యూఎస్‌లో టీకా రాజకీయాలు

ABN , First Publish Date - 2020-09-05T14:14:37+05:30 IST

కరోనా సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తే అదే వైరస్‌ రాజకీయ నేతలకు వరప్రదాయినిగా మారిందా? అమెరికా, రష్యా, చైనాల్లో కొవిడ్‌

యూఎస్‌లో టీకా రాజకీయాలు

అక్టోబరు చివరికి వ్యాక్సిన్‌ కష్టం: ఫౌచీ

వచ్చే జూన్‌దాకా విస్తృత వ్యాక్సినేషన్‌ కష్టమే

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరెట్‌

 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపునకు ‘ట్రంప్‌’ కార్డ్‌!

అక్టోబరు చివరికి వ్యాక్సిన్‌ కష్టమే : ఫౌచీ

 అగ్రరాజ్యాధిపతి ప్రకటనపై అనుమానాలు


కరోనా సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తే అదే వైరస్‌ రాజకీయ నేతలకు వరప్రదాయినిగా మారిందా? అమెరికా, రష్యా, చైనాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌.. రాజకీయాలకు వేదికగా మారుతోందా? ఆయా దేశాల్లో పాలకులు తమ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకునేందుకు వ్యాక్సిన్‌ను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారా?


సాధారణ పరిస్థితుల్లో ఏళ్లు పట్టే వ్యాక్సిన్‌ తయారీని నెలల్లో పూర్తి చే యాలంటూ ఫార్మా కంపెనీలపై  తెస్తున్న ఒత్తిడికి వారి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే కారణమా? అంటే అవుననే విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఉదాహరణకు.. నవంబరు 1 నాటికి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ ట్రంప్‌ సర్కారు అమెరికాలోని రాష్ట్రాలకు సూచించింది. దీంతో.. నవంబరులో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ట్రంప్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను బ్రహ్మాస్త్రంగా వాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


నిజానికి కొవిడ్‌ నియంత్రణలో ట్రంప్‌ సర్కారు ఆది నుంచీ అప్రతిష్ఠనే మూటగట్టుకుంది. వైర్‌సపై ప్రజలను అప్రమత్తం చేయడంలో, వైద్య సేవలు అందించడంలో ట్రంప్‌ పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. దీంతోపాటు పలు ఇతర అంశాలపై దేశవ్యాప్తంగా ట్రంప్‌ పట్ల వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దీన్ని గ్రహించిన ట్రంప్‌.. ఏ కరోనా అయితే తనకు చెడ్డపేరు తెచ్చిందో దాన్నే ఆయుధంగా మలుచుకునేందుకు నడుం బిగించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


వ్యాక్సిన్‌ విషయంలో శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఇందులో రాజకీయాలకు తావులేదని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు చెబుతున్నారు. అయినా వ్యాక్సిన్‌ను ఉరుకులు పరుగుల మీద విడుదల చేయడానికి వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవని ఎలా అనుకోగలమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు.. అక్టోబరు చివరికల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం అసాధ్యం కాదుగానీ, కష్టమేనని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కూడా పేర్కొనడం గమనార్హం. వ్యాక్సిన్‌ ఎంతమేరకు సురక్షితం, దాని సామర్థ్యం ఎంత అనే అంశాలపై శాస్త్రీయ ఆధారాలు లేకుండా వ్యాక్సిన్‌ వినియోగానికి ఆమోదం లభించకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.


అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ అయితే.. వచ్చే ఏడాది జూన్‌ దాకా కరోనా విస్తృత వ్యాక్సినేషన్‌ సాధ్యం కాదని చెబుతోంది. ప్రస్తుతం అడ్వాన్స్‌డ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ దశల్లో ఉన్న ఏ టీకా కూడా డబ్ల్యూహెచ్‌వో నిర్దేశిత ప్రమాణాల్లో 50 శాతం సామర్థ్యమైనా చూపుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలేవీ లేవని ఆ సంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్‌ హ్యారిస్‌ వ్యాఖ్యానించారు. ఆయా వ్యాక్సిన్ల సామర్థ్యం, భద్రతపై విస్తృతస్థాయి పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.


ముఖ్యంగా.. మూడో దశ ట్రయల్స్‌ దీర్ఘకాలంపాటు చేయాలని, వ్యాక్సిన్‌ ఎంతవరకూ సురక్షితమనే విషయాన్ని పూర్తిగా నిర్ధారించుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలా, అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ సైతం.. కరోనాకు వ్యాక్సిన్‌ ఇప్పట్లో రాదని చెబుతుంటే.. అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన అందుకు భిన్నంగా ఉండడం గమనార్హం.


రష్యా, చైనా కూడా..

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సిద్ధమైనట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆగస్టు 11నే ప్రకటించారు. వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు తన కుమార్తెకు కూడా వ్యాక్సిన్‌ డోస్‌ ఇచ్చినట్లు తెలిపారు. అయితే, పుతిన్‌ చేసిన ఈ ప్రకటన వెనుక రాజకీయ కారణాలున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. కొంతకాలంగా రష్యా ప్రజల్లో పుతిన్‌ ప్రతిష్ఠ మసకబారుతోంది.


ఈ నేపథ్యంలోనే.. అందరికంటే ముందుగా వ్యాక్సిన్‌ సిద్ధమయినట్లు ప్రకటించి పుతిన్‌ అందరి దృష్టినీ ఆకర్షించారని, అమెరికా కంటే ముందుగా వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు ప్రకటించడం ద్వారా రష్యా ప్రతిష్ఠను పెంపొందించిన నేతగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కరోనా వైర్‌సను నిరోధించే యాంటీబాడీలను రష్యా వ్యాక్సిన్‌ సమర్థంగా ఉత్పత్తి చేస్తోందని, కొన్ని దుష్ప్రభావాలున్నా అవి స్వల్పమేనని.. లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురితం కావడం ప్రపంచం మొత్తానికీ ఊరటనిచ్చే విషయం.


మరోవైపు.. కొవిడ్‌ వైర్‌సను ప్రపంచానికి అంటించిన దేశంగా చెడ్డపేరు తెచ్చుకున్న జిన్‌పింగ్‌ ప్రభుత్వం అదే కొవిడ్‌ను సానుకూలంగా మలచుకునే ప్రయత్నా లు చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వేగంగా కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేసి పాకిస్థాన్‌ తదితర మిత్రదేశాలకు పెద్ద సంఖ్యలో పంపిణీ చేసేందుకు జి న్‌పింగ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇలా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను దౌత్యపరమైన అస్త్రంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజల్లో తన పట్ల ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మలచుకునేందుకు జిన్‌పింగ్‌ వ్యూహరచన చేస్తున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

-స్పెషల్‌ డెస్క్‌


Updated Date - 2020-09-05T14:14:37+05:30 IST