‘గాడిద కొడకా ఇందులోనే బతుకుతావ్‌ పో’ అన్నారు

ABN , First Publish Date - 2020-02-07T21:32:38+05:30 IST

ఇప్పుడు మన చుట్టూ ఎందరో మిమిక్రీ ఆర్టిస్టులున్నారు. కానీ.. ధ్వన్యనుకరణ సామ్రాట్‌... అంటే పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవే! ధ్వన్యనుకరణకు కళ స్థాయిని.. ఒక గౌరవాన్ని కల్పించి వ్యక్తి.

‘గాడిద కొడకా ఇందులోనే బతుకుతావ్‌ పో’ అన్నారు

నాన్న మాటే ఆశీర్వాదమైంది

ఆరేళ్లలోనే రాజకీయాలంటే విసుగొచ్చింది

ఆసక్తి లేకపోయినా సినిమాల్లో చేశాను

తమను అనుకరించినా విని ఆనందించింది ఆ ముగ్గురే

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో నేరెళ్ల వేణుమాధవ్‌


ఇప్పుడు మన చుట్టూ ఎందరో మిమిక్రీ ఆర్టిస్టులున్నారు. కానీ.. ధ్వన్యనుకరణ సామ్రాట్‌... అంటే పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవే! ధ్వన్యనుకరణకు కళ స్థాయిని.. ఒక గౌరవాన్ని కల్పించి వ్యక్తి. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారిలా... 16-4-2012న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...


వెల్‌కమ్‌ టు ఓపెన్‌హార్ట్‌. వేణుమాధవ్‌గారూ

నమస్కారం.


మిమిక్రీ కళకే గుర్తింపు, గౌరవం తెచ్చినవారు మీరు. ఈ కార్యక్రమాన్ని మీకు బాగా నచ్చినప్పుడు మిమిక్రీతోటే ప్రారంభింద్దాం.

మిమిక్రీలో ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎప్పుడాపాలి అనేది తెలియాలి. అది అనుభవం మీద వస్తుంది. నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు అద్వానీ నన్ను మిమిక్రీ చేయమన్నారు. మొదట సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి స్వరాన్ని అనుకరించాను. అందరూ నిశ్చేష్టులై విన్నారు. తర్వాత నెహ్రూ లాల్‌బహదూర్‌ శాసి్త్రని పరిచయం చేసినప్పుడు కూడా ఇలాగే కొద్దిసేపు మిమిక్రీ చేశాను.


సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ముందు ఆయన్ని అనుకరించినప్పుడు ఆయన ఎలా ఫీలయ్యారు?

ఒకసారి ఐక్యరాజ్యసమితిలో కెనడీని, రాధాకృష్ణన్‌ని అనుకరిస్తే అంతా స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్‌లో సర్వేపల్లి వేషం నాతో వేయించారు. ఆ విషయం తెలిసి రాధాకృష్ణన్‌ చిత్తూరు నాగయ్యగారిని నా గురించి అడిగి.. ‘ఆయన్ని చూడాలని ఉంది’ అన్నారట. నాగయ్యగారు మర్నాడు మధ్యాహ్నం ఒంటిగంటకు నన్ను రమ్మన్నారు. నేను వెళ్లగానే ఆయనే బయటికొచ్చారు. నా రోల్‌ మోడల్‌ రాధాకృష్ణన్‌గారే. అలాంటిది ఆయన్ని చూడగానే నాకు వివేకానందుణ్ని చూసినట్టు అనిపించింది. ‘మీ దర్శనం చేసుకోవడానికి వచ్చానండీ’ అని నేనంటే.. ‘నా దర్శనం చేస్తే ఏముంది? నాగయ్యగారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుంది’అంటూ రెండు చేతులూ ఎత్తి ఆయనకు దణ్నం పెట్టారు.


తెలుగులోనే మాట్లాడారా ఆయన?

