ట్రంప్‌ ఇక శ్వేతసౌధాన్ని వీడాల్సిందే !

ABN , First Publish Date - 2020-12-15T16:26:07+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టమైన ఎలక్టోరల్‌ కాలేజీ ఓటింగ్‌‌లో డెమొక్రట్ నేత జో బైడెన్ విజయం సాధించారు.

ట్రంప్‌ ఇక శ్వేతసౌధాన్ని వీడాల్సిందే !

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టమైన ఎలక్టోరల్‌ కాలేజీ ఓటింగ్‌‌లో డెమొక్రట్ నేత జో బైడెన్ విజయం సాధించారు. సోమవారం సమావేశమైన 50 రాష్ట్రాలకు చెందిన ఎలక్టోర్స్ బైడెన్‌ను అధ్యక్షుడిగా, కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడటం ఖాయమైంది. ఇక ఈ ఓటింగ్‌లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను బైడెన్‌కు 306 ఓట్లు దక్కగా.. ట్రంప్‌ 232 ఓట్లు పొందారు. కాగా, ఇన్నాళ్లు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ట్రంప్‌కు ఎదురుదెబ్బ తప్పకపోగా.. తాజాగా ఎలక్టోరల్ ఓట్లు గెలవడంలోనూ విఫలం అయ్యారు. 


పాపులర్ ఓట్లలో వెనుకబడిన ట్రంప్.. ఇప్పుడు ఎలక్టోరల్ ఓట్లలో కూడా పరాభం ఎదుర్కొన్నారు. ఒకానొక సందర్భంలో తాను ఓడినట్లు ఎలక్టోరల్ కాలేజీ నిర్ణయిస్తే శ్వేతసౌధాన్ని వీడతానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే జరిగింది. దీంతో ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడటం ఖాయమైపోయింది. కాగా, పాపులర్ ఓట్లలో ఆధిక్యం సాధించిన బైడెన్.. ఎలక్టోర్స్ మద్దతు కూడగట్టడంలో సైతం సక్సెస్ అయ్యారు. దాంతో జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమమైంది.

Updated Date - 2020-12-15T16:26:07+05:30 IST