇంకో వైపు పోతుంది. కావాలని ఇబ్బంది పెట్టలేదు. నా కార్యక్రమాలతో వాళ్లు ఇబ్బంది పడుంటారు. కానీ వాళ్లు నా పట్ల చాలా హ్యాపీ. నా వల్ల ఇబ్బంది పడుతున్నామని ఎప్పుడూ అనలేదు.

 

ఆర్కే: ఇప్పుడెవరన్నా మిమ్మల్ని సినిమాలు చేయమని అడుగుతున్నారా?

నరసింగరావు: సినిమా ఈజ్‌ లైఫ్‌ టు మీ. సినిమా చెయ్యాలంటే నాలోంచి మేజర్‌ పార్ట్‌ ఇవ్వాలి. నలభై ఏళ్లలో నాలుగు సినిమాలు చేశానంటే... ఐ హావ్‌ గివెన్‌ మై లైఫ్‌ టు మై ఫిలిమ్స్‌.

 

ఆర్కే: మీరు పాటలు కూడా పాడతారా?

నరసింగరావు: పాట పాడలేదు. డ్యాన్స్‌ చేయలేదు. గాత్రం ఉండాలి కదా! పాటలు రాసేవాడిని. కంపోజ్‌ చేసేవాడిని. కానీ... డ్యాన్స్‌, డ్రామా, మ్యూజిక్‌, లిటరేచర్‌, పెయింటింగ్‌, కల్చరల్‌, మీడియా... ఇలా అన్నింటిలో ప్రవేశం ఉంది.

 

ఆర్కే: మీ జీవితంలో మంచి అనుభూతినిచ్చిన సంఘటనలేమున్నాయి?

నరసింగరావు: ఇందాక చెప్పాను కదా..! శాంతినికేతన్‌లో ఫ్యాకల్టీ నా లెక్చర్‌ విని ‘చాలా బాగుంది. ఇంకా మాట్లాడండి’ అన్నప్పుడు ఎంతో ఆనందించాను. నాకు అక్కడ చదువుకొనే అవకాశమే రాలేదు... అలాంటిది లెక్చర్‌ ఇవ్వడానికి వెళ్లడం మరిచిపోలేని అనుభూతి. అలాగే ఏమీ చదువుకోని వాడిని... గురుత నేర్చుకోలేనివాడిని... రైస్‌ యూనివర్సిటీలో 8 గంటలు మాట్లాడా. వీటితోపాటు ‘రంగుల కల’ సినిమా చూసి హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ వంటి మహానుభావుడు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు నేనడిగాను... ‘వాట్‌ ట్రబుల్డ్‌ యూ’ అని! ‘మళ్లీ నాలో కళాకారుడిని చూసుకున్నా’ అన్నారు. గద్దర్‌కు నేను గురువునా... నాకు గద్దర్‌ గురువా అని పేచీ వచ్చినప్పుడు హరీంద్రనాథ్‌ చటోపాధ్యాయ ఒక మాటన్నాడు.... ‘వియ్‌ ఆర్‌ గురూస్‌ టూ ఈచ్‌ అదర్‌’ అన్నాడు. ఒకరోజు వెళ్లే సరికి ఆయన ఫ్రెంచ్‌ భాష నేర్చుకుంటున్నాడు. అప్పుడాయనకు 84 ఏళ్లు. ‘హరీంద్రా ఏంటి నువ్వు ఫ్రెంచ్‌ నేర్చుకొంటున్నావు’ అని అడిగాను. ‘ఏం.. నేర్చుకోకూడదా? నీ ఆలోచన నాకు తెలుసులే’ అన్నాడు. ‘ఈ ముసలాడు ఈరోజో రేపు చచ్చిపోతాడు. వీడికి ఫ్రెంచ్‌ ఎందుకనుకుంటున్నావు కదూ. నువ్వే కాదు... ఎవరైనా అలాగే అనుకొంటారు. కానీ ఫ్రెంచ్‌ నేర్చుకోవడానికి ఓ నాలుగు నెలలు పడుతుందనుకో. తరువాత ఓ ఏడాది బతికున్నాననుకో. ఓ ఆరు నెలలు నేను ఫ్రెంచ్‌ వచ్చివాడినవుతాను కదా’ అన్నాడు.

