యూకేలో చిక్కుకున్న 27 మంది తెలుగు విద్యార్థులు.. బాసటగా నిలిచిన తెలుగు సంఘాలు
ABN , First Publish Date - 2020-03-27T20:18:44+05:30 IST
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 24 వేల మంది మృతి చెందారు.
లండన్: కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 24 వేల మంది మృతి చెందారు. 5.37 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 'కొవిడ్-19' ప్రభావం అమెరికా, చైనా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లతో పాటు బ్రిటన్‌లో కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు యూకే వ్యాప్తంగా 11,658 బాధితులు ఉండగా, 578 మంది చనిపోయారు. దీంతో కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు బ్రిటన్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా యూనివర్సిటీలు, కాలేజీలను మూసివేయించింది.
విద్యాసంస్థలు మూతపడంతో వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లను కూడా క్లోజ్ చేశారు. దీంతో చాలా మంది భారతీయ విద్యార్థులు రోడ్డున పడ్డారు. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. స్వదేశానికి రాలేని పరిస్థితులలో ఉన్న 27 మంది తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు యూకేలోని తెలుగు సంఘాలు ముందుకొచ్చాయి. వారి సొంత ఖర్చులతో తెలుగు విద్యార్థులను ఒక హోటల్‌లో బస కల్పించాయి.
ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ప్రతినిధి గంప వేణుగోపాల్ మాట్లాడుతూ బ్రిటన్‌లోని తెలుగు సంఘాలు ఈ 27 మంది తెలుగు విద్యార్థులకు హోటల్‌లో బస కల్పించడంతో పాటు భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాయన్నారు. మార్చి 31 వరకు విద్యార్థులకు వసతి, భోజన సదుపాయం ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. అలాగే ఇద్దరు గుజరాతీ విద్యార్థులు, ఒక ఉత్తరాఖండ్ విద్యార్థికి కూడా భోజన సదుపాయం కల్పించినట్లు వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరూ విమాన సర్వీసులు రద్దు కావడం వల్ల లండన్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. 27 మందిలో ఏడుగురికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేస్తుండగా, మిగతా వారికి యూకేలోని వివిధ తెలుగు సంఘాలు ఆదుకుంటున్నాయి.