యూఏఈలో కొవిడ్ ఉధృతి.. ఒకేరోజు రికార్డుస్థాయి కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-10-04T13:09:31+05:30 IST
యూఏఈలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతోంది.
అబుధాబి: యూఏఈలో కొవిడ్-19 ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా శనివారం ఒకేరోజు రికార్డుస్థాయి కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన 117,812 కరోనా పరీక్షల్లో ఏకంగా 1,231 మందికి పాజిటివ్‌గా వచ్చిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 97,760కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే 1,051 మంది కరోనా బాధితులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 87,122 అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇద్దరు కొవిడ్ కాటుకు బలయ్యారు. ఇప్పటివరకు యూఏఈ వ్యాప్తంగా 426 మందిని ఈ మహమ్మారి బలిగొంది. ప్రస్తుతం దేశంలో 10,212 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వారు సూచించిన ముందుజాగ్రత్త చర్యలను పాటించడం ద్వారా వైరస్ వ్యాప్తిని సులువుగా అరికట్టవచ్చని మంత్రిత్వశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలియజేశారు. ఇక వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముమ్మరంగా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్న యూఏఈ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో ఏకంగా 9.90 మిలియన్ల కరోనా పరీక్షలు పూర్తి చేయడం విశేషం.