నాన్నను బ్లాక్‌మెయిల్ చేసేవాడిని

ABN , First Publish Date - 2020-02-08T07:24:15+05:30 IST

జన జీవితం చాలా యాంత్రికం అయిపోయిందని యువ కామెడీ హీరో అల్లరి నరేష్‌ అన్నారు. ప్రేక్షకులను అలరించి మనసు

నాన్నను బ్లాక్‌మెయిల్ చేసేవాడిని

జన జీవితం చాలా యాంత్రికం అయిపోయిందని యువ కామెడీ హీరో అల్లరి నరేష్‌ అన్నారు. ప్రేక్షకులను అలరించి మనసు తేలికపరచే అవకాశం లభించడం తనకూ ఎంతో సంతోషాన్నిస్తుందని చెప్పారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ 09-01-2012న నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో తన మనోభావాలను పంచుకున్నారు... 


మీరు బాగా సినిమాలతో బిజీగా ఉన్నట్టున్నారు..

‘గజ’బిజీగా... 5 సినిమాలకు సంతకం చేశాను.


ఏ టాప్‌హీరో కూడా ఇన్ని చేయడం లేదు కదా..

అదేంలేదులెండి. నా నిర్మాతలు నామీద బాగా నమ్మ కం పెట్టినవాళ్లు... మంచివాళ్లు.


‘మినిమం గ్యారంటీయే’ కారణమా?

ఔనండీ.. కానీ, నిలబెట్టుకోవాలి కదా అని భయమేస్తుంది.


ఇది టాలీవుడ్‌లోనేనా..?

బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ ఇలాంటివి బాగానే ఆడుతున్నాయి. లైఫ్‌ బాగా యాంత్రికం అయిపోయింది కను క, కాసేపు ‘సర దాగా నవ్వుకుందా’మనుకునే ప్రేక్షకులు ఎక్కువయ్యారు. అందువల్ల ఈ ట్రెండ్‌..ఇలా..


ఈ పరిపక్వత ఎలా వచ్చింది?

మా నాన్నగారిని చూసి, ఆయన మాటలు విని... ‘‘ఒక సినిమా విడుదలైందా? అక్కడితో దాని గురించి ఆలోచించడం ఆర్టిస్టు వదిలేయాలి. తర్వాతి సినిమా పనిలో పడిపోవాలి’’ అనేవారు అదే నాకు ఆదర్శం.


నాన్నగారు లేని లోటును ఎలా ఫీల్‌ అవుతున్నారు?

చాలా ఎక్కువగా. ఆయనతోనే నాకు ఎక్కువ అనుబంధం. నా పక్కనే పడుకునేవారు. షూటింగ్‌ తర్వాత నా బాగోగులు తెలుసుకునేవారు. నన్నెంతగానో ప్రోత్సహించేవారు. ఆయన మరణం నాకు షాక్‌.


మీరిద్దరూ ఫ్రెండ్స్‌లా ఉండేవారంటారు.. మీ ప్రేమలేఖలు కూడా చూపించేవారట..

ఔను. అమ్మాయిల గురించీ మాట్లాడుకునేవాళ్లం. నేను బాగా ‘బ్లాక్‌మెయిల్‌’ చేసేవాణ్ని. అమ్మ నాకు వందరూపాయలిస్తే, ఆయన వెయ్యిచ్చేవారు.


కథలు ఎలా ఎంపిక చేసుకుంటారు?

ఎవరైనా కథ చెబుతుండగానే నాకు నవ్వొచ్చిందా.... ఓకే. అదీ తక్కువలో అవుతుందనిపిస్తే ఓకే చెప్పేస్తా.


నవ్వించే మీరు ‘గమ్యం’లో ఏడిపించారు కదా?

అన్నిట్లోకి కామెడీయే కష్టం. అదిచేస్తే అన్నీ సాధ్యమే.


పుట్టినరోజున ‘చనిపోయే సీన్‌’ చేశారు...

ఏముందండీ.. అదీ యాక్టింగే కదా.. 45 నిమిషాల్లో 3 కోణాల్లో కెమెరాలు పెట్టారు. సింగిల్‌ షాట్‌లో జరిగిపోయింది. అయినా మా నాన్న ఫీలయ్యారు. అయితే.. చావు సన్నివేశాలు తీశాక కెమెరా ఆన్‌చేసి, దానికేసి చూస్తూ నవ్వమంటారు. కొబ్బరికాయకొట్టి దిష్టి తీస్తారు. అక్కడితో ఆ దోషం పోయినట్లే. నాకూ అదే చేశారు.


