అగ్రరాజ్యంలో కరోనా విలయం.. 2.80లక్షలు దాటిన మరణాలు!
ABN , First Publish Date - 2020-12-06T21:04:15+05:30 IST
అమెరికాలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. వరుసగా మూడో రోజు అగ్రరాజ్యంలో 2లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో ప్రజలు కొవిడ్ బారినపడుతున్నారు. వరుసగా మూడో రోజు అగ్రరాజ్యంలో 2లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో శనివారం రోజు 2.30లక్షల మందికి కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. నిన్న ఒక్క రోజే 2,527 మందిని మహమ్మారి బలితీసుకుంది. గత రెండు వారాలుగా అమెరికాలో ప్రతిరోజు సగటున 2వేల కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. కాగా.. ఇంటి వద్దే ఉండాలని కోరినప్పటికీ థ్యాంక్స్‌గివింగ్ నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు చేయడం వల్ల కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమెరికాలో కొవిడ్ బారిన పడిన వారి సంఖ్య 1.46కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 2.80లక్షలు దాటింది.
ఇదిలా ఉంటే.. ఫైజర్ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా అత్యవసర వినియోగానికి వారంలో అనుమతి లభించనున్నట్టు సమాచారం. ఫైజర్ పెట్టుకున్న దరఖాస్తుకు శుక్రవారంలోపే ఎఫ్‌డీఏ అమోదం తెలుపనున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే శుక్రవారం నుంచి అమెరికాలో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.