దుబాయిలోని ప్రవాసులకు ఇండియన్ కాన్సులేట్ తోడ్పాటు

ABN , First Publish Date - 2020-04-22T01:36:18+05:30 IST

నార్త్ ఎమిరేట్స్‌, దుబాయిలోని ప్రవాసులకు ఇండియన్ కాన్సులేట్ తో

దుబాయిలోని ప్రవాసులకు ఇండియన్ కాన్సులేట్ తోడ్పాటు

దుబాయి: నార్త్ ఎమిరేట్స్‌, దుబాయిలోని ప్రవాసులకు ఇండియన్ కాన్సులేట్ తోడ్పాటు అందిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రవాసుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతూ వస్తోంది. మరోపక్క దుబాయిలో ఐసోలేషన్ సౌకర్యం కోసం వైద్యులు, వాలంటీర్ల బృందాన్ని కూడా సమీకరించగలిగింది. కాన్సులేట్‌తో పాటు వివిధ భారతీయ సంస్థలు కూడా ప్రవాసులకు అండగా నిలుస్తున్నాయి. ఆంక్షల కారణంగా చాలా మంది ప్రవాసులు మందుల కోసం కూడా బయటకు రాలేకపోతున్నారు. ఇదే సమయంలో వారి గోడును విన్న  ఇండియన్ కాన్సులేట్, అనేక భారతీయ సంస్థలు వారి సమస్యను తీర్చుతున్నారు. మరోపక్క మందులు కొనుగోలు చేయలేని వారు com.dubai@mea.gov.inకు రిక్వెస్ట్ పెట్టుకుంటే వారికి కూడా తగిన సహాయం అందిస్తామని కాన్సులేట్ తెలిపింది. దుబాయి గురుద్వారా, బీఏపీఎస్ హిందూ టెంపుల్, రాజస్థాన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ గ్రూప్(ఆర్‌బీపీజీ), కేఎమ్‌సీ, ఐసీఏఐ దుబాయి చాప్టర్, ఎఫ్ఓఐ ఈవెంట్స్, ఐపీఎఫ్ తదితర భారతీయ సంస్థలు దుబాయి, నార్త్ ఎమిరేట్స్‌లో ఇబ్బందులు పడుతున్న ప్రవాసులకు ఆహారాన్ని అందజేస్తున్నాయి. 


భారతీయ సంస్థలు సమన్వయంగా పనిచేసే విధంగా labour.dubai@mea.gov.in మెయిల్‌ను కూడా కాన్సులేట్ ఏర్పాటు చేసింది.  గత నాలుగు వారాల్లో నాలుగు వేలకు పైగా భారతీయులకు వివిధ భారత సంస్థలు ఆహార ప్యాకెట్లను, సరుకులను అందజేశాయి. ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసీడబ్ల్యూఎఫ్) 60 మందికి తాత్కాలికంగా వసతిని కూడా కల్పించింది. భారత్ వెళ్లలేక దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న 19 మంది భారతీయులకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వసతి కల్పిస్తున్నట్టు కాన్సులేట్ పేర్కొంది. భారత్‌కు వెళ్లాలనుకునే వారిని త్వరలోనే పంపించే ప్రయత్నం చేస్తామని తెలిపింది. ఏప్రిల్ 30తో పాస్‌పోర్ట్ గడువు తీరే వారి పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్‌ చేయడం కూడా మొదలుపెట్టినట్టు కాన్సులేట్ చెప్పింది. షార్జాలోని బీఎస్ఎల్ ఔట్‌సోర్సింగ్ సెంటర్లో నిత్యం వంద పాస్‌పోర్టులను రెన్యూవల్ చేయనున్నట్టు వెల్లడించింది.

Updated Date - 2020-04-22T01:36:18+05:30 IST