నా పాట విని.. మెడ‌కు వేసుకున్న ఉరితాడు తీసేశాడు

ABN , First Publish Date - 2020-02-08T07:29:13+05:30 IST

చిన్నచిన్న పదాలతో పాటకు ప్రాణం పోస్తున్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌. ‘ఔనంటే కాదనిలే’ చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం

నా పాట విని.. మెడ‌కు వేసుకున్న ఉరితాడు తీసేశాడు

చిన్నచిన్న పదాలతో పాటకు ప్రాణం పోస్తున్న సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌. ‘ఔనంటే కాదనిలే’ చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. సినీ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులను ఆయన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 23-10-2016న నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పంచుకున్నారు.

 

ఆర్కే: హరిరామజోగయ్య గారు మీకేమవుతారు?

అనంతశ్రీరామ్‌: పెదనాన్నఅవుతారు. మా తాతయ్య, వాళ్ల నాన్న సొంత అన్నదమ్ములు.

 

ఆర్కే: ఇంత చిన్న వయసులోనే గుర్తింపు తెచ్చుకున్నందుకు ఏమనిపిస్తుంటుంది?

అనంతశ్రీరామ్‌: మీ ఎదురుగా కూర్చుండే ఈ స్థానాన్ని నేను ఊహించాను. అయితే 32 ఏళ్లకు కాదు, 42 ఏళ్లకు. పదేళ్లు ముందే వచ్చాను అది అదృష్టంగా భావిస్తాను.

 

ఆర్కే : చిన్నప్పటి నుంచి దృష్టిలోపం ఉందా?

అనంతశ్రీరామ్‌: పుట్టుకతో ఉంది. నాలుగుతరాల నుంచి వస్తోంది. ఒకప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేదు కానీ ఇప్పుడు ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మా అబ్బాయికి కూడా సమస్య వచ్చింది. నెలల వయసులోనే పసిగట్టి అద్దాల అవసరం లేకుండా ఆపరేషన్‌ చేయించగలిగాను.


ఆర్కే: ఇంజనీరింగ్‌ పూర్తి చేయకుండా ఆపేయాలని ఎందుకు అనిపించింది?

అనంతశ్రీరామ్‌: 2002- 2006 మధ్య ఇంజనీరింగ్‌ చదివాను. ఇంకో ఏడాది చదివితే ఇంజనీరింగ్‌ పూర్తయ్యేది. అయితే ఇష్టం లేకుండా చదవడం కష్టం. తల్లిదండ్రులు అదేమీ పట్టించుకోకుండా పిల్లలపైన ఒత్తిడి పెడుతున్నారు. ఏ వ్యక్తికైనా ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకున్నప్పుడే బాగుంటుంది. ఇంజనీరింగ్‌ పట్టా లేకపోయినా కూడా జీవితం పట్టాలెక్కుతుందని నిరూపించాలనే ఉద్దేశంతోనే చదువు మానేశా.

 

ఆర్కే: మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి?

అనంత శ్రీరామ్‌: మా తాత వరకు వ్యవయసాయ కుటుంబం. మా నాన్న కాలేజ్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. మా కుటుంబంలో మొదటి పాటల రచయితను నేనే.

 

ఆర్కే: గేయ రచయితలను తయారు చేయలేరంటారు కదా?

అనంతశ్రీరామ్‌: పుట్టుకతోనే వస్తుందంటే నేను ఒప్పుకోను. మ్యూజిక్‌ కంపోజ్‌ చేయాలంటే ప్రాక్టీస్‌ అవసరం. అలాగే పదిహేనేళ్లు ప్రాక్టీస్‌ చేస్తే ఎవరైనా రచయిత కావచ్చు. కొందరు చిన్నతనంలో మొదలుపెడతారు. మరికొందరు మధ్యలో ప్రారంభిస్తారు. కొందరు అసలు ఆ వైపే వెళ్లరు. నేను ఆరో ఏటనే రాయడం మొదలుపెట్టాను. ఇరవై ఒకటోయేట సినిమా పాట రాశాను.

 

ఆర్కే: రబ్బరు గాజులు పాట రాయడానికి ఏదో ఇబ్బంది పడ్డారట, నిజమేనా?

