ఎన్నికల ముంగిట ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికన్లు!

ABN , First Publish Date - 2020-10-31T21:45:31+05:30 IST

అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికల సమయం దగ్గరపడిన తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ పౌరులు షాకిచ్చారు. అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది.

ఎన్నికల ముంగిట ట్రంప్‌కు షాకిచ్చిన అమెరికన్లు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికల సమయం దగ్గరపడిన తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ పౌరులు షాకిచ్చారు. అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ మళ్లీ మొదలైంది. రోజులకు సుమారు లక్ష వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు అవలంభిస్తున్న విధానాన్ని 100లో 60 మంది పౌరులు తప్పుబట్టారు. ఇదే సమయంలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ నిర్ణయాన్ని 64శాతం మంది ప్రజలు సమర్థించారు. వివరాల్లోకి వెళితే..


ఎన్నికలు సమీపించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ఉధృతిని కూడా లెక్కచేయడం లేదు. వేలాది మంది మద్దతుదారులతో ప్రచార ర్యాలీలను నిర్వహిస్తున్నారు. కాగా.. కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సమయంలో వేలాది మందితో ట్రంప్ ఎన్నికల ర్యాలీలను నిర్వహించడాన్ని 60 శాతం మంది అమెరికన్లు ఓ సర్వేలో తప్పుబట్టినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇదే సమయంలో మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసే ఉద్దేశంతో జో బైడెన్.. భారీ బహిరంగ సభలను నిర్వహించకూడదని తీసుకున్న నిర్ణయాన్ని 64 శాతం మంది ప్రశంసిచినట్లు వెల్లడించింది. 


ఇదిలా ఉంటే.. అమెరికాలో కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో దాదాపు లక్ష కరోనా కేసులు నమోదవుతున్నాయని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు సుమారు 90లక్షల మంది కొవిడ్ బారినపడగా.. ఇందులో 2.28లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Read more