బూతులని తెలీక వాటికి అర్థాలు అడిగేదాన్ని

ABN , First Publish Date - 2020-02-08T08:00:11+05:30 IST

అందం, అభినయం ఆరడుగుల పోత పోస్తే ‘అనుష్క’. గ్లామర్‌ పాత్రలతో తెరపై ఝుమ్‌ఝుమ్‌మాయ చేయటమే కాదు...

బూతులని తెలీక వాటికి అర్థాలు అడిగేదాన్ని

అందం, అభినయం ఆరడుగుల పోత పోస్తే ‘అనుష్క’. గ్లామర్‌ పాత్రలతో తెరపై ఝుమ్‌ఝుమ్‌మాయ చేయటమే కాదు... జేజమ్మ, దేవసేన, రుద్రమదేవిలాంటి సాహసపాత్రల్లో అద్భుతంగా నటించింది. తెలుగులో కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు సరికొత్త అర్థం చెప్పింది అనుష్క. ఆ సిల్వర్‌స్ర్కీన్‌ స్టార్‌ ‘స్వీటీ’తో ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం 31-8-2015న ఏబీఎనలో ప్రసారమయింది. ఆ వివరాలు... 


ఆర్కే: మీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి?

అనుష్క: మాది బెంగళూర్‌. మా నాన్న ఇంజనీర్‌, మా అమ్మ హౌస్‌వైఫ్‌. మా అన్నయ్య డాక్టర్‌. ఇలా మా కుటుంబంలో అమ్మ, నాన్న తరపు కలిపి ఎక్కువ మంది ఇంజనీర్లు, డాక్టర్లు ఉన్నారు. నాకు కూడా డాక్టర్‌ కావాలని ఉండేది. అయితే నాన్న వద్దన్నారు. ‘ఎందుకంటే లైఫ్‌లాంగ్‌ నేర్చుకోవాలి. చదవాలి. రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇవన్నీ ఇష్టమయితే డాక్టర్‌ అవ్వు అన్నారు. భరత్‌ ఠాకూర్‌ దగ్గర యోగా నేర్చుకున్నా. యోగా నచ్చింది. కాలేజ్‌ అయ్యాక ఓ రోజు ఇంటికెళ్లి ‘యోగా టీచర్‌ అవుతాను’ అన్నాను. అందరూ షాక్‌ అయ్యారు. డెస్టినీ ఇలా ఉంది. హీరోయిన్‌ అయ్యాను.


ఆర్కే: సినిమాల్లోకి వచ్చినపుడు మీ పేరెంట్స్‌ ప్రతిస్పందన ఎలా ఉంది?

అనుష్క: అందరిలాగే జాగ్రత్తగా ఉండమన్నారు. ‘సూపర్‌’ సినిమా చేసినపుడు వెరీ మోడ్రన్‌ క్లాత్స్‌ వేసుకున్నా. నా లైఫ్‌లో అప్పటి వరకూ అలాంటి డ్రెస్‌ వేసుకోలేదు. అప్పటిదాకా డిస్కోథెక్‌కు వెళ్లి కూడా నేనెప్పుడూ డ్యాన్స్‌ చేయలేదు. అందుకే రెండేళ్లపాటు ఇక్కడ ఉండలేనని ఏడ్చాను. ఓ సారి ఏడుస్తుంటే ‘గన్‌ పెట్టి చేయమని నిన్ను అనలేదు కదా’ అని మా నాన్న నాతో అన్నారు. ఇష్టం లేకుంటే వదిలేయ్‌ అన్నారు. ఎందుకో తెలీదు కాని ఇండసీ్ట్రని వదిలి వెళ్లలేకపోయాను. ఇందులో చాలా నేర్చుకున్నా.


ఆర్కే: నిన్నటి దాకా ‘జేజమ్మ’ అని పిలిపించుకున్నారు. ఇక మీదట ‘రుద్రమదేవి’ అంటూ పిలిపించుకోబోతున్నారు. మీ ఫీలింగ్‌ ఎలా ఉంది?

