ఫైజర్ టీకా మరో సైడ్ ఎఫెక్ట్: బయటపెట్టిన ఎఫ్‌డీఏ

ABN , First Publish Date - 2020-12-10T16:19:30+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ టీకా ఓ సంజీవనిలా కనిపించింది.

ఫైజర్ టీకా మరో సైడ్ ఎఫెక్ట్: బయటపెట్టిన ఎఫ్‌డీఏ

ఫైజర్ టీకాతో ముఖ పక్షవాతం: యూఎస్ ఎఫ్‌డీఏ

వాషింగ్టన్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వారికి అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయాన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ టీకా ఓ సంజీవనిలా కనిపించింది. కానీ, ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా తెరపైకి రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఫైజర్ టీకా దుష్ప్రభావానికి సంబంధించి యూఎస్ ఎఫ్‌డీఏ సంచలన విషయం బయటపెట్టింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న నలుగురు వాలంటీర్లు తాత్కాలిక ముఖ పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అధికారులు ఎఫ్‌డీఏను కలిసినప్పుడు ట్రయల్స్ సమయంలో తలెత్తిన ఈ అనారోగ్య సమస్యను బయటపెట్టింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఇలా నలుగురు వాలంటీర్లు తాత్కాలిక ముఖ పక్షవాతానికి గురైనట్లు తెలిపింది. కానీ, ఇదే ట్రయల్స్ పాల్గొన్న మిగతా సభ్యులలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని అధికారులు స్పష్టం చేశారు. టీకా వల్ల ఏర్పడిన ఈ సమస్యపై మరింత విస్తృతంగా పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఈ వ్యాక్సిన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అమెరికన్లకు నిరాశ ఎదురైనట్లైంది. 


ఇక ఎదైనా టీకా ట్రయల్స్ దశలో స్వల్ప దుష్ప్రభావాలను చూపించడం సాధారణం. అలాగే ఫైజర్ టీకా ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వాలంటీర్లలో 84 శాతం మంది ఏదో ఒక రియాక్షన్‌కు గురైనట్లు సమాచారం. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా టీకా తీసుకున్న తర్వాత 63 శాతం మందికి అలసట, ఆయాసం వస్తే.. 55 శాతం మంది తలనొప్పి వచ్చినట్లు తెలియజేశారు. అలాగే ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో 32 శాతం మంది చలి వేసిందని, 24 శాతం మందికి కీళ్లనొప్పులు, మరో 14 శాతం మంది జ్వరంతో బాధపడ్డారు. ఇలా స్వల్ప దుష్ప్రభావాలు తప్పిస్తే ఇతర సమస్యలేమీ లేకపోవడంతో మొత్తం మీద ఎఫ్‌డీఏ నుంచి ఫైజర్ టీకాకు మంచి మార్కులే పడ్డాయి. కానీ, తాజాగా మూడో దశ ట్రయల్స్‌లో నలుగురు వాలంటీర్లు ఇలా అస్వస్థకు(ముఖ పక్షవాతం) గురికావడంతో ఎఫ్‌డీఏ ఈ టీకా విషయమై పునరాలోచనలో పడిందని సమాచారం. 


అటు అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్రిటన్.. మంగళవారం నుంచి దేశ ప్రజలకు ఫైజర్ టీకాను ఇవ్వడం మొదలెట్టింది. అయితే, అక్కడ కూడా స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. యూకే రెగ్యులేర్స్ సంస్థ ఈ టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వెల్లడించింది. అలెర్జీ ఉన్న వ్యక్తులపై ఇది దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. అందుకే అలెర్జీ ఉన్న వ్యక్తులు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకోవద్దని హెచ్చరించింది. ఇలా తీసుకున్న వారిలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇక ఈ వ్యాక్సిన్ 90 శాతం సత్ఫలితాలనిచ్చినట్లు పరిశోధకులు వెల్లడించడంతో మహమ్మారికి మందు లభించినట్లేనని అందరూ ఆనంద పడ్డ వేళ ఇప్పుడు టీకా సైడ్ ఎఫెక్ట్స్ ఒక్కొక్కటిగా బయటపడుతుండటం ఆందోళన కలిగించే విషయం.  


Updated Date - 2020-12-10T16:19:30+05:30 IST