అమెరికాలో ఉంటూనే తెలుగు పద్యం కోసం మహా యజ్ఞం

ABN , First Publish Date - 2020-09-14T18:11:42+05:30 IST

గురులఘువులు, యతిప్రాసలు, చంపకమాల, ఉత్పలమాల, ఆటవెలది, న్యస్తాక్షరి, తేటగీతి, దత్తపది, శార్దూలం, మత్తేభం, అలంకారం, సీసం, కందం,.... ఇవేంటో గుర్తుకొచ్చాయా..?

అమెరికాలో ఉంటూనే తెలుగు పద్యం కోసం మహా యజ్ఞం

గురులఘువులు, యతిప్రాసలు, చంపకమాల, ఉత్పలమాల, ఆటవెలది, న్యస్తాక్షరి, తేటగీతి, దత్తపది, శార్దూలం, మత్తేభం, అలంకారం, సీసం, కందం,.... ఇవేంటో గుర్తుకొచ్చాయా..? చిన్నప్పుడు పాఠశాలలో తెలుగు మాస్టారు చెప్పి వల్లెవేయించిన పదాలివి.. ఆధునిక యాంత్రిక జీవిత మోజులో పడి ఆంగ్లం వెంట పరుగులు పెట్టి మర్చిపోయిన తేటతెలుగు భాషకు సంబంధించిన పదాలివి.. తెలుగు రాష్ట్రాల్లోనే తెలుగు భాషను పట్టించుకోని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కానీ అమెరికాలో ఉంటూ కూడా తెలుగు భాష అభ్యున్నతికి కృషి చేస్తున్నారో ప్రముఖుడు.. ఆయనే పద్య గురువు కొల్లారపు ప్రకాశరావు శర్మ..


పెద్దపల్లి జిల్లా మంథని వాసి అయిన కొల్లారపు ప్రకాశరావు శర్మ.. నాలుగు దశాబ్దాల క్రితమే అమెరికాకు వెళ్లారు.. అక్కడే ఎంఎస్ పూర్తి చేశారు. అమెరికన్ సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నతోద్యోగం చేస్తున్నారు.1968 వరకే తెలుగు భాషతో ఆయన ప్రయాణం సాగింది.. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగ జీవితంలో పడి తెలుగు భాష వైపే చూడలేని పరిస్థితి. కానీ పద్యం అంటే ఆయనకున్న మక్కువ వల్ల అవధానాల్లో అప్పుడప్పుడు పాల్గొంటూ, అడపాదడపా గేయాలు, కీర్తనలు, భజన పాటలు రాసేవారు. తెలుగు నేలకు దూరంగా ఉన్నా.. తెలుగు సాహిత్యం అంటే ఆయనకు ఎనలేని ప్రీతి.. పద్యాలు రాయాలన్న కోరికతో.. కొన్నాళ్ల క్రిందట భారత్‌కు వచ్చినప్పుడు ఛందస్సు, తెలుగు వ్యాకరణ పుస్తకాలను తనతోపాటు అమెరికాకు తీసుకెళ్లారు. పట్టుబట్టి, సాధన చేసి ఎన్నో పద్యాలను రచించారు. ఛందస్సుతో తెలుగు పద్యాల రచనకు ఆయన శ్రీకారం చుట్టారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష వ్యాప్తికి అమెరికాలో ఉంటూనే ఆయన కృషి చేస్తున్నారు. 


తనతోపాటు ఎంతో మందికి తెలుగు భాషపై మక్కువ ఉండటం గ్రహించిన ఆయన.. తన పద్య రచనను వారికి కూడా నేర్పించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ‘మంథనీ పీపుల్ పద్య సాధన బృందం’ పేరుతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేసి ఔత్సాహికులకు ఛందస్సుతో పద్యాలు రాయడం ఎలాగో నేర్పిస్తున్నారు. ప్రతీ ఆదివారం సాయంత్రం ఏడున్నర గంటలకు ఓ గంట పాటు ఆన్‌లైన్‌లోనే ప్రకాశరావు శర్మ పాఠాలు బోధిస్తారు. వాయిస్ మెసేజ్‌ల ద్వారా పద్య లక్షణాలు, వ్యాకరణ అంశాల వంటి వాటిని వివరిస్తారు. ఈ వాట్సప్ గ్రూపును కేవలం పద్య సాధనకు మాత్రమే ఉపయోగిస్తుండటం గమనార్హం. ఇప్పటికే ఈ వాట్సప్ గ్రూపు ద్వారా ఎంతో మంది పద్య రచన నేర్చుకున్నారు. వాట్సప్ గ్రూపును క్రియేట్ చేసి.. సొంతూళ్లో తెలుగు వెలుగులు విరజిమ్మేలా చేయడంతోపాటు.. ఎనలేని గుర్తింపును తెచ్చుకున్నారు. అమెరికా, కెనడా, గల్ఫ్, సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ఉన్న తెలుగు వారికి కూడా ఛందస్సుతో పద్య రచన చేయడం ఎలాగో నేర్పుతున్నారాయన. ఢిల్లీ తెలుగు అకాడమీ, వాషింగ్టన్ సాహిత్య వేదిక, తానా తదితర సంస్థలచే అవార్డులు, సత్కారాలు పొందారు. 


