చైనాపై ఆధారపడటం ఆపితే తిరిగి డబ్ల్యూహెచ్ఓలో చేరతాం: అమెరికా
ABN , First Publish Date - 2020-06-02T02:56:10+05:30 IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అవినీతికి చెక్ చెప్పి, చైనాపై ఆధారపడటం
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అవినీతికి చెక్ చెప్పి, చైనాపై ఆధారపడటం ఆపేస్తే తిరిగి సంస్థలో చేరే ఆలోచన చేస్తామని వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూహెచ్‌ఓలో సంస్కరణలు అవసరమని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రాబర్ట్ ఆబ్రైన్ అన్నారు. సంస్కరణలు చేసి చైనాపై ఆధారపడటం ఆపితే డబ్ల్యూహెచ్ఓలో తిరిగి చేరేందుకు ఆలోచిస్తామని ట్రంప్ చెప్పినట్టు రాబర్ట్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ కోసం చైనా ప్రతి ఏడాది 40 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంటే.. అమెరికా 400 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని రాబర్ట్ మరోమారు గుర్తుచేశారు. ఆఫ్రికాలోని ప్రెసిడెంట్స్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్(పీఈపీఎఫ్ఏఆర్)కు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నామో.. డబ్ల్యూహెచ్ఓకు ఇచ్చే నిధులను కూడా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లకు అందేలా చేస్తామన్నారు. ఆఫ్రికాలోని హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితుల ప్రాణాలను డబ్ల్యూహెచ్ఓ కాపాడటం లేదని.. అమెరికా ప్రభుత్వం వారి ప్రాణాలను కాపాడుతున్నట్టు చెప్పారు. ఇదే మాదిరిగా డబ్ల్యూహెచ్ఓకు ఇచ్చే నిధులను కూడా సరిహద్దులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, రెడ్ క్రాస్, ఆసుపత్రులకు అందజేస్తామన్నారు. కాగా.. డబ్ల్యూహెచ్ఓతో సంబంధాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం వెల్లడించిన విషయం తెలిసిందే. డబ్ల్యూహెచ్ఓ చైనా ఆడించినట్టు ఆడుతోందని ట్రంప్ పలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కరోనా మహమ్మారి గురించి ప్రపంచదేశాలకు ముందుగానే చెప్పడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని.. ఈ కారణంగానే లక్షలాది మంది చనిపోయారని ఆయన అన్నారు.