కొవిడ్-19 మూలాల పరిశోధనను రాజకీయం చేయకండి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్
ABN , First Publish Date - 2020-12-01T06:36:16+05:30 IST
కొవిడ్-19 మూలాలకు సంబంధించి చేస్తున్న పరిశోధనను రాజకీయం చేయొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)

జెనీవా: కొవిడ్-19 మూలాలకు సంబంధించి చేస్తున్న పరిశోధనను రాజకీయం చేయొద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ సోమవారం ప్రపంచ దేశాధినేతలను వేడుకున్నారు. పరిశోధనను రాజకీయం చేయడం వల్ల వైరస్ మూలాలు తెలిసే అవకాశం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. డబ్ల్యూహెచ్ఓ వూహాన్ నుంచి అధ్యయనాన్ని మొదలుపెడుతుందని ఆయన చెప్పారు. వూహాన్‌లో లభించిన సమాచారం ద్వారా ఇతర ప్రదేశాలపై అనుమానం కలిగితే అక్కడ కూడా పరిశోధన జరుపుతుందన్నారు. కొవిడ్-19 మూలాలను తెలుసుకునేందుకు అవసరమైన ప్రతి ఒక్క పనిని డబ్ల్యూహెచ్ఓ చేస్తోందని, కొందరు మాత్రం దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్-19 మూలాలను తెలుసుకోవడం ఎంతో అవసరమని, దీని ద్వారా భవిష్యత్తులో మరో మహమ్మారి రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు అని టెడ్రోస్ అన్నారు. కాగా.. యూరప్ దేశాల్లో కరోనా కేసులు తగ్గడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అయితే మరికొద్ది రోజుల్లో అనేక దేశాల్లో క్రిస్ట్‌మస్, న్యూ ఇయర్ వేడుకలు జరగనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.