అనంతశ్రీరామ్‌: ఏమైందంటే యమదొంగ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అరకువ్యాలీలో జరిగాయి. అప్పటికి కీరవాణిగారు రాజమౌళికి 20 ట్యూన్స్‌ ఇచ్చారు. వాటిని రాజమౌళిగారు తిరస్కరించారు. కీరవాణిగారు ట్యూన్స్‌ ఇవ్వడమే కాకుండా మంచి పాట రాసుంటే చెప్పండి, దానికి ట్యూన్‌ కడతానంటారు. దాంతో నా దగ్గర మూడు పాటలు ఉన్నాయి వినండి అని చెప్పా. దాన్లో ఒకపాట రబ్బరుగాజులు. ఆ పాట విన్న రాజమౌళి నాకు పాట అలా ఉండాలి అన్నారు.


ఆర్కే: గేయరచయితల్లో ఇన్‌స్పిరేషన్‌ ఎవరు?

అనంతశ్రీరామ్‌: 12వ యేట సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలను బాగా ఇష్టపడే వాణ్ణి. కౌమార దశకు వచ్చాక వేటూరి పాటలంటే ఇష్టం పెరిగింది. ఇండస్ట్రీకి వచ్చాక తెలిసింది ఏంటంటే పాటలు సులువుగా రాయడం కష్టం. అలాంటి పాటలు రాయగలిగేది చంద్రబోస్‌. అందుకే ఇండస్ట్రీకొచ్చాక చంద్రబోస్‌ పాటల ప్రభావం పడింది. ఎవరో ఒక్కరి పేరే చెప్పమంటే కనుక సిరివెన్నెల గారే.


ఆర్కే: న్యూస్‌ బాగా చదువుతారా?

అనంతశ్రీరామ్‌: బాగానే చదువుతాను. ఊర్లో కెరీర్‌ ఒక్కటే కాకుండా రాజకీయాలు, పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఎక్కువగా ఉంటుంది. అలా నాక్కూడ ఇష్టం పెరిగింది. మీ కాలమ్స్‌ కూడా చదువుతాను.


ఆర్కే: ఇప్పుడు చాలామంది రచయితలు పాటలు పాడుతున్నారు కదా. మీరు అటెందుకు వెళ్లలేదు? 

అనంతశ్రీరామ్‌: ‘అందరి గురించి తెలుసుకోవడం మనిషి లక్షణం. వాడి గురించి వాడు తెలుసుకోవడం ముని లక్షణం’ అని బ్రహ్మానందం గారు ఒక మీటింగ్‌లో చెప్పారు. ఈ ఒక్క విషయంలో నేను రుషినయ్యాను. నేను పాడగలను. కాస్త లయ జ్ఞానం ఉంది. శృతి జ్ఞానం ఉంది. నా గొంతును నేను స్టడీ చేసుకున్నప్పుడు తేలిసింమిటంటే నాది స్టేజ్‌ వాయిస్‌. ఐదొందల మంది ఉన్నా కూడా ఆఖరున వందో వరసలో ఉన్నవాడికి నా గొంతు వినిపిస్తుంది. కానీ రికార్డింగ్‌ వాయిస్‌ కాదు. ఒకవేళ మైక్‌ ముందు పాడి తరవాత దాన్ని స్పీకర్లో వింటే.. నా గొంతు ఎలా ఉంటుందంటే... ఇప్పుడు నా వయసు 31. ఒక పదిహేను, పదహారేళ్ల అబ్బాయి... అప్పుడప్పుడే గొంతు మారుతూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైన స్టేజిలో ఉంటుంది. ఆ స్థితిలో ఉండిపోయింది నా గొంతు. ఇది సాహిత్యంలో ఉన్న పరిమళాన్ని తగ్గిస్తుంది. ఘంటసాల గారి గొంతు సాహిత్యం మామూలుగా ఉన్నా ఒక నర్మగర్భమైన భావాన్ని అనిపిస్తుంటుంది. నేను ముఖ్యంగా రాసేది సాహిత్యం కాబట్టి, ఎవరో గాయకుడు నా పాటలో దీర్ఘాన్ని హ్రస్వగా, హ్రస్వాన్ని దీర్ఘంగా పాడితే నేను బాధపడతాను. అలాంటిది నా పాట నేను పాడటం వల్ల ఆ పరిమళం తగ్గిపోతుందన్నప్పుడు నేను పాడటం మంచిది కాదు కాబట్టి నాలో ఉన్న గాయకుడిని సంహరించి, రచయితను ఇలా బతికిస్తున్నాను.


ఆర్కే: బాల్య దశలో స్టేజీ నాటకాలు కూడా వేసేవారు కదా?

