కరోనాతో కన్నుమూసిన 'వాహెగురు బాబా'
ABN , First Publish Date - 2020-04-26T16:03:50+05:30 IST
'వాహెగురు బాబా'గా పేరొందిన మారథాన్ రన్నర్ అమ్రిక్ సింగ్(89) బర్మింగ్‌హామ్‌లో కరోనాతో కన్నుమూశారు.

బర్మింగ్‌హామ్: 'వాహెగురు బాబా'గా పేరొందిన మారథాన్ రన్నర్ అమ్రిక్ సింగ్(89) బర్మింగ్‌హామ్‌లో కరోనాతో కన్నుమూశారు. బర్మింగ్‌హామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అమ్రిక్ సింగ్ బుధవారం మృతిచెందినట్టు ఆయన మనవడు పమన్ సింగ్ తెలిపారు. ఆయన నోటి వెంబడి ఎప్పుడు వాహెగురు అనే పదం వచ్చేదని... ఎవరికైనా ఆశీర్వచనాలు ఇచ్చిన తన తాత ఇదే పదం ఉపయోగించేవారని తెలిపారు. అందుకే తమ కమ్యూనిటీలో ఆయనకు ‘వాహెగురు బాబా’ అనే పేరు వచ్చిందని పమన్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఉంటున్న తమ ఇంట్లో తన తాత ఇప్పటి వరకు మారథాన్ రన్నింగ్‌లో గెలిచిన సుమారు 650 మెడల్స్ ఉన్నాయన్నారు.
ప్రపంచ అత్యంత వృద్ధ మారథాన్ రన్నర్ ఫౌజా సింగ్(109) కూడా అమ్రిక్ సింగ్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనతో కలిసి ఎన్నో రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న మిత్రుడిని కోల్పోవడం ఎంతో బాధించిందని ఫౌజా సింగ్ తెలిపారు. కాగా... ఫౌజా సింగ్ అంతర్జాతీయ ఖ్యాతి పొందటానికి, 100 సంవత్సరాల వయస్సులో 2011లో మారథాన్ పూర్తి చేసి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ రన్నర్ కావడానికి చాలా ముందు అమ్రిక్ సింగ్, అతని సహచరుడు అజిత్ సింగ్ యూకేలో చాలా మారథాన్ రేసింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించారు. తనను మారథాన్‌ల కోసం అధికారిక శిక్షణ పొందాలని ప్రేరేపించింది అమ్రిక్ సింగ్, అజిత్ సింగ్‌లేనని ఈ సందర్భంగా ఫౌజా సింగ్ గుర్తు చేశారు. తాము ముగ్గురం ఎన్నో మారథాన్ రన్నింగ్ రేసుల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.