యూఏఈలో 3 మిలియన్ల కరోనా టెస్టులు...
ABN , First Publish Date - 2020-06-18T17:39:16+05:30 IST
మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా టెస్టులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

యూఏఈ: మహమ్మారి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యూఏఈ ముమ్మరంగా టెస్టులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మే 25 నాటికి దేశవ్యాప్తంగా 2 మిలియన్ల కోవిడ్ టెస్టులు నిర్వహించిన యూఏఈ తాజాగా రికార్డు స్థాయిలో 3 మిలియన్ల మార్కును అందుకుంది. ఆరోగ్య మంత్రి డా. అబ్దుల్ రెహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ ఒవైస్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. యూఏఈ వ్యాప్తంగా మహమ్మారి నియంత్రణకు ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు ఎంతో శ్రమించారని ఆయన తెలిపారు. ఒకవైపు ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూనే... మరోవైపు శానిటైజషన్ కార్యక్రమం చేపట్టడం వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రధానపాత్ర పోషించిందని మంత్రి అన్నారు.
ఇక యూఏఈలో ఇప్పుడిప్పుడే కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పడుతోంది. నెమ్మదిగా కొత్త పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. అలాగే కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. బుధవారం దేశవ్యాప్తంగా కేవలం 382 కొత్త కేసులు నమోదు కాగా... 676 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు కరోనాతో మరణించారని ప్రభుత్వ అధికారిక ప్రతినిధి అమ్నా అల్ దహక్ అల్ షంసీ తెలిపారు. ప్రస్తుతం యూఏఈ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 43,364 ఉండగా... కోలుకున్నవారు 29,537 మంది.. మరణించిన వారు 295 మంది అయ్యారు. మరో 13,532 యాక్టివ్ కేసులు ఉన్నాయి.