అనుష్క: డిఫరెన్స్‌ ఉంది. ‘విక్రమార్కుడు’ సినిమా చేస్తున్నపుడు ‘అరుంధతి’ చిత్రానికి సంతకం చేశాను. నాకు యాక్టింగ్‌ అంటే అంతగా తెలీదు. రాజమౌళి గారు ఇలా చేయాలని చేసి చూపిస్తే దాన్ని కాపీ చేసేదాన్ని అంతే. ‘అరుంధతి’లో నటించేప్పుడు కెమెరా యాంగిల్స్‌, గ్రాఫిక్స్‌, డ్యాన్స్‌ తెలిశాయి. అప్పటికి నాకున్న నాలెడ్జ్‌ చాలా తక్కువ. ‘అరుంధతి’ స్ర్కీన్‌ మీద కొచ్చాక చాలా బాగా చేశావన్నారంతా. ఆ క్రెడిట్‌ మొత్తం కోడిరామకృష్ణ, శ్యాంప్రసాద్‌ రెడ్డి గారిదే. ఎఫర్ట్‌ పెట్టాను. హార్డ్‌వర్క్‌ చేశాను. పదేళ్ల తర్వాత ‘రుద్రమదేవి’ చేస్తున్నప్పుడు అట్‌లీస్ట్‌ కొంచెం నాలెడ్జ్‌ వచ్చింది.


ఆర్కే: జేజమ్మ, రుద్రమదేవి పాత్రల్లో మీకు సంతృప్తినిచ్చినవి ఏవి?

అనుష్క: జేజమ్మ పాత్రలో నా ఇన్‌పుట్స్‌ చాలా తక్కువ. నేను ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు ప్రతీసారి పిల్లలు, పెద్దవాళ్లు వచ్చి ‘జేజమ్మా.. జేజమ్మా’ అంటూ నా బుగ్గలు పట్టుకునేవారు. ఆ టైంలో హ్యాపీ అనిపించేది. వెంటనే నేను శ్యాం గారికి వందసార్లు ‘థ్యాంక్యూ’ అని మెసేజ్‌ చేసి ఉంటాను. బికాజ్‌ ఇట్స్‌ నాట్‌ ఈజీ. నేను 48 సినిమాల దాకా చేస్తే నాలుగైదు సినిమాలు బాగా గుర్తుపెట్టుకున్నారు. ‘అరుంధతి’ చేసే టైంలో శ్యాం ప్రసాద్‌ రెడ్డి గారి ఆర్థిక పరిస్థితి బాలేదు. ఒక ఎస్టాబ్లిష్‌ హీరోయిన్‌ను తీసుకోకుండా, స్ర్కిప్ట్‌ మీద నమ్మకమో ఏమో తెలీదు కాని, నన్ను కథానాయికగా డిసైడ్‌ అయ్యారు. ‘ఆమె గ్లామర్‌ హీరోయిన్‌. యాక్టింగ్‌ రాదు’ అని ఆయనతో కొందరు నా గురించి చెప్పినా నాతోనే ఆ సినిమా చేయించారు. అందుకే ఐ రెస్పెక్ట్‌ హిమ్‌.


ఆర్కే: శ్యాం ప్రసాద్‌రెడ్డి గారే మిమ్మల్ని అప్రోచ్‌ అయ్యారా? ఆయన గురించి చెప్పండి..?

అనుష్క: ఆయనే అయ్యారు. శ్యాం గారు, కోడిరామకృష్ణ గారు వైఫ్‌ అండ్‌ హజ్బెండ్‌లా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ‘సినిమా మన చేతిలో ఉన్నంత వరకు ఏవైనా చేయొచ్చు, ఒకసారి ఆడియన్స్‌ ముందుకు వెళ్తే మన చేతుల్లో ఉండదు’ అని శ్యాం గారు చెబుతుంటారు. శ్యాం గారిని నేను కింగ్‌కాంగ్‌ అని పిలుస్తుంటాను. నేను అప్పుడప్పుడే తెలుగు నేర్చుకుంటున్నా. శ్యాం గారు లొకేషన్‌లో కోపమొస్తే చాలా మందిని బూతులు తిట్టేవారు. దానికి నాకు మీనింగ్స్‌ తెలిసేది కాదు. ఎవరినైనా ఆయన తిడుతుంటే ‘దీనికి అర్థమేంటి సర్‌’ అని అడిగేదాన్ని. ఆయన వెంటనే ‘తిడుతున్నప్పుడు కూడా ఇలా మీనింగ్‌ అడిగితే ఏంటమ్మా.. ఇలా అడగొద్దు’ అనేవారు. (నవ్వులు)