అప్పుడు ఇంకో మాట చెప్పాడు... ‘లెర్నింగ్‌ ప్రాసెస్‌ నెవర్‌ ఎండ్స్‌ నర్సింగ్‌. రోజూ పొద్దున్నే జూహూ బీచ్‌లో నడుస్తుంటాను. నాకు రోజూ ఉదయం కొత్తగానే అనిపిస్తుంది. నా కాళ్లను తాకే ఇసుకా కొత్తగానే అనిపిస్తుంది. ఒకవేళ ఈ సూర్యోదయం... ఈ ఇసుక... ఈ ఎండ పాతదే అనుకుంటే... ఇంత రొటీన్‌ లైఫ్‌ ఏంటా అని ఆ రోజు నేను చచ్చిపోతాను. అందుకే ఎవ్విరి ఫ్రాక్షన్‌ ఆఫ్‌ మూమెంట్‌ ఇన్‌ ద లైఫ్‌ ఈజ్‌ ఏ న్యూ టూ అజ్‌’ అన్నాను. అలాంటి గొప్పవారి సాంగత్యం ఉంది నాకు.

అలాగే... గ్రేట్‌ ఫిలిం మేకర్‌ శ్యాంబెనగల్‌ను చూశాను. ఆయనది అల్వాల్‌. నా ‘మావూరు’ సినిమా చూశాక నా అడ్రెస్‌ కనుక్కొని ఉత్తరం రాశాడు. అప్పటికే అతను తెలంగాణ మీద నాలుగు సినిమాలు తీశాడు... ‘అంకుర్‌, నిశాంత్‌, సుష్మాన్‌, మండి’. ‘నీ డాక్యుమెంటరీ టీవీలో చూశాను. ఇది ఇప్పటి వరకు తెలంగాణపై వచ్చిన అన్నింటిలో అత్యుత్తమమైంది’ అని ఆ ఉత్తరంలో శ్యాంబెనగల్‌ రాశాడు.

 

ఆర్కే: మిమ్మల్ని బాధించిన సంఘటనలున్నాయా?

నరసింగరావు: చాలా ఉన్నాయి. జీవితంలో చాలా బాధ ఉంది. ముఖ్యంగా స్త్రీ జీవితంలో! నేను ‘దాసి’ తీయడానికి కారణం కూడా అదే. దీని కోసం నేను సేకరించిన మెటీరియల్‌లో 15-20 శాతం కన్నా ఎక్కువ తీయలేకపోయా. అందులో ఒక ల్యాండ్‌లార్డ్‌ ఉన్నాడు. అతని పేరు చెప్పదలుచుకోలేదు. అతను దాసితో గడుపుతాడు. ఆ క్రమంలో దాసికి కొడుకు పుడతాడు. తరువాత దొరసానికి కొడుకు పుట్టాడు. వాడు పెద్దవాడైన తరువాత దాసిని గదిలోకి తీసుకెళ్లి తలుపేసుకున్నాడు! అదీ దాసి కొడుకు ముందు! ఇలాంటి సంఘటనలు వందలు.. వేలు. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్‌లో కూడా జరుగుతున్నాయి. దాసి... దొరలే కాకుండా ఈ ప్రపంచంలో చాలా బాధలున్నాయి. అయితే విమెన్‌ ఈజ్‌ ఆల్వేస్‌ టార్గెటెడ్‌. అందుకే నా సినిమాల్లో స్ర్తీకి బలమైన పాత్రలుంటాయి.

 

ఆర్కే: మీ నుంచి భవిష్యత్తులో ఒక సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చా?

నరసింగరావు: తప్పకుండా!

 

ఆర్కే: ఎప్పుడు చేస్తారు?

