కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది: డబ్ల్యూహెచ్ఓ
ABN , First Publish Date - 2020-07-09T02:23:00+05:30 IST
కరోనా మహమ్మారి గాలి ద్వారా(ఎయిర్ బోర్న్) వ్యాప్తి చెందుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలున్నట్టు
జెనీవా: కరోనా మహమ్మారి గాలి ద్వారా(ఎయిర్ బోర్న్) వ్యాప్తి చెందుతుందనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిర్థారించింది. ఇటీవల 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రజ్ఞులు వైరస్ కేవలం డ్రాప్‌లెట్స్(తుంపర్ల) ద్వారా మాత్రమే కాకుండా.. గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందంటూ డబ్ల్యూహెచ్ఓకు లేఖ రాశారు. అంతేకాకుండా వెంటనే కరోనాను ఎయిర్‌బోర్న్ వైరస్‌గా ప్రకటించాలంటూ శాస్త్రజ్ఞలు డబ్ల్యూహెచ్ఓకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎయిర్‌బోర్న్ వ్యాప్తి జరుగుతున్నట్టు నిర్థారించడం ఆస్తకికరంగా మారింది. ఇతర మార్గాల మాదిరిగానే ఎయిర్ బోర్న్ వ్యాప్తి కూడా జరుగుతున్నట్టు తగిన సాక్ష్యాలను తాము గుర్తించామని డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ బెనెడెట్టా అలెగాంజీ తెలిపారు. ఎయిర్‌బోర్న్ వ్యాప్తి గురించి బహిరంగంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని తాము నిర్ణయించుకున్నట్టు బెనెడెట్టా పేర్కొన్నారు. అదే విధంగా ఎయిర్ బోర్న్ వ్యాప్తి ఎన్ని రకాలుగా ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతుందో గుర్తించి, దీని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలన్నారు. కొవిడ్-19 వ్యాప్తికి సంబంధించి మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్‌కు చెందిన మేరియా వాన్ కెర్‌కోవ్ తెలిపారు.
ఎయిర్‌బోర్న్.. డ్రాప్‌లెట్.. ఏమిటి తేడా?
ఎయిర్‌బోర్న్ వైర్‌సకు, డ్రాప్‌లెట్ వైరస్‌కు స్పష్టమైన తేడా ఏమిటి? ఏదైనా వైర్‌సను గాలి ద్వారా వ్యాపించేదిగా ఎలా నిర్ధారిస్తారు? అంటే.. సాధారణంగా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్లలో కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి ఉంటాయి. పెద్ద తుంపర్లు తక్కువ దూరం ప్రయాణించి కింద (లేదా) అక్కడ ఉన్న బొమ్మలు, తలుపు గొళ్లెం వంటివాటిపై పడిపోతాయి. అదే చిన్న తుంపర్లయితే మరికొంచెం ఎక్కువ దూరం ప్రయాణించి పడిపోతాయి (అలా తుంపర్లు పడిన చోట ఎవరైనా చెయ్యి పెట్టినప్పుడు అందులో ఉండే వైరస్ వారి చేతికి అంటుతుంది. ఆ చేతిని ముఖంపై పెట్టుకున్నప్పుడు ముక్కు, నోరు, కళ్ల ద్వారా వారి శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందుకే.. మనం పెట్టుకున్న మాస్కు ముందు భాగాన్ని ముట్టుకోవద్దని శాస్త్రజ్ఞులు పదేపదే చెబుతున్నారు). ఈ రెండింటికన్నా చిన్నవి.. అంటే మన కంటికి కనిపించనంత సూక్ష్మమైనవి, పరిమాణంలో 5 మైక్రోమీటర్ల (మైక్రో మీటర్/మైక్రాన్ అంటే మీటర్‌లో పది లక్షల వంతు) కన్నా తక్కువ వ్యాసం ఉండేవి గాలిలో ఎక్కువసేపు అలా నిలిచిపోతాయి. వాటిని ఏరోసాల్స్ అంటారు. ఈ ఏరోసాల్స్‌ను పీల్చడం ద్వారా కూడా వ్యాధి సంక్రమిస్తుంది కాబట్టి కొవిడ్-19 ఎయిర్‌బోర్న్ వ్యాధే అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.