ఆవిరవుతున్న ట్రంప్ ఆశలు..!
ABN , First Publish Date - 2020-12-01T22:02:39+05:30 IST
అమెరికా అధ్యక్ష పదవిని పదిలరచుకోవాలని కలలు కంటున్న ట్రంప్ ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. ట్రంప్ ఓటమిని విస్కాన్సిన్ రాష్ట్రం ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నిక

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవిని పదిలరచుకోవాలని కలలు కంటున్న ట్రంప్ ఆశలు క్రమంగా ఆవిరవుతున్నాయి. ట్రంప్ ఓటమిని విస్కాన్సిన్ రాష్ట్రం ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించారు. అయితే ట్రంప్ మాత్రం తన ఓటమిని ఒప్పుకోవడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఓ పక్క ఆరోపిస్తూ కోర్టులను ఆశ్రయిస్తూనే.. మరోపక్క తాను గెలుస్తాననే నమ్మకం ఉన్న రాష్ట్రాల్లో ఓట్లను మళ్లీ లెక్కించాలని అభ్యర్థనలు పెట్టారు. సరైన ఆధారాలు చూపకపోవడంతో ట్రంప్ వేసిన పిటిషన్లను కోర్టులు కొట్టేస్తున్నాయి. ఇదే సమయంలో రికౌంటింగ్‌కు అభ్యర్థించిన రాష్ట్రాల్లో కూడా ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగానే వస్తున్నాయి. జో బైడెన్ గెలుపును అరిజోనా అధికారికంగా ధ్రువీకరించిన గంటల వ్యవధిలోనే విస్కాన్సిన్ రాష్ట్రం కూడా రికౌంటింగ్ అనంతరం తుది ఫలితాలను ప్రకటించింది.
విస్కాన్సిన్ రాష్ట్రంలో ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాధించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. బైడెన్ ఎన్నికను అధికారికంగా గుర్తిస్తూ.. ధ్రువీకరణ పత్రాలపై సంతకం కూడా చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా నవంబర్ 3న జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని.. ఎటువంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న రాష్ట్ర అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దీంతో విస్కాన్సిన్ రాష్ట్రానికి చెందిన 10 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో చేరాయి. ఈ క్రమంలో స్పందించిన ట్రంప్ క్యాంపెయిన్.. విస్కాన్సిన్ ఫలితాలను కోర్టులో సవాల్ చేయనున్నట్టు ప్రకటించింది. జార్జియా, మిచిగాన్, పెన్సిల్వేనియా, నెవడా, అరిజోనా రాష్ట్రాల్లోని ఫలితాలపై ట్రంప్ ఇప్పటికే న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. అయితే పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్ బృందం వేసిన పటిషన్లను సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. జో బైడెన్ 306 ఎలక్టోలర్ ఓట్లను సాధించి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.