తెలుగు మాతృభాష అయితే చాలు.. పద్యాలు రాసేయొచ్చు..

తెలుగు కంటే ఆంగ్లం ముద్దు... అని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్న రోజులివి.. పిల్లలు తెలుగు భాషలో మాట్లాడితే అవమానంగా భావించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్న కాలమిది.. మరుగున పడిపోతున్న భాషను బతికించుకునేందుకు.. కాలగర్భంలో కలిసిపోయేలా ఉన్న పద్య సాహిత్యాన్ని పది కాలాల పాటు కాపాడుకునేందుకు కొల్లారపు ప్రకాశరావు శర్మ నడుంకట్టారు. గురులఘువులతో మొదలుపెట్టి.. ఛందస్సుతో పద్య రచన ఎలా చేయాలనేదానిపై ఆయన ప్రత్యేకంగా ‘పద్యరచనామృతబోధిని’ అనే పుస్తకం రాశారు. గురువు అవసరం కూడా లేకుండా చదవుకుని నేర్చుకోవడం ద్వారా.. ఛందోబద్ధ పద్యాలు రాయగలిగేలా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ‘తెలుగు భాషలో పండితుడు కానవసరం లేదు..ప్రభందాలను చదవనవసరం లేదు.. పద్య సాహిత్యంతో ఏమాత్రం సంబంధం ఉండాల్సిన అవసరం లేదు.. ఎలాంటి చదువు చదువుకున్నా.. ఏ రంగంలో ఉద్యోగం చేస్తున్నా.. తెలుగుపై అభిమానం ఉంటే చాలు.. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఛందస్సుతో పద్యాలు రాయగలరు..’ అని కొల్లారపు ప్రకాశరావు శర్మ తేల్చిచెబుతున్నారు. 


పద్యరచనామృతబోధిని.. పుస్తకం లక్ష్యం ఏంటంటే..

‘ఒకప్పుడు సంస్కృతం, ఛందస్సు వంటి వాటిని ప్రాథమిక పాఠశాలలో తప్పనిసరిగా బోధించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. విద్యాభ్యాసాల్లోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు మీడియం స్కూళ్లు ఎన్నో మూతపడిపోయాయి. తెలుగు వ్యాకరణం, ఛందస్సును బోధించమని అడిగే నాథుడే లేకుండా పోయాడు.. ప్రభుత్వాలు కూడా ఆంగ్ల మాథ్యమాలకే పెద్ద పీట వేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు భాషను నేర్చుకోవాలన్న ఉత్సుకత కొంత మందిలోనైనా ఉంది.. అలాంటి వాళ్లకు నేర్పడం, వారి ద్వారా పదిమందికి భాషను విస్తరింపజేయడమే లక్ష్యంగా నేను పద్యరచనామృతబోధిని పుస్తకాన్ని రాశాను..’ అని కొల్లారపు ప్రకాశరావు శర్మ వివరించారు. 


అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో చిన్న చిన్న తెలుగు పదాలనే ఈ పుస్తకంలో ప్రకాశరావు శర్మ వాడారు. మీ మాతృభాష తెలుగే అయి ఉంటే కనుక.. ఈ పుస్తకాన్ని చదివి సులభంగా ఛందస్సును ఉపయోగించి పద్య రచన చేయగలరనడంలో ఏమాత్రం సందేహం లేదు.. పద్యం గురించి ఏమాత్రం అవగాహన లేని వారు కూడా గ్రహించే విధంగా గురువులు, లఘువులు, గణాలు, సాధారణ పద్యలక్షణాలు, గణవిభజన పద్ధతులు ఎన్నో.. ఈ ‘పద్యరచనామృతబోధిని’ పుస్తకంలో ఉదాహరణలతో ఇవ్వబడ్డాయి. ప్రతి అధ్యాయం వద్ద ఉదాహరణలుగా ప్రకాశరావు శర్మ గారి పద్యాలు కూడా ఉన్నాయి. యతిప్రాసల గురించి ఆయన వివరణలు, అచ్చులు, హల్లుల మధ్య పరస్పర యతి మైత్రి గురించి విపులంగా ఈ పుస్తకంలో ఉన్నాయి. చిన్న పద్యంగా కనిపించే కంద పద్య రచనల్లో ఉన్న నియమాలను ప్రకాశరావు శర్మ వివరించిన తీరు ఎంతో అమోఘం. 300కు పైగా అభ్యాసాలున్న ఈ పుస్తకం ద్వారా నిర్ధిష్టమైన, ఛందోజ్ఞానాన్ని పొందగలరనడంలో ఏమాత్రం సందేహం లేదు.. 

Updated Date - 2020-09-14T18:11:42+05:30 IST