‘అమ్మో.. అమెరికాకు మేం వెళ్లం.. భారత్‌లోనే ఉంటాం..’

ABN , First Publish Date - 2020-04-07T23:37:21+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తమ స్వదేశాలకు వెళ్లలేక అనేక దేశస్థులు ఆయా

‘అమ్మో.. అమెరికాకు మేం వెళ్లం.. భారత్‌లోనే ఉంటాం..’

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచదేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తమ స్వదేశాలకు వెళ్లలేక అనేక దేశస్థులు ఆయా దేశాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌లోనూ వివిధ దేశాలకు చెందిన వారు అనేక మంది ఇరుక్కుపోయారు. వీరిలో అమెరికన్లు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు భారత్‌లో ఇరుక్కుపోయిన 1,300 మంది అమెరికన్లను స్వదేశానికి చేర్చింది. ఈ వారంలో మరో ఐదు ప్రత్యేక విమానాల్లో మరింత మందిని తీసుకెళ్లనున్నట్టు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. భారత్‌లో చిక్కుకున్న అమెరికన్లు.. తమ దేశానికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో ఉన్న యూఎస్ ఎంబసీలో ఇప్పటివరకు 7 వేల మంది అమెరికన్లు రిజిస్టర్ చేసుకున్నట్టు సౌత్ అండ్ సెంట్రల్ ఏషియాకు యాక్టింగ్ సెక్రటరీగా ఉన్న అలైస్ జీ వెల్స్ సోమవారం తెలిపారు. అయితే వీరిలో చాలా మంది అమెరికాకు వెళ్దామా వద్దా అనే సందిగ్దంలో పడ్డారని ఆయన పేర్కొన్నారు. కారణం ఏంటనే దానిపై ఆయన స్పందించలేదు. 


ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశానికి వెళ్లే కంటే కొంతకాలం పాటు భారత్‌లో ఉంటేనే మంచిదని అమెరికన్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్లాలన్న నిర్ణయాన్ని ఇప్పటికే అనేక మంది అమెరికన్లు వెనక్కు తీసుకున్నారని కాన్సులర్ అఫైర్స్‌కు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఇయాన్ బ్రౌన్‌లీ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసినప్పటికి.. భారత్‌లో ఉన్న అమెరికన్లు అమెరికా వెళ్లేందుకు విముఖత చూపుతున్నారని ఇయాన్ అన్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాం.. అమెరికాకు వెళ్లమంటూ 800 మంది అమెరికన్లకు ఫోన్ చేయగా.. కేవలం పది మంది మాత్రమే సుముఖత చూపించినట్టు ఇయాన్ పేర్కొన్నారు. కాగా.. జనవరి 29 నుంచి వివిధ దేశాలలో చిక్కుకున్న 43 వేల మంది అమెరికన్లను అమెరికా ప్రభుత్వం వెనక్కు తీసుకొచ్చింది.

Updated Date - 2020-04-07T23:37:21+05:30 IST