ఆర్కే: ‘రుద్రమదేవి’ త్రీ ఇయర్స్‌ ప్రాజెక్ట్‌ కదా. అంత సమయం వెచ్చించటం ఇబ్బంది అనిపించలేదా?

అనుష్క: అలా ఇబ్బంది అనిపించలేదు కానీ, బాగా అలసిపోతుండటం వల్ల కొన్నిసార్లు ఇంటికెళ్లాక సినిమా వద్దే వద్దు అనిపించేది..


ఆర్కే: ఈ సినిమాలో ఏడ్చారా?

అనుష్క: షూటింగ్‌లో సహనంగా ఉంటాను. సాయంత్రం ఇంటికొచ్చాక పెయిన్స్‌ ఉన్నపుడు ఏడుస్తాను. ఇట్స్‌ మై వే ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌. క్లోజ్‌గా ఉండే వాళ్లందరితో గొడవపడతాను. ఈ త్రీ ఇయర్స్‌లో చేసిన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్‌ జీరో’ సినిమాల్లో చేసిన రోల్స్‌ చేయటం గర్వంగా ఉంది. జీవితంలో ఎప్పుడైనా ఈ రోల్స్‌ గురించి చెప్పుకోవచ్చు. ఇలాంటి ఫిల్మ్స్‌ చాలా తక్కువగా వస్తాయి.


ఆర్కే: హీరోయిన్స్‌ కెరీర్‌ పది, పదిహేనేళ్లు ఉంటుంది కదా?

అనుష్క: ఐ బిలివ్‌ సమ్‌థింగ్‌. ఏదోటి నుదుటన రాసుంటుంది. నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు. వచ్చాను. మన డెస్టినీని చేంజ్‌ చేయాలంటే హార్డ్‌వర్క్‌ చేయాలి. నేను యాక్టింగ్‌ తర్వాత ఏదోటి చేస్తాను. ఖాళీగా ఉండను. టీచింగ్‌ చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకముందు సంవత్సరం టీచింగ్‌ చేశాను.


ఆర్కే: అయితే మీరు స్కూల్‌ స్టార్ట్‌ చేయచ్చు?

అనుష్క: నేను బిజినెస్‌ పర్సన్‌ కాదు. సర్వీస్‌ చేయాలని నాకు లేదు. ఎందుకంటే నేను యోగా టీచ్‌ చేసే సమయంలో ఎవరికైనా ఫ్రీగా క్లాస్‌ చెప్పినా వారు ఆసక్తి చూపే వారు కాదు. ఆసక్తిగా ఉండేవాళ్లు డబ్బుపెట్టకున్నా, పెట్టినా చేయాల్సింది చేస్తారు. ప్యాషన్‌ ఉండి డబ్బులు లేనివారికి ఫ్రీగా చెప్పవచ్చు. డబ్బు కట్టామని క్లాసులకు అటెండ్‌ అయ్యేవాళ్లంటే నచ్చదు. అందుకే సర్వీస్‌ చేయాలనుకుంటే బ్యాలెన్స్‌ ఉండదు.


ఆర్కే: ‘బాహుబలి’ ఫస్ట్‌ పార్ట్‌లో దేవసేన పాత్రలో గ్లామర్‌ లేదు. సెకండ్‌ పార్ట్‌లో ఎలా కనిపిస్తారు?