తెలుగులోనే మాట్లాడారు. ‘ఉన్నంత సేపూ తెలుగులోనే మాట్లాడండి. ఇంగ్లిష్‌ వినీవినీ చికాగ్గా ఉంది’ అన్నారు. మేమూ నవ్వాం. తర్వాత మాటల మధ్య.. తెలుగు పద్యం గురించి అడిగితే.. గగ్గయ్య, రఘురామయ్య ఇలా నలుగురైదుగురు రంగస్థల నటులను అనుకరించి చూపాను. ఆయన్ను కూడా అనుకరిస్తే నవ్వేసి ‘ఓ ఇట్స్‌ వండర్‌ఫుల్‌’ అన్నారు.


మీరు మిమిక్రీ మొదలుపెట్టినప్పుడు ఇంత ఆదరణ కానీ, గుర్తింపుకానీ లేదు కదా?

మా వరంగల్‌లో... బంధువుల్నీ, వచ్చేవాళ్లనీ, పోయేవాళ్లనీ.. మొదట్లో అందరినీ అనుకరించేవాణ్ని. అందరూ ఆనందించేవాళ్లు. మా నాన్న ఆరు భాషల్లో పండితుడు, కవి. ఇంగ్లిష్‌ని యూరోపియన్లలా మాట్లాడేవారు. నేను తహసీల్దార్‌ కావాలని ఆయన అనుకునేవారు. నాకేమో ఇష్టం ఉండేది కాదు. ఒకసారి నేను రాత్రి ఇంటికొచ్చి తలుపు కొడితే.. మానాన్న నేను సినిమాకు వెళ్లొచ్చాననుకుని కర్రతో కొట్టబోయారు. తప్పుకొన్నాను. ఆయన.. ‘గాడిద కొడికా నువ్వు ఇందులోనే బతుకుతావు పో’ అని మూడుసార్లు అన్నారు. ఆయన మాటే ఆశీర్వాదమైంది. మా ప్రిన్సిపాల్‌ రామనర్సుగారనీ.. ఆయన నా జీవితాన్నే మార్చేశారు.


మీరు మొట్టమొదటగా ఎవర్ని అనుకరించారు?

నాగయ్యగారిని. ఊళ్లో అందరినీ అనుకరించడం మొదట్నుంచీ ఉండేది.


గాంధీజీ, సుభాష్‌ చంద్రబోస్‌ మధ్య వివాదం కూడా అనుకరించేవారు కదా?

అలా చెప్తే చాలా ఉన్నాయి. గాంధీజీ, సుభాష్‌ చంద్రబోస్‌, సర్దార్‌ పటేల్‌ అందరినీ అనుకరించాను.

మన్మోహన్‌సింగ్‌ను అనుకరిస్తారా?

ఏముంది.. ఎవరినైనా అనుకరించాలంటే వారి గొంతు వినగానే ఆ ఫీల్‌ రావాలి.


మిమిక్రీతో ఉపాధి.. అట్లాగే పేరు పొందొచ్చని ఎప్పుడు అనిపించింది?

అప్పట్లో మిమిక్రీ అనే కళ లేదు. ఒకచోట ప్రోగ్రాం చేస్తే.. అక్కడే పది ప్రోగ్రాంలు వచ్చేవి. అలా ప్రాచుర్యం పొందింది.


మీరు అనుకరించలేకపోయిన స్వరం ఏదైనా ఉందా?

అలా ఏం లేదు.


పీవీ నరసింహారావుతో మీకు మంచి అనుబంధం ఉంది కదా?

అవును. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. చాలా సంస్కారి. మహా పండితుడు.


చేదు అనుభవాలేవైనా ఎదురయ్యాయా?

ఎప్పుడూ ఎదురవలేదు. ఎవరి వాయిస్‌ని వారి ముందు అనుకరిస్తే ఆనందించరు. అలా విని ఆనందించినవారు రాధాకృష్ణన్‌, కృష్ణమీనన్‌, లాల్‌ బహదూర్‌ శాస్త్రి. ఈ ముగ్గురే.


