ఉపాధి కోసం దుబాయ్‌కెళ్లి... ఆఫీస్ బాయ్‌ నుంచి బ్యాంకు మేనేజర్‌గా...

ABN , First Publish Date - 2020-02-02T01:44:19+05:30 IST

అందమైన గులాబీ పూవ్వును పొందాలంటే దాని కింద ఉండే ముళ్లు కలిగించే బాధను భరించాల్సిందే. అలాగే జీవితంలో గెలవాలంటే ముళ్లలాంటి ఎన్నో ఒడుదొడుకులను దాటుకుని రావా

ఉపాధి కోసం దుబాయ్‌కెళ్లి... ఆఫీస్ బాయ్‌ నుంచి బ్యాంకు మేనేజర్‌గా...

అందమైన గులాబీ పూవ్వును పొందాలంటే దాని కింద ఉండే ముళ్లు కలిగించే బాధను భరించాల్సిందే. అలాగే జీవితంలో గెలవాలంటే ముళ్లలాంటి ఎన్నో ఒడుదొడుకులను దాటుకుని రావాలి. ఈ మాటలు  అందరికీ వర్తించాలని లేదు. కానీ ఏమీ లేని స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరే ప్రతి ఒక్కరికీ ఇవి చెల్లుబాటవుతాయి. పొట్టకూటికోసం దుబాయ్‌కి వెళ్లి, ఓ బ్యాంకు మేనేజర్‌గా రిటైర్ అయిన అలీకి మాత్రం పై వ్యాఖ్యాలు అద్దం పడుతాయి. 


కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ నిరుపేద ఉపాధ్యాయుని ఇంట్లో అలీ జన్మించాడు. అతని తల్లి ఓ సాధారణ గృహిణి. ఎనిమిది మంది సంతానం గల ఆ కుటుంబంలో అలీ మూడోవాడు. తండ్రి ఉపాధ్యాయుడైనప్పటికీ.. అలీ పదో తరగతిలో తప్పాడు. దీంతో పై చదువుల కోసం ప్రయత్నాలు చేయకుండా గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ దొరికిన పనేదో చేసుకుని కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. ఈ క్రమంలో టైప్‌రైటింగ్, షార్ట్ హ్యాండ్, టైలరింగ్ నేర్చుకుని, హిందీ నేర్చుకోవడానికి పుట్టిన ప్రాంతాన్ని వదిలి మొదటిసారిగా 1978లో ముంబైకి వెళ్లాడు. ముంబైలో చిన్నా చితక పనులు చేసుకుంటూనే గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నాలు చేశాడు. 

 

1979లో అలీకి షార్జా వీసా వచ్చింది. కలలు గన్న దేశానికైతే అలీ వెళ్లాడు కానీ.. అక్కడ సరైన పని దొరక్క అనేక కష్టాలు పడ్డాడు. పొట్టకూటికోసం అలీ ఒక్కోరోజు మూడు, నాలుగు పనులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఓ పాఠశాలలో అసిస్టెంట్‌గా పని చేస్తూ మంచి ఉద్యోగ అవకశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే 1989లో అలీకి వివాహమైంది. ఇంత కాలం ఒంటరిగా బతుకు బండిని లాగుతున్న అతని జీవితంలోకి మరొ మనిషి వచ్చి చేరారు. దీంతో మళ్లీ అతను పార్ట్ టైం ఉద్యోగాల కోసం వేట ప్రారంభించాడు. ఇదే సమయంలో బ్యాంకు ఉద్యోగం గురించి స్నేహితుడి ద్వారా తెలుసుకున్న అలీ.. బ్యాంకులో ఆఫీస్ బాయ్‌గా ఉద్యోగం సాధించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బ్యాంకులో ఆఫీస్ బాయ్‌గా పని చేస్తూనే మరోపక్క స్కూల్‌లో వాచ్‌మెన్‌గా ఓ సంవత్సరంపాటు విధులు నిర్వర్తించాడు.

 

1995 చివరి నాటికి అలీ కుటుంబం ఆర్థికంగా కొంత వరకు స్థిరపడింది. కానీ తన కుటుంబాన్ని అక్కడికి తీసుకెళ్లి దేశం మొత్తాన్ని చూపించలేకపోతున్నాననే బాధ అలీని కలిచివేసేది. ఇదే సమయంలో బ్యాంకులో జరిగిన ఓ సంఘటన అలీ జీవితాన్నే మలుపు తిప్పింది. బ్యాంకు చెందిన లిఫ్ట్‌ను అలీ ఎక్కినప్పుడు అందులో ఉండే లిఫ్ట్ ఆపరేటర్ అతన్ని ఘెరంగా అవమానించి బయటికి గెంటేశాడు. ఘోర అవమానం నుంచి తేరుకున్న అలీ.. జీవితంలో ఎలాగైనా ఉన్నత స్థానానికి వెళ్లాలని సంకల్పించుకున్నాడు. కష్టపడి పని చేసి అతను పని చేస్తున్న బ్యాంకులోనే 2009లో సపోర్ట్ సర్వీస్ ఎక్సిక్యూటిగ్‌గా పదోన్నతి పొందాడు. కేవలం పదోన్నతితోనే సరిపెట్టుకోకుండా ఒకప్పుడు వదిలేసిన చదువు విలువ తెలుసుకుని మూన్నెళ్లపాటు బ్రిటిష్ కౌన్సిల్‌లో ఇంగ్లిష్ కోర్సు పూర్తి చేశాడు. 

 

ఇదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి కంటున్న కలను 2010లో సాకారం చేసుకున్నాడు. తన కుటంబాన్ని విసిట్ వీసా మీద షార్జా తీసుకొచ్చి పర్యాటక ప్రదేశాలన్నిటినీ తిప్పాడు. బ్రిటిష్ కౌన్సిల్ తీసుకున్న ఇంగ్లిష్ కోర్సు సహాయంతో 2015లో బ్యాంకు ఉద్యోగం రాసి అందులో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో ఆఫీస్ బాయ్‌గా పని చేసిన బ్యాంకులోనే అలీ.. సీనియర్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందాడు. అనంతరం బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్, బ్యాంకు మేనేజర్‌గా పదొన్నతి పొందాడు. ఒకప్పుడు లిఫ్ట్ ఎక్కేందుకు నీకు అర్హత లేదు అని గెంటేసిన లిఫ్ట్ ఆపరేటరే.. తలుపులు తెరిచి మరీ అలీని లిఫ్ట్‌లోకి ఆహ్వానించాడు. తాజాగా.. 2019లో అలీ బ్యాంకు మేనేజర్‌గా రిటైర్ అయ్యి తిరిగి స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే తాను జీవితంలో విజయం సాధించడానికి యూఏఈని స్థాపించిన దివంగత షైక్ జాయెద్ బిన్ సుల్తానే కారణమని అలీ తెలిపాడు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను పాఠాలుగా మార్చుకునే పద్ధతిని ఆయన నుంచే గ్రహించానని అలీ వెల్లడించాడు.


Updated Date - 2020-02-02T01:44:19+05:30 IST