అనుష్క: సెకండ్‌ పార్ట్‌లో షేడ్స్‌ చాలా ఉంటాయి. వెరీ గ్లామరస్‌, ఫస్ట్‌ పార్ట్‌లో చూసింది.. దీంతో పాటు మరో షేడ్‌ ఉంటుంది. అది చెప్పను. దీని గురించి కొంచెం చెప్తే స్టోరీ క్రియేట్‌ చేసుకుంటారు.


ఆర్కే: ‘బాహుబలి’ అంత సక్సెస్‌ తర్వాత.. అంత సక్సె్‌స్‌ను ‘రుద్రమదేవి’తో అచీవ్‌ చేయగలనా.. అనే భయం ఉందా?

అనుష్క: అంతగా థింక్‌ చేయలేదు. గుణశేఖర్‌ గారు చాలా ఎఫర్ట్‌ పెట్టారు. ఇట్స్‌ నాట్‌ ఈజీ టు ప్రొడ్యూసింగ్‌. ఒక అమ్మాయిని పెట్టి 80 కోట్లు ఆయనే బడ్జెట్‌ పెట్టడం అంత సులువు కాదు. స్ర్కిప్ట్‌పై నమ్మకంతో చేశారు. అందరికీ పేరుతో పాటు డబ్బు కూడా తప్పక వస్తుంది.


ఆర్కే: రుద్రమదేవి క్యారెక్టర్‌ గురించి ముందే తెలుసా?

అనుష్క: స్కూల్‌ పాఠాల్లో చదువుకున్నది తెలుసు. గుణశేఖర్‌ గారు వచ్చి మూడు గంటల పాటు నెరేషన్‌ చెప్పారు. షాక్‌తో పాటు థ్రిల్‌కు గురయ్యాను. దీంతో పాటు బ్యాడ్‌గా ఫీలయ్యాను. ఎందుకంటే మన సౌత్‌ ఇండియాలో ఇంత పెద్ద పెయిన్‌ఫుల్‌ స్టోరీ జరిగిందని చాలా మందికి తెలీదు. సో మచ్‌ ఆఫ్‌ ఎమోషన్స్‌. మనం వేరే దేశాల్లో జరిగింది తెలుసుకుంటాం. మన దగ్గర జరిగింది తెలుసుకోం. ఇది చాలా గొప్ప స్టోరీ.


ఆర్కే: ఈ సినిమాలో క్వీన్‌ పాత్ర కోసం ఏం నేర్చుకున్నారు?

అనుష్క: కత్తియుద్ధం నేర్చుకున్నా. హార్స్‌ రైడింగ్‌, ఏనుగుపై వెళ్తాను. ఏనుగుపై వెళ్లటం భయం వేయలేదు కానీ గుర్రంపై వెళ్లటం అంటే భయమేస్తుంది. ఎందుకంటే స్పీడ్‌ మూవెంట్‌ ఎలా వెళ్తుందో తెలీదు. షూటింగ్‌ టైంలో గుర్రం వస్తూనే సైలెంట్‌ అయిపోయేదాన్ని.. ఎందుకంటే గుర్రం ఎక్కాలి కాబట్టి. ఈ విషయం పక్కన ఉండే వారికి తెలిసిపోయేది. ‘బాహుబలి’ చేసేటప్పుడు ప్రభాస్‌, రానా గుర్రపు స్వారీలను చూశా. రానా గుర్రం మీద నుంచి పడ్డాడు. అది చూసి భయపడ్డాను. ఎత్తుగా ఉంటాను కదా పడితే అంతే కదా, అందుకే చాలా భయం. ఓ వార్‌ సీన్‌లో సడెన్‌గా ఏనుగు ఫాస్ట్‌గా మూవ్‌ అయ్యింది. అప్పుడు భయపడ్డాను. ఏనుగు చాలా స్వీట్‌. పక్కన వెళ్తుంటే తొండంతో ఫుడ్‌ కావాలి అని అలా ఇలా కొడుతుంది. ఆ టైంలో ఫుడ్‌ పెట్టేదాన్ని.


ఆర్కే: గుర్రం సీన్ల కోసం ఎక్కడికైనా వెళ్లారా?