సినిమాల్లోలాగా ఇంటాబయటా ‘వాగుతుంటారా’?

చాలా తక్కువ. మితభాషిగానే ఉంటాను.


‘అల్లరి’ సినిమాతో ఆ పేరు స్థిరపడిపోయింది.. ఏమనిపిస్తుంది?

బాగుంటుంది. 90 ఏళ్లయినా అట్లా... పిలుస్తూంటేనే బాగుంటుంది. మరో నరేష్‌ ఉన్నందువల్ల నన్ను అల్లరి నరేష్‌ని చేశారు. అదే ఇంటిపేరైపోయింది. 

 

మీ నాన్న ఈవీవీ పేరున్న దర్శకులు. మీరు యాక్షన్‌ సినిమాలు కాకుండా, కామెడీ చేస్తున్నారు?

ఏదీ ఇలా ఉండాలనుకోలేదు. రవి (రవిబాబు) పరిచయంతో సినిమాల్లోకి వచ్చాను. ‘అల్లరి’ , ‘ధనలక్ష్మి’ సినిమాల తరువాత నాన్నగారితో చేశాను.


ఈవీవీ సినిమాలంటే ద్వంద్వార్థాల సంభాషణలున్నవనేవారు. మీరు వాటి నుంచి ఎలా జాగ్రత్త పడ్డారు..

మొదట కొన్ని నా సినిమాల్లో వచ్చాయి. కొందరు విమర్శించారు. తర్వాత అలాంటివి గుర్తిస్తే దర్శకుడికి చెబుతాను. బికినీ, ముద్దు సీన్లు వద్దంటాను.


ఎందుకు వద్దంటారు?

ఎంత పెద్ద డైలాగ్‌ అయినా చెబుతా, ఎంత పెద్దషాట్‌ అయినా చేస్తా... కానీ రొమాంటిక్‌ సీన్లంటే టెన్షనండీ. ‘పెళ్లి’ సీన్లుకూడా ఉండకూడదనుకుంటా. వాటివల్ల అ మ్మాయిలూ ఇబ్బందిపడుతుంటారు. మా అమ్మ చూసి నా ఇబ్బంది పడకూడదన్నట్లు నా సినిమాలు ఉండాలనుకుంటాను.


నిజ జీవితంలో కూడా ముద్దులుండవా?

ఉంటాయండీ. నేనేమీ శ్రీరామచంద్రుణ్ననడం లేదు. కాలేజీ రోజుల్లో నేనూ అల్లరి చిల్లరగా తిరిగిన వాడినే. అందరిలా నాకూ గర్లఫ్రెండ్స్ ఉన్నారు. కాకుంటే నా విషయాలన్నీ నాన్నకు చెప్పేవాడిని. మా మధ్య దాపరికాలు, రహస్యాలు ఉండవు.


మీ ఎత్తు 6.2. హీరోయిన్లను ఎందుకు పొట్టివాళ్లనే ఎంచుకుంటారు?

అదేం లేదండీ. పొట్టి హీరోయిన్లతో నాకూ ఇబ్బందే. వంగివంగి ముద్దు సీన్లు నటించాల్సి ఉంటుంది.


వంగివంగి బెండైపోయి ‘బెండు అప్పారావు’ తీశారా?

నాన్నగారు నన్ను కాంతారావు, సుబ్బారావు, అప్పారావు... అనేవారు. ఆ పేర్లతో కొన్ని సినిమాలు వచ్చాయి.


ఒక హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటారని పుకార్లు..

అవి పుకార్లే. ఫర్జానా మీద అలాంటివి వచ్చాయి.


సినిమా పిచ్చి ఎలా పట్టింది?

పిచ్చి అననుగానీ, మా నాన్నకు సాల్ట్‌ఫ్యాక్టరీ ఉంటే, అందులోనే ఉండేవాడినేమో. నాన్నతో షూటింగులకు వెళ్తూ ఆయన చేసేవన్నీ చూస్తుండేవాడిని. ‘యాక్టింగ్‌ ఇష్టం’ అని నాన్నతో చెప్పాను. ఆయన ఓకే అన్నారు.


ఈ మధ్య హీరోలను ఎందుకు అనుకరిస్తున్నారు?

‘బ్లేడుబాబ్జీ’లో పవన్‌కల్యాణ్‌ను అనుకరిస్తూ ఆయన చేతులమీద కారు టైర్లు ఎక్కించుకుంటే నేను సైకిల్‌ టైర్లు ఎక్కించుకున్నాను. అది తమాషాగా చేశానంతే. ఇకనుంచి ఇలాంటివి పెట్టొద్దనుంటున్నాను.


