నేను బాగున్నాను.. ట్రంప్ తాజా వీడియో
ABN , First Publish Date - 2020-10-04T16:28:48+05:30 IST
కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. వచ్చే 48 గంటలూ చాలా కీలకమని వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఆయన ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.
వాషింగ్టన్: కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. వచ్చే 48 గంటలూ చాలా కీలకమని వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఆయన ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. శనివారం రాత్రి విడుదలైన ఈ వీడియోలో "తాను చాలా బాగున్నానని... అయితే, రాబోయే కొన్నిరోజులు తనకు నిజమైన పరీక్ష" అని ట్రంప్ అన్నారు. కాగా, ట్రంప్ వైద్యుల సూచన మేరకు వైట్‌హౌస్ నుంచి వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్న ట్రంప్‌పై... ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వచ్చే 48 గంటలూ చాలా సంక్లిష్టమని వాల్టర్ రీడ్‌లో ట్రంప్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ఓ వ్యక్తి మీడియాతో అన్నారు. "ఆయన ప్రమాదం నుంచి బయటపడలేదు. అసలు ఎప్పటికి కోలుకుంటారన్న విషయమే డాక్టర్లు చెప్పలేని పరిస్థితి నెలకొంది" అని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ సమాచారంతో అమెరికాలో ఆందోళన తారస్థాయికి చేరింది.
దీనిపై స్పందించిన ట్రంప్ శనివారం రాత్రి ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. "నేను ఇప్పుడు చాలా బాగున్నాను, కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేస్తాను. రాబోయే రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. తదుపరి కొన్నిరోజులు నాకు నిజమైన పరీక్ష" అని ట్రంప్ చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్పత్రి నుంచి పనిచేయడం తప్పితే తనకు వేరే మార్గం లేదని చెప్పారు. అయితే, వాల్టర్ రీడ్ ఆస్పత్రి వద్ద చిత్రీకరించబడిన ఏ తేదీ లేని ఈ వీడియో ట్రంప్ ఆరోగ్యంపై వెలువడిన ఆందోళనకర హెచ్చరికలకు ముందుదా? లేదా తరువాతిదా? అనేది అస్పష్టంగా ఉంది. కానీ, యూఎస్ మీడియా మాత్రం ఇది వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్ నుండి వచ్చినట్లు పేర్కొంది.