యూఏఈలో భారీగా నమోదైన కరోనా కేసులు..!

ABN , First Publish Date - 2020-05-18T15:43:37+05:30 IST

కరోనా మహమ్మారి యూఏఈలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 731 కొత్త కేసులు నమోదైనట్లు యూఏఈ ఆరోగ్య

యూఏఈలో భారీగా నమోదైన కరోనా కేసులు..!

యూఏఈ: కరోనా మహమ్మారి యూఏఈలో విజృంభిస్తోంది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 731 కొత్త కేసులు నమోదైనట్లు యూఏఈ ఆరోగ్య‌శాఖ అధికారులు ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 581 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. ఆరుగురు మరణించారని తెలిపారు. గడిచిన 24 గంటల్లో యూఏఈ వ్యాప్తంగా 40వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. యూఏఈ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.5 మిలియన్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన అధికారులు.. ప్రజలు కూడా భౌతికదూరం పాటిస్తూ సహకరించాలని కోరారు. రంజాన్ నేపథ్యంలో బంధువులను, స్నేహితులను ఇంటికి పిలవడాన్ని విరమించుకోవాలని సూచించారు. 


ఇదిలా ఉంటే.. దుబాయిలోని పబ్లిక్ పార్కుల్లోకి ప్రజలను అనుమతించనున్నట్లు దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు యూఏఈలో 23,358 కరోనా కేసులు నమోదవ్వగా.. 8,512 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కాటుకు మరణించిన వారి సంఖ్య 220కి చేరింది. 


Updated Date - 2020-05-18T15:43:37+05:30 IST