హ‌జ్ విష‌యంలో సౌదీ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించిన డ‌బ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-06-25T18:14:06+05:30 IST

ఈ ఏడాది ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే యాత్రికుల‌ను హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ఓ) ప్ర‌శంసించింది.

హ‌జ్ విష‌యంలో సౌదీ నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించిన డ‌బ్ల్యూహెచ్ఓ

జెనీవా: ఈ ఏడాది ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే యాత్రికుల‌ను హ‌జ్ యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌(డ‌బ్ల్యూహెచ్ఓ) ప్ర‌శంసించింది. ప్ర‌స్తుత క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో సౌదీ తీసుకున్న ఈ నిర్ణ‌యం అభినంద‌నీయమ‌ని డ‌బ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ గెబ్రోయెసుస్ అన్నారు. ఈ నిర్ణ‌యాన్ని వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ స‌మ‌ర్థిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌హ‌మ్మారి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో త‌క్కువ సంఖ్య‌లో యాత్రికుల‌ను అనుమతించ‌డం మంచి నిర్ణ‌యమ‌ని తెలిపారు. ఇక ఈ ఏడాదికి హజ్ యాత్రకు విదేశీయులను ఎవరినీ అనుమతించబోవడం లేదని సౌదీ రాజు ప్రకటించిన విష‌యం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హజ్ యాత్రికుల సంక్షేమం కోసమే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే... సౌదీలో విల‌య‌తాండ‌వం చేస్తున్న క‌రోనా ఇప్ప‌టికే 1.67 ల‌క్ష‌ల‌ మందికి ప్ర‌బ‌లింది. 1,387 మందిని పొట్ట‌న‌బెట్టుకుంది.  

Updated Date - 2020-06-25T18:14:06+05:30 IST