అన్నయ్యతో పోల్చుకుంటే అందం విషయంలో ఇన్‌ఫీరియారిటీ కలగలేదా?

-లేదండీ. గతంలో ఒక విలేకరి ఇలాగే అడిగారు- ‘మీ ముఖం అద్దంలో చూసుకున్నారా’ అని. (నేను ర జనీఅభిమానిని). ‘ర జనీ సూపర్‌స్టార్‌ ఎలా అయ్యారు ’అని ప్రశ్నించాను. యాక్టింగ్‌కు అందానికి సంబంధం లేదండీ. 


అలా అడిగినపుడు మీకు కోపం రాలేదా?

వచ్చిందండీ. ‘అందంగిందం వదలి.. నటన గురించి మాట్లాడండి’ అని చెప్పాను. అందాన్ని కాదు.. టాలెంట్‌ ను నమ్ముకుని వచ్చాను. ‘మీది సహజ నటన’ అని చాలామంది అన్నారు. దానికన్నా ప్రశంస మరేదీ లేదు.


 42 సినిమాల తర్వాత మీ నటనకు సంబంధించి ఏమి గమనించారు?

నా ‘అల్లరి’ సినిమా చూసి నేనే నవ్వుకుంటాను. అప్పటికి ఆ వేషం సరిపోయివుండవచ్చు. అయితే... ఇంకొక లా చేసివుంటే బాగుండు కదా అనుకుంటాను.


షూటింగులకు లేట్‌కమర్‌ కదా?

‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ షో అంటే ఈ ప్రశ్న గ్యారంటీ అనుకున్నాను. రోజుకు మూడు సినిమాలు చూస్తాను.... పొద్దున లేవలేను. కానీ షూటింగ్‌కు వెళ్లాక సమయం వృథా చేయను. ఇకపై ఆలస్యం చేయకూడదని కొత్త సం వత్సరం నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు కూడా రెండు సినిమాల షూటింగ్‌ చేసి, ఈ షో సమయానికన్నా ముందే వచ్చా. గుర్తించారనుకుంటా!


మీ నాన్న బ్యానర్‌మీద ఎపుడు సినిమా తీస్తారు?

అన్నయ్య పెళ్లి తరువాత చేస్తాను.


మీ సొంత కథను బన్సాలీ కాపీ కొట్టేశారని...

అదేం లేదండీ. ‘టేస్టింగ్‌ టియర్స్‌’ అని మెర్సీ కిల్లింగ్‌ మీద కథ రాసుకున్నాను. డాక్యుమెంటరీగా తీసి అవార్డు కు పంపాలనుకున్నాను. ఈలోగా ‘గుజారిష్‌’ విడుదలైం ది. ఈపాయింట్‌ ‘నాదేకదా’ అనుకున్నా. నా ఫ్రెండు కూ డా ఆ లెవల్లో ఆలోచించినందుకు ఆనందించాలన్నాడు.


మీరు చేసిన మీకు నచ్చిన పాత్ర?

‘నేను’ సినిమాలోది. అది అంతగా ఆడలేదు. కానీ టీవీలో వచ్చినపుడు 400 ఫోన్లు వచ్చాయి. మరొకటి ‘గమ్యం’లోది. ఆ పాత్ర మాటలు బూతంటే బూతు. ఫి లాసఫీ అనుకుంటే ఫిలాసఫీ.


మీ బలం, బలహీనత?

ఆత్మవిశ్వాసం. సానుకూల దృక్పథంతో ముందుకెళ్తుంటాను; విపరీతమైన కోపం. అయితే ఎవరిమీదా కేకలు వేయను. కోపం తగ్గేదాకా పక్కకెళ్లి కూర్చుంటాను.


కామెడీ ఆర్టిస్టుగా మీకు నచ్చిన సీన్‌ లేదా డైలాగ్‌?

ఇప్పుడిక్కడ యాక్టింగ్‌ చేయలేను గానీ... గమ్యంలో ‘శీనుగాడి సీను అయిపోయింది బాసూ’ అనే డైలాగ్‌. ‘బాసూ, నీకోసం వచ్చే ఈ చావు వచ్చింది’ అనేవి బాగా నచ్చిన డైలాగులు.


మీ లక్ష్యం?

దర్శకత్వం. ఈవీవీ సినిమాను తప్పక కొనసాగిస్తాను.

Updated Date - 2020-02-08T07:24:15+05:30 IST