అనుష్క: ఎక్కడికి వెళ్లలేదు. పోలో రైడింగ్‌ క్లబ్‌లోనే గుర్రంపై ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ట్రైనర్స్‌ తోడు ఉండేవారు.


ఆర్కే: ఇప్పుడు ఒకరకంగా చెప్పాలంటే అనుష్క హీరోలతో సమానం?

అనుష్క: ఒకటంటే ఏమో అనుకోవచ్చు. రోజూ అలాంటి సినిమాలే చేస్తున్నా. హీరోయిన్స్‌ జాబ్‌ చాలా ఈజీ. సెంట్రిక్‌ పాత్రలు చేస్తే స్టంట్స్‌ చేయాలి, డ్యాన్స్‌ చేయాలి.


ఆర్కే: ‘రుద్రమదేవి’ లో మీకు నచ్చిన డైలాగ్‌ ఏది?

అనుష్క: ట్రైలర్‌లో కనిపించే ‘ఒకే తల్లి పాలు తాగిన వాళ్లు అన్నదమ్ములు అయితే, ఒకే నది నీళ్లు తాగిన వాళ్లం అక్కచెల్లెళ్లు అన్నదమ్ములం కాలేమా’ అనే డైలాగ్‌ నచ్చింది.


ఆర్కే: ఇంత హెవీ క్యారెక్టర్స్‌ వేస్తున్నారు కదా?

అనుష్క: నేను చిన్నపుడు పెద్దగా రెడీ అయ్యేదాన్ని కాదు. సింపుల్‌గా ఉండేదాన్ని. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లేటపుడు నగలు వేసుకోమని మా అమ్మ చెప్పేది. సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో మా అమ్మ ‘నువ్వు బాగా నగలు ధరించి రాణిలా సినిమా చేయాలిరా. ఎంతో బావుంటావ్‌ ’ అంది. అప్పుడు నాలో స్టార్ట్‌ అయ్యింది. ‘రుద్రమదేవి’లో అంతా ఒరిజినల్‌ బంగారమే. నాకు జ్యువెలరీ ఇష్టం లేదు కాబట్టి చిరాగ్గా ఉంటుంది. ఈ మధ్యే ఆమ్మతో ‘ఇలాంటి రోల్స్‌ కావాలని ఇంకా ప్రార్థించకు. అవే జరిగిపోతాయి’ అన్నాను. మా అమ్మ వెంటనే ‘నువ్వు ఓ ఫిషర్‌ ఉమెన్‌ రోల్‌ చేయాలని’ ఉంది అని చెప్పింది.


ఆర్కే: రూమర్స్‌, గాసిప్స్‌ వచ్చినపుడు ఎలా ఫీలవుతారు?

అనుష్క: వాటిని విన్నప్పుడు చాలా స్టుపిడ్‌గా అనిపిస్తుంది. అప్పుడు అమ్మానాన్నలతో మాట్లాడతాను. ఎవ్వరి గురించి ఆలోచించ వద్దని చెబుతారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా రాత్రి పడుకునే సమయంలో మన కాన్షియస్‌ క్లీన్‌గా ఉండాలి. అమ్మ ఎప్పుడూ ఇదే చెబుతుంది. రూమర్స్‌, గాసిప్స్‌ ఎన్నో వస్తుంటాయి. వాటిని పట్టించుకోను. మనపైన మనకు నమ్మకం ఉండాలి. నా గురించి గాసిప్స్‌ రాసే వాళ్లపై నాకు కోపం రాదు. ఫీల్‌ అవుతాను. నా దృష్టిలో వాళ్ల స్థాయి తగ్గిపోతుంది. నాపై వచ్చే రూమర్స్‌ చదవనని కాదు. పేపర్‌ తప్పకుండా చదువుతాను. ఇప్పటికి నాకు ఐదు సార్లు పెళ్లి చేశారు. అలాంటి వార్తలు చదివి నవ్వుకుంటాను అంతే. అయితే కొన్ని విషయాలు బాధ కలిగిస్తాయి. ‘బలాదూర్‌’ సినిమా చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక డూప్‌ చేసే వ్యక్తి నీటిలో పడి చనిపోయాడు. అయితే ఒక చానెల్‌ ‘అనుష్క షూటింగ్‌లో సరదాగా పుష్‌ చేయడం మూలంగానే ఆ వ్యక్తి నీటిలో పడి చనిపోయాడ’ని కథనం ప్రసారం చేసింది. అది చాలా బాధ కలిగించింది. ఒక ఐదారేళ్లు ఆ చానెల్‌ కూడా చూడలేదు.


అసలు పేరు: స్వీటీ నా అసలు పేరు. సినిమాల్లోకి వచ్చాక నేనే ‘అనుష్క’ అని పేరు పెట్టుకున్నా.

బెస్ట్‌ కాంప్లిమెంట్‌: ఏది చేసినా హాఫ్‌ హాఫ్‌గా ఉండకూడదు అంటుంది మా అమ్మ. నచ్చిందంటే రెండు మాటలు మాట్లాడుతుంది. నచ్చలేదంటే మాటలు చేంజ్‌ చేస్తుంది. ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ టాపిక్‌ మార్చేస్తుంది. ఫస్ట్‌ టైం నన్ను తెరపై ‘సూపర్‌’ మూవీలో యాక్టింగ్‌ను ఇష్టపడింది అమ్మ. ‘వేదం’, ‘అరుంధతి’ చిత్రాలు కూడా అమ్మకు బాగా నచ్చాయి.


ఫ్రెండ్స్‌ : నాకు ఫ్రెండ్స్‌ సర్కిల్‌ చాలా ఎక్కువ. యోగా గ్రూప్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఇండసీ్ట్రలో సుప్రియగారు, భానుగారు వీళ్లందరూ క్లోజ్‌. చెన్నైకి వెళితే భానుగారి ఇంట్లోనే ఉంటాను. నాగార్జున, రాజమౌళి గారి ఫ్యామిలీలతో క్లోజ్‌గా ఉంటాను.


మైనస్‌: ఏదైనా పనిచేసినపుడు నా గురించి ఆలోచించకుండా ఎదుటి వాళ్లు బాధపడతారని అనుకుంటాను. నా ఫ్రెండ్స్‌ కూడా అదే అంటారు. నీ గురించి కొంచెం ఆలోచించు అని. డబ్బు విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటాను. అది కూడా నాలో మైనస్‌. గిఫ్ట్స్‌ కొంటాను. ట్రావెల్‌ చేస్తాను. ఫ్రెండ్స్‌కి అవసరం వచ్చినప్పుడు సాయం చేస్తాను.


బాల్యం: చిన్నప్పుడు చాలా మంచి అమ్మాయిని. ఇప్పుడే అల్లరి ఎక్కువ. చిన్నప్పుడు ఎదుటి వాళ్లు పది మాటలు మాట్లాడితే నేను ఒక్కమాట మాట్లాడేదాన్ని. ఇప్పుడైతే నేనే ఎక్కువగా మాట్లాడుతున్నాను. నేనెప్పుడు ఆపుతానాని ఎదురుచూస్తుంటారు ఎదుటివాళ్లు.


వంట: కొంచెం కొంచెం చేస్తాను. అమ్మ బాగా చేస్తుంది. ‘వంట నేర్పేది కాదు. న్యాచురల్‌గా వస్తుంది. నువ్వు ఆసక్తితో నేర్చుకోవాలి’ అని అమ్మ చెబుతుంది.


బిగ్‌డ్రీమ్‌: ఫ్రెంచ్‌ ఫిల్మ్స్‌ చేయాలని ఉంది. వాళ్ల సబ్జెక్ట్‌లు చాలా బాగుంటాయి. నా బిగ్‌ డ్రీమ్‌ అదే. అలా అని ఏదో ఒక ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ వస్తే చేయను. నేను ఇష్టపడి చేయాలి. హిందీలో అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి చేసే అవకాశం వచ్చింది. కానీ ఆ స్ర్కిప్ట్‌ నచ్చలేదు. అందుకే వదులుకున్నాను.


