తన ర్యాప్‌సాంగ్స్‌తో.. అమెరికన్లను ఉర్రూతలూగిస్తున్న తెలుగమ్మాయి

ABN , First Publish Date - 2020-02-02T01:29:38+05:30 IST

ఆమె ర్యాప్‌సాంగ్స్‌కు అమెరికన్లు శ్రుతి కలుపుతారు... ఆమె హిప్‌హాప్‌తో పోటీపడుతారు. ‘ర్యాపర్‌ రాజకుమారి’ స్టేజీపైకి వచ్చిందంటే రచ్చ రచ్చే. భారతీయత ఉట్టిపడే ఆహార్యంతో అమెరికన్‌

తన ర్యాప్‌సాంగ్స్‌తో.. అమెరికన్లను ఉర్రూతలూగిస్తున్న తెలుగమ్మాయి

ఆమె ర్యాప్‌సాంగ్స్‌కు అమెరికన్లు శ్రుతి కలుపుతారు... ఆమె హిప్‌హాప్‌తో పోటీపడుతారు. ‘ర్యాపర్‌ రాజకుమారి’ స్టేజీపైకి వచ్చిందంటే రచ్చ రచ్చే. భారతీయత ఉట్టిపడే ఆహార్యంతో అమెరికన్‌ యాక్సెంట్‌తో ర్యాప్‌ దునియాలో క్రేజ్‌ సంపాదించుకుంటున్న రాజకుమారి ఎవరో కాదు... మన తెలుగమ్మాయే. అసలు పేరు శ్వేతారావు యల్లాప్రగడ. ఆస్కార్‌కు వెళ్లిన ‘గల్లీబాయ్‌’లో మెరిసిన ఈ ర్యాపర్‌ బాలీవుడ్‌ సినిమాల్లో పాటలు పాడుతూనే, చాలాకాలంగా మెట్రో నగరాల్లో లైవ్‌ షోలు కూడా ఇస్తోంది. ‘‘నా మాతృభాష తెలుగులో కూడా సంగీతాన్ని అందించాలనే కోరిక ఉంది’’ అంటున్న ఆమె అంతరంగమిది...

‘‘నా అసలు పేరు కుమారి శ్వేతారావు ఎల్లాప్రగడ. నేను తెలుగు అమ్మాయినే. నేను పుట్టకముందే మా నాన్న అమెరికాలో సెటిలయ్యారు. నేను పుట్టి పెరిగిందంతా కాలిఫోర్నియాలో. నా చదువంతా అక్కడే జరిగింది. అమెరికాలో ఉన్నా మా ఫ్యామిలీ తెలుగు సంప్రదాయాన్ని వీడలేదు. ఏడేళ్ల వయసులోనే నాకు అమ్మానాన్న శాస్త్రీయ నృత్యం నేర్పించారు. కాలిఫోర్నియాలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ చేశా. అమెరికాలోని హిప్‌హాప్‌ గ్రూప్‌ ‘ఫ్యూజీ’ చేసిన ‘ది స్కోర్‌’ ఆల్బమ్‌ చూసిన తర్వాత... అంటే నేను ఫిఫ్త్‌ గ్రేడ్‌లో ఉండగానే నాకు హిప్‌హాప్‌ పట్ల ఆసక్తి కలిగింది. 14 ఏళ్లు వచ్చేసరికి నేను హిప్‌హాప్‌ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందాను.

 

స్నేహితులు పెట్టిన పేరు...

ర్యాపర్‌గా పాటలు రాస్తూ, పాడుతుంటే నా స్నేహితులు విని తెగ ఆనందించేవారు. ‘ది ఇండియన్‌ ప్రిన్సెస్‌’ అంటూ నన్ను పొగడ్తలతో ముంచెత్తేవారు. దానికి తెలుగులో అర్థం ‘రాజకుమారి’ అని తెలిసింది. డాన్సు కార్యక్రమాలకు శ్వేతారావుగానే పరిచయం అయినప్పటికీ నా పేరుకు ఎప్పుడూ కుమారి విడదీయకుండా ఉండిపోయింది. ర్యాపర్‌గా మారిన తర్వాత పేరు మార్చుకోవాలనుకున్నా. శ్వేతారావు పేరుతో పాటలు పాడితే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండదని, ర్యాపర్‌ ‘రాజకుమారి’గా పేరు మార్చుకున్నాను. స్టేజీ మీద పాట మధ్యలో అమ్మవారి స్టయిల్‌లో డాన్స్‌ చేయడం వల్ల కూడా పేరుకు తగ్గ ర్యాపర్‌గా గుర్తింపు వచ్చింది. అంతకుముందు ‘సెంచూరీస్‌’, ‘ఛేంజ్‌ యువర్‌ లైఫ్‌’, ‘బ్రేవ్‌ ఎనఫ్‌’ వంటి అనేక ఆల్బమ్స్‌కు రచనా సహకారాన్ని అందించా. ర్యాపర్‌గా నేను చేసిన ‘షూక్‌’, ‘సిటీ స్లమ్స్‌’ నాకు బాగా పేరు తీసుకొచ్చాయి.