అనంతశ్రీరామ్‌: పౌరాణిక నాటకాలు వేసేవాళ్లం. ఎల్‌కేజీలో ఉన్నప్పుడు నేను పోషించిన పాత్ర భక్తాంజనేయ. నేను చదివిన సరస్వతీ శిశుమందిర్‌ విశ్వహిందూ పరిషత ఆర్‌ఎస్‌ఎస్‌ వారిది. అందులో ఎల్‌కెజిని పూర్వ శిశు అనేవాళ్లు. యుకెజిని శిశు అనేవారు. తర్వాత ఒకటో తరగతి. ఆ స్కూలు వార్షికోత్సవాల్లో పౌరాణిక నాటకాలు తప్పనిసరిగా ఉండేవి. మా నాన్నగారు నాకు తర్ఫీదు ఇచ్చేవారు. మొదటిగా వేసిన వేషం హనుమంతుడిది ఏక పాత్రాభినయం. నాటకం పేరు భక్తాంజనేయ. అది అయిన తర్వాత నన్ను ‘బక్క ఆంజనేయ’ అనేవారు. తర్వాత భక్త రామదాసు వేషం వేశాను. ‘బక్క రామదాసు’ అనేవారు. ఆ నాటకాలు వేస్తుండగా నటన మీద కంటే పద్యాలు, డైలాగులు చెప్పేటప్పుడు అవి రాసిన రచయితలు ఎంత గొప్పవాళ్లో అనిపించేది. అలా రచన మీద ఆసక్తి కలిగి నటన నుంచి వెనక్కు వచ్చేశాను.


ఆర్కే: ఏదైనా ట్యూన్‌ ఇచ్చినప్పుడు ఇది రాయలేను అని తప్పుకొన్న సందర్భాలు ఉన్నాయా?

అనంతశ్రీరామ్‌: నేను రాయలేక కాదు. నాకు బంగారం కొండ మీద వేంకటేశ్వర స్వామి గుడి చెక్కివ్వు అని ఒక క్లారిటీ ఇచ్చారనుకోండి. చచ్చినట్టు బంగారాన్ని తవ్వి, దాన్ని ప్రాసెస్‌ చేసి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేయొచ్చు. కానీ నాకొకటి కావాలి. అదేంటో నాకు తెలియడం లేదు. నువ్విచ్చింది మాత్రం కాదు. ఇంకా ఏదో కావాలి అనుకున్నప్పుడు..ఆ సన్నివేశానికి ఉన్న ఐదారు కోణాలు ఆలోచించగలం. వాళ్లకు ఏం కావాలో తెలియనప్పుడు వారిని సంతృప్తి పర్చడం వల్లకాదు. నేను రాసిన 825 పాటల్లో వంద పాటలకు ఇలాంటి సందర్భం వచ్చి ఉంటుంది. నాకు ఇది కావాలి అని స్పష్టంగా చెప్పిన సందర్భాల్లో నా పాట ఎప్పుడూ తిరస్కరణకు గురికాలేదు.


ఆర్కే: మనిషిని చూడగానే ఎగాదిగా చూసి, నువ్వో రచయితవా అని ఎవరైనా ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చారా?

అనంతశ్రీరామ్‌: అంత అవమానకర ఘటనలు ఎదువలేదు కానీ కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురయ్యాయి. ‘చందమామ’కు పాట రాయడానికి కృష్ణవంశీగారి ఆఫీసుకు వెళ్లాను. ఆయన ‘అనంత శ్రీరామ్‌ గారు వస్తారు. రైటరు. లోపలకు పంపండి’ అని బయట చెప్పారు. నేను వెళ్లి కృష్ణవంశీ గారు రమ్మన్నారు. అని చెప్పగానే ఎవరు మీరు అని అడిగారు. అనంత శ్రీరామ్‌ అని చెప్పగానే...‘ఏరీ అనంత శ్రీరామ్‌ గారు. మీరు ఆయన అసిస్టెంటా.. ఆయన్ను తీసుకురండి’ అన్నారు. అది నేనే అని చెప్పగానే ఒక్కసారిగా షాకయ్యారు. ఇలాగే స్టాలిన్‌ ఆడియో ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు మణిశర్మగారి వెనకాలే ఉన్నాను. ఆయన్ను లోపలకు పంపించిన పోలీసు, నన్ను ఒక్కతోపు తోశాడు. ఆ తర్వాత ఠాగూర్‌ మధు గారు వచ్చి సర్దిచెప్పారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి.


ఆర్కే: సాహిత్యం, పాండిత్యంపై పట్టు ఉన్నవాళ్లను అసూయ కూడా అనుసరిస్తూ ఉంటుంది. అది మీలోనూ ప్రవేశించిందా?

అనంతశ్రీరామ్‌: అసూయ ఉండదు అనడం అబద్ధం. కాకపోతే ఇప్పటి పరిస్థితుల్లో ఒక లిరిక్‌ రైటర్‌కు అసూయ ఉండాల్సిన అవసరం లేదు. ఏడాదికి కనీసం వెయ్యి పాటలు వస్తే అందులో ఐదొందల పాటలు కొత్తవాళ్లే రాస్తున్నారు. చిన్న రచయితలకు ఆదాయాలు కూడా బాగున్నాయి.


ఆర్కే: రాయడానికి కష్టపడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?

అనంతశ్రీరామ్‌: బాహుబలి సినిమాలో ‘పచ్చబొట్టు’ పాటకు సమయం ఎక్కువ పట్టింది. పేజీలు ఎక్కువ పట్టాయి. డబ్బు కూడా ఎక్కువే అందింది. పాత్రల్లో ఉన్న చిన్న కాంప్లికేషన్‌ వల్ల కష్టం ఎక్కువైంది. ఈ పాట రాయడానికి 72 రోజులు పట్టింది.


ఆర్కే: రాజమౌళి బాగా ఎంకరేజ్‌ చేశారా మిమ్మల్ని? 

అనంతశ్రీరామ్‌: ఆయన తీసిన యమదొంగ, మర్యాదరామన్న, ఈగ, బాహుబలి సినిమాలకు రాశాను. యమదొంగ సినిమా సమయానికి నేను లోకానికి తెలియని రచయితను. ఆ సమయంలో యంగ్‌ యమ అనే ఒక్క పదం ప్రయోగించినందుకు ఆ సినిమాలో ఐదు పాటలు నాతోనే రాయించారు.


ఆర్కే: మిమ్మల్ని బాగా ఎంకరేజ్‌ చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరు?

అనంతశ్రీరామ్‌: కీరవాణిగారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ట్యూన్‌లు ఇచ్చే ఈ రోజుల్లో కూడా మంచి ఐడియా వస్తే రాసుకురా అని చెప్పేవారు. స్వేచ్ఛగా మంచి మంచి పదాలు ఇస్తే ఆ తర్వాత ట్యూన్‌ కట్టేవారు.


ఆర్కే:‘సాహసమే శ్వాసగా సాగిపో’లో ప్రయోగాలు చేశారా?

అనంతశ్రీరామ్‌: ఇందులోవి పూర్తిగా భిన్నమైన పాటలు. తమిళ వర్షన్‌లో భారతీయార్‌ అనే కవి వెయ్యి సంవత్సరాల క్రితం రాసిన కవితను తీసుకొని రెహమాన్‌గారు ట్యూన్‌ చేశారు. అందులో ఒకే ట్యూన్‌ ఉంటుంది. దాన్నే స్వరాలు మారుస్తూ రకరకాలుగా రాయాలి. అప్పటి కవితను తీసుకున్నారు కాబట్టి సంగీతంలో అంత పరిమళం ఉంది. నేను ఇప్పటి భాష వాడకుండా 30 ఏళ్ల కిందటి మంచి భాష వాడదామనిపించింది. తను, నేను ఇప్పటి భాష. తాను, నేను అనేది అప్పటి భాష. అక్కడి నుంచి మొదలుపెట్టాను. తాను నేను మొయిలు మిన్ను. అని మొదటి లైను రాశాను. మొయిలు అంటే మేఘం. మిన్ను అంటే ఆకాశం. అప్పటి భాష వాడటం వల్ల ఇప్పటి పాటల కంటే భిన్నంగా అనిపించింది.


ఆర్కే: మీ పాటల పట్ల మీ శ్రీమతి ఎలా రియాక్ట్‌ అవుతుంటారు?

అనంతశ్రీరామ్‌: నా భార్య శ్రోత మాత్రమే. విమర్శకురాలు కాదు. అడ్డుపెట్టేదీ కాదు. నా పాట విషయంలో నా అభిప్రాయమే నేను తీసుకుంటాను.


ఆర్కే: మీ ఫ్యూచర్‌ ప్లాన్స్‌ ఏమిటి?