మీ శిష్యులు కొన్ని వందలు, వేల మంది ఉన్నారు కదా.. వారిలో మిమ్మల్ని డామినేట్‌ చేసినవాళ్లు, లేదా సమీపంలోకి వచ్చినవాళ్లున్నారా?

ఒక్కరిద్దరున్నారు.


పేర్లు చెప్తారా?

చెప్తే మిగతావాళ్లు బాధపడతారు.


1972-78 మధ్య ఎమ్మెల్సీగా ఉన్నారు కదా?

అవును, అప్పట్లో వెంగళరావుగారు నన్ను పిలిచి కౌన్సిల్‌ ప్రొసీడింగ్స్‌ గురించి అడిగితే చెప్పేవాణ్ని. అందరూ ఎంజాయ్‌ చేసేవారు. రమీజాబీ కేసు సందర్భంగా మూడు రోజులపాటు జరిగిన చర్చను నేను అనుకరించేవాణ్ని. కానీ, ఆరేళ్లపాటు రాజకీయాలు చూసీచూసీ విసిగిపోయాను.


సినిమాల్లో కూడా కొన్నాళ్లు నటించారు కదా? తర్వాతెందుకు కొనసాగించలేదు?

ఒకసారి మద్రాసులో ఏదో ప్రోగ్రాం కోసం వెళ్లినప్పుడు మిత్రులు బీఎన్‌ రెడ్డి, డూండీ వంటివారు అడిగితే కాదనలేక కొన్ని సినిమాల్లో చేశాను. కానీ, నాకు ఆసక్తి లేక తర్వాత మానేశాను.


మీకు ఉచ్ఛ దశ ఎంతకాలం నడిచింది?

ఇప్పటికీ నడుస్తూనే ఉంది. అయితే.. ఆర్టిస్టుకి అహంకారం ఉండకూడదు. నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అనుకునేవాడికి చావులేదు.


మీవయసు 80.. అంటే 65 సంవత్సరాలు మీది మిమిక్రీ జీవితమే. ఇది మీకు సంతృప్తినిచ్చిందా? ఇంకా ఏదైనా అసంతృప్తి ఉందా?

కళ అనంతం. కొత్తదేదైనా చేయాలనే తపన ఉంటుంది. ‘మిమిక్రీకళ’ అనే పుస్తకం రాశాను. చాలామందిని తయారుచేయడం, ఈ కళకు ఇంకా గౌరవాన్ని తేవడం నా లక్ష్యాలు.


మీ ఇంట్లో మీ వారసులెవరు?

మా అమ్మాయి లక్ష్మీ తులసి. తను కొన్ని ప్రోగ్రాములు కూడా చేసింది. నాకు నలుగురు పిల్లలు.. పెద్దబ్బాయి శ్రీనాథ్‌, తర్వాత లక్ష్మీ తులసి, మూడు వాసంతి, నాలుగు రాధాకృష్ణ. అంతా సెటిలయ్యారు. నేనే ఇంకా సెటిలవలేదు. ఎందుకంటే.. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది.


మీకు బాగా పేరు తెచ్చింది టెన్‌ కమాండ్‌ మెంట్స్‌లో సీన్ల అనుకరణ కదా?

అవును, నేను ఆ సీన్లు చేస్తుంటే కొంతకాలం తర్వాత ఒక డాక్టర్‌ .. ‘మీరా సీన్లను అనుకరించడం మానేయండి, నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది’ అని చెప్పారు. ఆ సీన్ల అనుకరణకు నేను చాలా కష్టపడ్డాను. కొన్ని వచ్చేవి.. కొన్ని వచ్చేవి కావు. ఎందుకురావనే పంతంతో అన్నీ చేసేవాణ్ని.

Updated Date - 2020-02-07T21:32:38+05:30 IST