ఛాన్స్‌: ప్రతి ఒక్కరికీ అవకాశం వస్తేనే ప్రూవ్‌ చేసుకోగలుగుతారు. ‘అరుంధతి’ చేయకుంటే అందరిలానే ఉండేదాన్ని. ఆ తర్వాత ప్రాస్టిట్యూట్‌ గురించి చెప్పడానికి క్రిష్‌ గారు వచ్చి ‘ఆ.. ఊ.. ఆ క్యారెక్టర్‌ ఇలా అలా అని’ చెప్పారు. క్యారెక్టర్‌ చెప్పలేదు. ‘ప్రాస్టిట్యూటా?’ అని అడిగాను. కొందరు అయితే ‘అరుంధతి’ తర్వాత అలాంటి రోల్‌ చేయకూడదు అన్నారు. నేను అవేమీ పట్టించుకోలేదు. భిన్నమైన సినిమాలు చేస్తేనే గ్రేట్‌ టెక్నీషియన్స్‌తో వర్క్‌ చేసి ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు.


పెళ్లి ఎప్పుడు?

అవుతుంది. ఆ టైమ్‌ వచ్చినప్పుడు మ్యాజికల్‌గా జరిగిపోతుంది. వరుణ్ణి నేనే సెలెక్ట్‌ చేసుకుంటాను.

పెళ్లి చేసుకున్నాక నా భర్తతో కలిసి వరల్డ్‌ ట్రావెల్‌ చేస్తాను. అయితే అది ఎప్పుడు జరుగుతుందో చెప్పలేను. అలాగే ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి.


ఆర్కే: సినిమాల్లో మొదటి అవకాశం ఎలా వచ్చింది?

అనుష్క: పూరీ జగన్నాథ్‌ గారు మొదటి అవకాశం ఇచ్చారు. ఇ.నివా్‌సగారి భార్య, నేను మంచి ఫ్రెండ్స్‌. ఇ.నివా్‌సగారే పూరీ జగన్నాథ్‌ గారిని కలవమని చెప్పారు. కానీ నేను కలవలేదు, ఫోన్‌ చేయలేదు. ఫోన్‌ చేశానని అబద్దం చెప్పాను. తరువాత ఆయనే ఒక పార్టీలో పూరీ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఆయన ఒక ఫోటో ఉంటే ఇమ్మన్నారు. పర్స్‌లో నుంచి పాస్‌పోర్ట్‌ ఫోటో తీసి పూరీకి ఇచ్చాను. ఆయన చిన్నగా నవ్వి ఫోన్‌ చేస్తానని చెప్పారు. అప్పటి వరకు నాకు ప్రత్యేకంగా ఫోటోలు దిగాలి.. అల్బమ్‌ ఉండాలి అనే విషయం కూడా తెలియదు. నెక్ట్స్‌ డే ఫోన్‌ చేసి హైదరాబాద్‌ రమ్మని చెప్పారు. యోగా క్లాసులుండటం వల్ల వెంటనే వెళ్లలేకపోయాను.

 

నాలుగు రోజుల తరువాత వెళ్లాను. అక్కడ నాగార్జునగారి షూటింగ్‌ జరుగుతోంది. అక్కడే మేకప్‌ వేసి ఫోటో షూట్‌ చేశారు. అదే సమయంలోనే మరో అమ్మాయి కూడా ఆడిషన్స్‌కి వచ్చింది. అయితే నాగార్జున గారు ఫోటోలు చూసి నన్ను సెలక్ట్‌ చేశారు. అందుకే నాగార్జున గారు ప్రత్యేకంగా గుర్తొస్తుంటారు. నాగార్జున, పూరీ జగన్నాథ్‌, సుప్రియ వీళ్లందరూ నన్ను ఒక చిన్న పిల్లను ఎలా చేయి పట్టుకుని నడిపిస్తారో అలా అన్నీ నేర్పించారు. వాళ్లను నేనెప్పటికీ మరిచిపోలేను. మార్చి 12, 2005న నా మొదటి షూట్‌ జరిగింది.

Updated Date - 2020-02-08T08:00:11+05:30 IST