అనంతశ్రీరామ్‌: ఇప్పటివరకూ మనసుకు ఉల్లాసాన్ని కలిగించే పాటలు రాయగలిగాను. నా పాట ఎలా ఉండాటంటే... పరీక్ష తప్పిన ఒక విద్యార్థి, తండ్రికి చెప్పడానికి భయపడి, గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొనే సమయానికి ఎఫ్‌ఎంలో నా పాట వచ్చింది. మెడకు వేసుకున్న ఉరితాడును తీసి ఆ పాట విని పునరుత్తేజం పొందాడు. ఇలాంటి పాటలు నా నుంచి రావాలని నా లక్ష్యం. మనసుకు ఆనందాన్ని కలిగించే పాటలు కాదు మనసును మార్చే పాటలు రాయాలి.

 

పెళ్లయ్యాక కెరీర్‌ మరింత ద్విగుణీకృతమైంది. సంపాదించి ఇంట్లో ఇవ్వడం తప్పిస్తే ఏదీ పట్టించుకోను. పాటపైనే నా దృష్టంతా ఉంటుంది.

 

చదువు మానేస్తా అన్నప్పుడు అమ్మ భయపడింది. అయితే వెనక్కి లాగలేదు.

అవకాశాల కోసం నేను తిరగలేదు. ఫిల్మ్‌నగర్‌లో నా చెప్పులు అరంగుళం కూడా అరగలేదు.

 

నెంబర్‌వన్‌ మాత్రం కాదు. అన్ని జోనర్‌లలోనూ పాటలు రాయగలను.

 

2010 వరకు అంటే పెళ్లయ్యేవరకు ఊహాసుందరే నాకు ఇన్‌స్పిరేషన్‌.

 

కెరీర్‌లో ప్రతీకార వాంఛలు ఉండకూడదు. సదరు నిర్మాత నచ్చలేదనుకో ముందు డబ్బులు అడగాలి. ఆ తరువాత పాట రాయాలి. ఒకవేళ నీ పాట వాళ్లకు అవసరమనుకో వాళ్ల దగ్గర నుంచి నీకు ఫోన్‌ వస్తుంది.

 

ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను ఎండగడుతూ పాట రాయాలని ఆలోచన ఉంది. అందుకు తగిన ఘాటైన పదజాలాన్ని పోగు జేసుకుంటున్నాను. డబ్బులు తీసుకుని ఓట్లేసే వారిని శారీరకంగా ఎదుర్కొనే శక్తి లేదు కాబట్టి పెన్నుతో వారిని ఎదుర్కొంటాను.

 

ఖాళీ సమయాల్లో ఎక్కువగా బ్రౌజ్‌ చేస్తుంటాను. తెలుగులో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ9 లాంటి యాప్స్‌ చూస్తుంటాను. నేషనల్‌ చానెల్స్‌లో ఎన్‌డిటివి, టైమ్స్‌ నౌ ఎక్కువగా చూస్తాను. ఇవికాకుండా నాకు నలుగురు ఆత్మీయులు ఉన్నారు. వాళ్లతో గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడతాను. దాన్ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ నాకు దొరకలేదు. క్రికెట్‌ నుంచి రాజకీయాల వరకూ అన్నీ మాట్లాడుకుంటాం.

 

డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉండి, సామాజిక స్పృహతో ఉండే ప్రైవేట్‌ సాంగ్స్‌ రాయమని అడుగుతూంటారు. ఉద్దేశం మంచిదైనప్పుడు, నా రచనకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, ప్రాణ స్నేహితులు అడిగినప్పుడు ఉచితంగానే రాస్తుంటాను.

 

సీతారామశాస్త్రి గారి పాటలకు ఇప్పటికీ విద్యార్థినే. ఇతరుల పాటలు ఎంజాయ్‌ చేస్తాను. ట్యూన్‌ కోసం మనకు అనుకూలంగాఉండేలాపదాలనుమార్చుకోకుండా..వ్యావహారికంలో వాక్యనిర్మాణం ఎలా ఉంటుందో.. పాటలో కూడా దాన్నే పెట్టాలనే విషయం ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన ఇప్పటికీ నన్ను చాలా ప్రోత్సహిస్తుంటారు.

 

మా తాతగారి నాటి నుంచి మా ఇంట్లో మగవాళ్లు అందరూ వెజిటేరియన్స్‌. ఆడవాళ్లు అంతా నాన్‌-వెజిటేరియన్స్‌.

 

సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్‌ ఫీలింగ్‌ లేదు. క్యాష్‌ ఫీలింగ్‌ మాత్రమే ఉంటుంది.Updated Date - 2020-02-08T07:29:13+05:30 IST