నరసింగరావు: మీ మీడియా ఎప్పుడు ఎంకరేజ్‌ చేస్తే అప్పుడు! (నవ్వుతూ). చెయ్యాలని ఉంది. ఇప్పుడు అనుకుంది కూడా పెయిన్‌ఫుల్‌ సబ్జెక్టు. ఉదాహరణకు ఒక బాధాకర సంఘటన జరుగుతుంది. దానికి మనిషి ఏడుస్తాడు. ఏడ్చిన తరువాత మనసు తేలిక పడుతుంది. సినిమా తీయడమంటే ఓ పెద్ద ఏడుపు. ‘దాసి’ తరువాత దాని గురించి నేను ఆలోచించను. ఆ ఎపిసోడ్‌ అయిపోయింది.

 

ఆర్కే: మరో మంచి ఆణిముత్యం లాంటి సినిమా మీ నుంచి రావాలని కోరుకొంటూ థ్యాంక్యూ వెరీమచ్‌ అండీ!

నరసింగరావు: థ్యాంక్యూ!

---------------------------------------

నాన్న ప్రభావం చాలా ఉంది

మా నాన్న ఆర్య సమాజాన్ని ఇష్టపడే వాడు. అబ్దుల్‌ రెహమాన్‌ అని ఒక రజాకార్‌ మా నాన్నను చంపాలని ప్రయత్నించాడు. దాంతో మా నాన్న సొంత ఊరికి పారిపోయాడు. నన్ను కూడా అక్కడికి తీసుకెళ్లాడు. తర్వాత స్వాతంత్య్రం వచ్చింది. మిలిటరీ యాక్షన్‌ అయిపోయింది. దాంతో మేం మళ్లీ హైదరాబాద్‌ వచ్చేశాం. మొజాంజాహీ మార్కెట్‌ పక్క గల్లీలో మా టికానా ఉండేది. ఒకరోజు నేను కాలేజ్‌ నుంచి వచ్చేసరికి మా నాన్న ఒక గడ్డం ఉన్న వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాసేపయ్యాక అతను వెళ్లిపోయాడు. మా నాన్న నన్ను పిలిచి ‘తను ఎవరో తెలుసా?’ అని అడిగాడు. ‘ఎవరు?’ అన్నాను. ‘అబ్దుల్‌ రెహమాన్‌’ అన్నాడు.

హైదరాబాద్‌లో ఒక జాగీర్దార్‌ ఉండేవాడు. మా భూములన్నీ ఆయన కిందే ఉండేవి. ఒకరోజు ఆయన్ని కలుద్దామని మా నాన్న వెళ్లాడు. ముస్లిం టైపు షేర్వాణీ వేసుకుని వెళితే ఆయన ‘మనం హిందువులం. నువ్వు ఈ డ్రెస్‌లో ఎందుకొచ్చావు. మనం మన ఐడెంటిటీ కాపాడుకోవాలి’ అని అన్నాడట. దాంతో మా నాన్న సీరియస్‌గా ఆర్య సమాజంలో చేరిపోయాడు.

మా నాన్న తన జీవితాంతం వెజిటేరియన్‌గానే ఉన్నాడు. మందు అలవాటు లేదు. హి ఈజ్‌ ఎ డిఫరెంట్‌ పర్సనాలిటీ. ఆయన ప్రభావం నాపైన చాలా ఉంది.

చదువుకోవడానికి శాంతినికేతన్‌ వెళ్లాలనుకున్నాను. కానీ కుదరలేదు. ‘హరివిల్లు’ సినిమా తరువాత శాంతినికేతన్‌ నుంచి ఇన్విటేషన్‌ వచ్చింది. నలభై ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడు థ్రిల్‌కు గురయ్యాను.

నేను వ్యక్తిగత పని మీద నా భార్యతో కలిసి అమెరికా వెళ్లినపుడు అక్కడి యూనివర్సిటీ వాళ్లు నా గురించి తెలుసుకుని నన్ను పిలిచారు. ‘‘మైం ఫిల్మ్స్‌ రిలేటెడ్‌ టు ఆంత్రోపాలజీ అండ్‌ ఎథ్నోగ్రఫీ’’ అనే సబ్జెక్టు మీద మాట్లాడమన్నారు. అదెవరితో మాట్లాడాలి. ఆంత్రోపాలజీ పీహెచ్‌డీ విద్యార్థులతో! మొత్తం ఆ రోజు నేను 8 గంటలు మాట్లాడాను. ఎక్కడో పల్లెటూళ్ళో పుట్టి ఏమీ చదువుకోకుండా సొంతంగా నేర్చుకుని టాప్‌ యూనివర్సిటీలో మాట్లాడే స్థాయికి చేరుకున్నానని ఆనందం వేసింది.

