కెన‌డా నుంచి మిత్రుడి మృతదేహాన్ని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు..

ABN , First Publish Date - 2020-07-15T19:51:29+05:30 IST

కెన‌డాలో క్యాన్స‌ర్‌తో మృతి చెందిన మిత్రుడి మృతదేహాన్ని స్వ‌దేశానికి పంపించేందుకు భార‌త యువ‌కులు విరాళాలు సేక‌రిస్తున్నారు.

కెన‌డా నుంచి మిత్రుడి మృతదేహాన్ని స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు..

ముక్త్సర్ సాహిబ్‌(పంజాబ్):కెన‌డాలో క్యాన్స‌ర్‌తో మృతి చెందిన మిత్రుడి మృతదేహాన్ని స్వ‌దేశానికి పంపించేందుకు భార‌త యువ‌కులు విరాళాలు సేక‌రిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం ముక్త్సర్ సాహిబ్‌కు చెందిన‌ పునీత్ రాజోరియా(21) ఉన్న‌త చ‌దువుల కోసం 2018లో కెనడాకు వెళ్లాడు. ఈ క్ర‌మంలో క్యాన్సర్ బారిన ప‌డ్డ పునీత్‌ జూలై 12న కన్నుమూశాడు. అయితే, అప్ప‌టికే అతని చికిత్స‌కు భారీ మొత్తం ఖ‌ర్చు కావ‌డంతో మృతదేహాన్ని స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు పునీత్ త‌ల్లిదండ్రుల వ‌ద్ద డ‌బ్బుల్లేవు. ఈ విష‌యం తెలుసుకున్న అత‌ని స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు. అంతేగాక ఇండియాలో ఉన్న అత‌ని ఓ సోద‌రుడు కూడా క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న‌ట్లు వారు పేర్కొన్నారు. అందుకే పునీత్ మృతదేహాన్ని ఇండియాకు పంపించ‌డంతో పాటు అత‌ని సోద‌రుడి క్యాన్స‌ర్‌ చికిత్స కోసం ‌విరాళాలు సేక‌రిస్తున్న‌ట్లు తెలిపారు. దీని కోసం ఆన్‌లైన్ ద్వారా ఫండ్‌రైజింగ్ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు తొచినంత సాయం చేయాల‌ని వారు కోరుతున్నారు. 


మృతుడి తండ్రి దేవిందర్ కుమార్ రాజోరియా మాట్లాడుతూ “పునీత్ మృతదేహాన్ని స్వ‌దేశానికి తీసుకురావడానికి మాకు సహాయం చేయమని నేను విదేశాంగ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాను. అంతేకాకుండా, కెనడాలోని అతని స్నేహితులు కూడా ఆన్‌లైన్ ద్వారా నిధులు సేక‌రించ‌డం ప్రారంభించారు.” అని అన్నారు.      

Updated Date - 2020-07-15T19:51:29+05:30 IST