 

‘గల్లీబాయ్‌’తో గుర్తింపు...

నా మాతృభాష తెలుగు. అమెరికాలో ఉండటంతో ఇంగ్లీష్‌ వచ్చింది. కాలేజీలో చదువుతున్నప్పుడు బాలీవుడ్‌ సినిమాలు చూసి హిందీ నేర్చుకున్నా. గీత రచయితగా, గాయనిగా నాపై ఈ మూడు భాషల ప్రభావం ఉంటుంది. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం నుంచి కూడా ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనతో కలిసి పనిచేశా. అయితే జోయా అక్తర్‌ తీసిన ‘గల్లీబాయ్‌’తో నాకు చాలా గుర్తింపు వచ్చింది. అందులో నేను ఒక ర్యాపర్‌ జడ్జిగా కనిపిస్తా. ఈ సినిమాతో ఇండియాలో కూడా ర్యాపర్స్‌కు క్రేజ్‌ వచ్చింది. నా వరకు నన్ను సోషల్‌ మీడియాలో 9 కోట్ల మందికి దగ్గర చేసింది.

 

అమెరికాలో మన వాణి వినిపించాలనే...

అమెరికన్‌ సింగర్స్‌ సరసన మనం కూడా నిలబడాలనే తాపత్రయం నాది. అమెరికాలో భారతీయలు ఒక శాతం కన్నా తక్కువగా ఉంటారు. అక్కడి సంగీత ప్రపంచంలో మన ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నా. అక్కడి గాయనీ గాయకుల సరసన ఒక్క భారతీయ ముఖాన్నయినా చూడాలనేది నా చిన్ననాటి కోరిక. నేను చిన్నప్పటి నుంచి వేదికలపై వారినే చూస్తూ పెరిగా. అందుకే నాలో కసి పెరిగింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్‌లో ర్యాపర్స్‌ పుట్టుకొస్తున్నారు. ‘గల్లీబాయ్‌’ అలాంటి వారికి గొప్ప ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. ఇప్పుడిప్పుడే హసన్‌ మిన్‌హాజ్‌ (కమెడియన్‌, టీవీ హోస్ట్‌), మిండీ కళింగ్‌, ప్రియాంక చోప్రా వంటి భారతీయ మూలాలున్నవాళ్లు అమెరికాలో తమ సొంత ప్రతిభతో రాణిస్తున్నారు.

 

ఇంటర్నెట్‌తో అవకాశాలు...

ఇంటర్నెట్‌ అనేది అందర్నీ ఒకే వేదిక మీదకు తెస్తోంది. ఆట ఆడాలనుకునేవారికి సమానమైన మైదానాన్ని ఇస్తోంది. సంగీత ప్రపంచంలో రాణించాలంటే యువతకు ఇంతకుమించిన వేదిక లేదనే చెప్పాలి. మన దగ్గర టాలెంట్‌ ఉంటే ఏ మ్యూజిక్‌ కంపెనీనైనా, ఏ సంగీత దర్శకుణ్ణి అయినా, ఏ గాయకుడినైనా ఇట్టే కలవొచ్చు. అంతెందుకు ఇప్పుడు మీ ల్యాప్‌టాపే ఒక రికార్డింగ్‌ స్టూడియో.

 

ఇండియాలో టాలెంట్‌ ఉన్నవాళ్లు ఎంతోమంది ఉన్నారని నా ప్రగాఢ నమ్మకం. అయితే కుటుంబపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు వారి టాలెంట్‌కు ఆటంకాలుగా మారుతున్నాయి. అమ్మాయిల విషయంలో అయితే ఎన్నో అడ్డంకులు. వాటన్నింటినీ దాటుకుంటూ ఇప్పుడిప్పుడే ధైర్యంగా బయటికి వస్తున్నారు. ర్యాపర్స్‌ విషయానికొస్తే మగ ర్యాపర్స్‌ చాలామంది ఉన్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ కలిసి ఇండస్ట్రీని షేక్‌ చేయాలి కదా!’’

‘మామ్‌’ సినిమాలో ‘ఫ్రీకింగ్‌ లైఫ్‌’ పాట పాడారు. ‘రేస్‌ 3’, ‘జీరో’, ‘జడ్జిమెంటల్‌ హై క్యా’లో ర్యాప్‌ గీతాలు రాశారు.

ఎంటీవీ యూరోపియన్‌ మ్యూజిక్‌ అవార్డుకు మూడుసార్లు నామినేట్‌ అయ్యారు.

2015లో గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

‘ఎంటీవీ హాజిల్‌’ సీజన్‌ 1కు జడ్జిగా వ్యవహరించారు.

సామాజిక సేవలకు గుర్తింపుగా తమిళనాడు గవర్నర్‌ చేతుల మీదుగా ‘కోహినూర్‌’ అవార్డు అందుకున్నారు.

మ్యూజిక్‌ లైవ్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చారు.


Updated Date - 2020-02-02T01:29:38+05:30 IST