71 ఏళ్ల వయసులో కూడా 13 గంటలు పనిచేస్తున్నాను. అది నన్ను యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఉదయం రెండు గంటలు యోగా చేస్తాను.

‘దొర ఏందిరో వాడి పీకుడేందిరో’ పాట తరువాత మమ్మల్ని ఊళ్ళో ఉండనియ్యవారా? అని మా కాకా(బాబాయి) అడిగాడు. అతనికి ఎనిమిది మంది కూతుర్లు. పెద్దగా భూములు కూడా లేవు. వ్యవసాయంపై వచ్చే రాబడి సరిపోక ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసేవాడు. అలాంటి తనకు కూడా దొర అని తిడితే పౌరుషం వచ్చేది.

చంద్రమౌళి అని ఆర్టిస్ట్‌ ఉండేవాడు. ఆయన నాటకాల్లో నాకు గురువు. నటన నేర్చుకోవాలని ఆయన్ని అడిగితే ‘అది నేను చెబితే వచ్చేది కాదు. వీధుల్లో పడి తిరగాలి’ అన్నారు. అదెలా అని అడిగితే ‘రాత్రి 11 గంటలకు బయలుదేరి 2 గంటల వరకు వీధుల వెంట తిరగమని’ చెప్పాడు. కాలాపహాడ్‌(బిర్లా టెంపుల్‌ కొండ) నుంచి అఫ్జల్‌గంజ్‌ వరకు నడుచుకుంటూ వెళ్లి వచ్చేవాణ్ణి. ఆయన అనుసరించమని చెప్పిన వారు ఎవరంటే వేశ్యలు, బిచ్చగాళ్లు, పిచ్చివాళ్లు. ఆ టైంలో వాళ్లే ఉంటారు. వాళ్లను అనుసరించాలి అంటే దగ్గరకు వెళ్లద్దు. దూరం నుంచే చూడాలి. అలా రోజూ రాత్రి వెళ్లేవారిని చూసేవాణ్ణి. అది నాకు జీవితంలో బాగా ఉపయోగపడింది.

ఒకసారి అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాను. స్ర్కీనింగ్‌ కోసం పి.వి నరసింహారావు గారు ‘దాసి’ సినిమా ప్రత్యేకంగా చూస్తున్నారని తెలిస్తే అక్కడకు వెళ్లాను. సినిమా పూర్తయ్యాక ఎలా ఉందని అడిగాను. ‘కొద్దిగా అతిగా చూపించారని అంటున్నారు. మీరేమంటారు?’ అని అడిగా అప్పుడాయన ‘నేను జీవితంలో చూసిన దాంట్లో నువ్వు 15 శాతం మాత్రమే చూపించావు’ అన్నాడు.

 

ఆయన ఓకే అంటే... నేను రీటేక్‌ అన్నా!

‘హరివిల్లు’ సినిమా సమయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని ముందే చెప్పాను. అలానే ఇచ్చారు. షూటింగ్‌ దగ్గరకొస్తే రామానాయుడు గారే డైరెక్షన్‌ చేస్తారని అంటారు. ఒకరోజు షూటింగ్‌కొచ్చారు. ఒకసీన్‌ తీస్తున్నాం. రెండు టేక్‌లు చేశాం. అప్పుడు రామానాయుడు గారుండి ‘ఫరవాలేదు డబ్బింగ్‌లో మేనేజ్‌ చేసుకోవచ్చు. షాట్‌ ఓకే’ అన్నాడు. నిజానికి డబ్బింగ్‌లో చూసుకోవచ్చు. కానీ రామానాయుడు ఇన్‌వాల్వ్‌ అయ్యాడు కదా! అందుకే రీటేక్‌ అన్నాను. దాంతో ఆయనకు అర్థమయిపోయింది. మళ్లీ షూటింగ్‌ దగ్గరకు రాలేదు.

Updated Date - 2020-02-08T08:12:50+05:30 IST