జర్నలిస్టుల పనిలో జోక్యం వద్దంటూ.. చైనాకు అమెరికా వార్నింగ్

ABN , First Publish Date - 2020-05-18T22:51:27+05:30 IST

హాంకాంగ్‌లోని అమెరికన్ జర్నలిస్టుల పనిలో జోక్యం చేసుకోవద్దంటూ

జర్నలిస్టుల పనిలో జోక్యం వద్దంటూ.. చైనాకు అమెరికా వార్నింగ్

వాషింగ్టన్: హాంకాంగ్‌లోని అమెరికన్ జర్నలిస్టుల పనిలో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికా చైనా‌కు వార్నింగ్ ఇచ్చింది. హాంకాంగ్‌లోని అమెరికన్ జర్నలిస్టుల పనిలో జోక్యం చేసుకుంటామని చైనా హెచ్చరిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో అన్నారు. ఈ జర్నలిస్టులు ఫ్రీ ప్రెస్ సభ్యులని.. ప్రచార కార్యకర్తలు కాదన్న విషయాన్ని చైనా గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. కాగా.. గత కొద్ది నెలలుగా అమెరికా - చైనాల మధ్య కరోనా పోరు పెరుగుతూ పోతోంది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. చైనాపై టారిఫ్‌లను మరింత పెంచేందుకు సిద్దపడుతున్నారు. మరోపక్క చైనా కూడా ట్రంప్ వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానమిస్తోంది. ఇటీవల ట్రంప్ చైనా రిపోర్టర్‌పై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. అంతేకాకుండా వాషింగ్టన్ న్యూస్ చానల్స్‌లో పనిచేస్తున్న చైనీయులు కూడా ఉద్యోగం కోల్పోయారు. చైనాకు చెందిన జర్నలిస్టులను ట్రంప్ చులకనగా చూస్తున్నారని.. వారి దేశాలను పరిగణనలోకి తీసుకుని వారిపై మండిపడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. చైనాలో పదిమందికి పైగా జర్నలిస్టులను చైనా బహిష్కరించింది. ట్రంప్ చైనా జర్నలిస్టులపై దాడి చేస్తుంటే.. మరోపక్క చైనా అమెరికా జర్నలిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ అంశం ఒక్క జర్నలిస్టులతో ఆగేలా లేదని ఇరు దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న చైనీయులు, అమెరికన్లపై కూడా ఈ ప్రభావం పడుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-05-18T22:51:27+05:30 IST