యూఏఈలో ఒకేరోజు రికార్డుస్థాయి కేసులు !
ABN , First Publish Date - 2020-10-14T13:31:48+05:30 IST
యూఏఈలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి మంగళవారం ఒకేరోజు రికార్డుస్థాయి కేసులు నమోదయ్యాయి.

అబుధాబి: యూఏఈలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి మంగళవారం ఒకేరోజు రికార్డుస్థాయి కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1,315 నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 3న 1,231 కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో తొలిసారి ఒక్కరోజే వెయ్యి కేసుల మార్క్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఇక మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 97వేల కరోనా పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా కొవిడ్ టెస్టులు నిర్వహించింది యూఏఈ. అలాగే వ్యాక్సిన్ ట్రయల్స్‌లోనూ యూఏఈ దూసుకెళ్తోంది. తాజాగా రష్యన్ వ్యాక్సిన్‌ను సైతం తమ దేశంలో ట్రయల్స్ నిర్వహించనున్నట్లు యూఏఈ ప్రకటించింది.
ఇక మంగళవారం దేశవ్యాప్తంగా నమోదైన 1,315 కొత్త కేసులతో కలిపి ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 1,08,608కు చేరింది. నిన్న ఒకేరోజు 1,452 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 1,00,007కు చేరాయి. ఇప్పటికే 448 మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 8,153 యాక్టివ్ కేసులు ఉన్నాయి.