అమెరికాను అల్లాడిస్తున్న‌ 'క‌రోనా'.. చైనా, ఇటలీని దాటేసిన అగ్ర‌రాజ్యం

ABN , First Publish Date - 2020-03-27T17:41:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్(కొవిడ్-19) వ‌ణికిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టం అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

అమెరికాను అల్లాడిస్తున్న‌ 'క‌రోనా'.. చైనా, ఇటలీని దాటేసిన అగ్ర‌రాజ్యం

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్(కొవిడ్-19) వ‌ణికిస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టం అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిన్న‌టి వరకు దేశ వ్యాప్తంగా 68 వేలుగా ఉన్న‌ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,594కి చేరింది. ప్ర‌పంచ వ్యాప్తంగా న‌మోదైన కేసుల్లో ఇది 15 శాతానికి పైనే. దీంతో చైనా(81,340), ఇట‌లీ(80,589)ని దాటేసి అత్య‌ధిక క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు చేసిన దేశంగా యూఎస్ తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ మహమ్మారితో అమెరికాలో చ‌నిపోయిన వారి సంఖ్య 1300 దాటింది. అలాగే బాధితుల్లో 2,122 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.


గ‌త నాలుగైదు రోజులుగా దేశ‌వ్యాప్తంగా క‌రోనా బారిన ప‌డుతున్న‌వారు పెర‌గ‌డంతో పాటు మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య కూడా పెర‌గ‌డం ఆందోళన కలిగించే విషయం. ఒక్క న్యూయార్క్‌లోనే 38,977 మందికి ఈ వైర‌స్ సోకింది. 466 మంది ప్రాణాలు కోల్పోయారు. గత రెండు రోజుల్లోనే అమెరికాలో 30 వేల కేసులు నమోదయ్యాయి. 10 కోట్ల మంది లాక్‌డౌన్‌లో ఉంటున్నారు. మ‌రోవైపు రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండ‌డంతో అధికారులు ఇంత‌కుముందు మూసేసిన ఆస్ప‌త్రుల‌ను తెరిపిస్తున్నారు. కొవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌ను కూడా అగ్ర‌రాజ్యం పెంచింది. దీంతో ప్ర‌తిరోజు భారీ మొత్తంలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి.   


Updated Date - 2020-03-27T17:41:13+05:30 IST