అమెరికా.. అర లక్ష
ABN , First Publish Date - 2020-04-25T07:50:22+05:30 IST
కరోనా మృత్యు కౌగిలిలో నలిగిపోతున్న అమెరికాలో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. అగ్ర రాజ్యంలో శుక్రవారం మరో 2143 మరణాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న అధికారికంగా తొలి మృతి ...

- మరో 2,143 మంది మృతి
- అగ్రరాజ్యంలో 50 వేలు దాటిన మరణాలు
- 55 రోజుల్లో మహమ్మారి మృత్యు విలయం
- ఏప్రిల్‌లో 23 రోజుల్లోనే 45 వేల మంది బలి
- కిమ్ ఆరోగ్యంపై వార్తలు వదంతులే: ట్రంప్
- చైనాలో కొత్తగా ఆరు కేసులే నమోదు
- కొవిడ్ పరీక్షల్లోకి అలీబాబా గ్రూప్
- ప్రపంచవ్యాప్త మరణాలు 1.94 లక్షలు
- 3 రోజులుగా పస్తులు
- షికాగోలో తెలుగు విద్యార్థుల అవస్థలు
వాషింగ్టన్/ న్యూయార్క్/ లండన్, ఏప్రిల్ 24: కరోనా మృత్యు కౌగిలిలో నలిగిపోతున్న అమెరికాలో మృతుల సంఖ్య 50 వేలు దాటింది. అగ్ర రాజ్యంలో శుక్రవారం మరో 2143 మరణాలు నమోదయ్యాయి. ఫిబ్రవరి 29న అధికారికంగా తొలి మృతి రికార్డులకెక్కిన అమెరికాలో.. కేవలం 55 రోజుల్లో అర లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి వరకు అమెరికాలో చోటుచేసుకున్న మరణాలు 5,151 మాత్రమే. కానీ, ఏప్రిల్‌లో వైరస్ విశ్వరూపంతో ఈ 24 రోజుల్లోనే 46 వేల మంది బలయ్యారు. అంటే సగటున దాదాపు రోజుకు 2 వేల మంది చనిపోయారు. మరోవైపు ఆ దేశంలో ఫిబ్రవరి 15న తొలి పాజిటివ్ కేసును గుర్తించారు. 69 రోజుల అనంతరం శుక్రవారం నాటికి ఆ సంఖ్య 9 లక్షలైంది. కాగా, నిరద్యోగ భృతి దరఖాస్తులు 4 కోట్లకు చేరతాయన్న అంచనాల నేపథ్యంలో.. వైర్‌సతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను సాధ్యమైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు.
‘భద్రమైన, దశలవారీగా కార్యకలాపాల పునరుద్ధరణ ఉత్సుకత కలిగించే పరిణామం. అంతమాత్రాన మన రక్షణను పక్కనపెట్టినట్లు కాదు. దేశాన్ని తిరిగి నిలబెట్టే మా వ్యూహంలో నిరంతర శ్రద్ధ అత్యంత కీలకమైనది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కరోనా నుంచి దేశం తేరుకుంటున్నట్లు క్షేత్ర స్థాయి నుంచి నివేదిక లు వస్తున్నాయని తెలిపారు. 23 రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గాయని, 40ు కౌంటీల్లో ఈ క్షీణత భారీ ఎత్తున ఉందని విశ్లేషించారు. కరోనా రోగుల సంఖ్య తగ్గుతున్నట్లు 46 రాష్ట్రాలు నివేదించాయని ట్రంప్ చెప్పారు. టీకా కనుగొనడానికి తాము అతి దగ్గరగా ఉన్నామని ఆయన అన్నారు.
కిమ్‌కేమీ కాలేదన్న ట్రంప్
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ట్రంప్ వదంతులుగా కొట్టేశారు. పాత వైద్య నివేదికల ఆధారంగా.. కిమ్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారంటూ సీఎన్‌ఎన్ చానెల్ కథనం ఇచ్చిందన్నారు. అయితే, కిమ్ క్షేమంగా ఉన్నారన్న సమాచారం మీ వద్ద ఉందా అన్న ప్రశ్నకు ట్రంప్ జవాబివ్వలేదు. ‘ఆయనేమీ ఇబ్బందుల్లో లేరని భావిస్తున్నా’ అని మాత్రం పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతలా దెబ్బతినడానికి కారణమైన చైనా మూల్యం చెల్లించక తప్పదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో హెచ్చరించారు.
చైనాలో.. ఏక అంకెలో..
కరోనా జన్మస్థానం చైనాలో శుక్రవారం అత్యల్పంగా 6 కేసులే నమోదయ్యాయి. వీరిలో ఇద్దరు విదేశాలనుంచి తిరిగొచ్చినవారు. 4 లోకల్ ట్రాన్స్‌మిషన్ కేసులు. కొన్ని రోజులుగా వూహాన్ సహా హుబెయ్ ప్రావిన్స్‌లో కొత్త కేసులు, మరణాలు లేవు. చైనా ఇంటర్నెట్, ఈ కామర్స్ దిగ్గజ సంస్థలు అలీబాబా, టెన్సెంట్‌లు కొవిడ్ పరీక్షలకు బుకింగ్‌లు ప్రారంభించాయి. పాకిస్థాన్‌లో మరో 642 కేసులు, 13 మరణాలు రికార్డయ్యాయి. మొత్తం కేసులు 11,155కి చేరాయి. స్పెయిన్‌లో శుక్రవారం 367 మరణాలు నమోదయ్యాయి. గత 4 వారాల్లో ఇదే తక్కు వ సంఖ్య. మార్చి 22న 394 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్త మరణాలు 1.95 లక్షలకు, కేసుల సంఖ్య 27.86 లక్షలకు చేరింది.
హిందూ సంస్థల సేవా తత్పరత
కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాలో హిందూ సేవా సంస్థలు విస్తృతంగా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. 1,500 మందిపైగా సభ్యులున్న హిందూ స్వయం సేవక్ సంఘ్ ఈ కోవలోనే కొన్ని వారాల్లో 5 లక్షల డాలర్లు సేకరించింది. అమెరికా వ్యాప్తంగా తమ సంఘ సభ్యులు 2,500 మంది సహాయ కార్యక్రమాల్లో ఉన్నారని సంఘ కమ్యూనికేషన్ డైరెక్టర్ వికాస్ దేశ్‌పాండే తెలిపారు. 200 మందిపైగా భారతీయులు, పలు అమెరికా సంస్థలు తమతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. భారత్‌లోని ఆర్‌ఎ్‌సఎస్ స్ఫూర్తితో హిందూ స్వయం సేవక్ సంఘ్ నడుస్తోంది. శానోస్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఇండియా్‌సపొరా.. ‘చలో గివ్ ఫర్ కొవిడ్-19’ పేరిట మిలియన్ డాలర్లు సేకరించింది.
ప్రిన్స్ చార్లెస్ ‘అత్యవసర నిధి’
దక్షిణాసియాలోని భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో కరోనా బాధితులకు సాయం చేసేందుకు బ్రిటన్ యువరాజు చార్లెస్ (71).. శుక్రవారం ‘కొవిడ్-19 ఎమర్జెన్సీ’ ఫండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రిటన్ అభివృద్ధి లో దక్షిణాసియా వాసుల పాత్రను ఆయన కొనియాడారు. దక్షిణాసియాలో 4 కోట్ల మంది చిన్నారులు సహా 40 కోట్ల మంది దినసరి కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు.