యూఏఈలో ఆగని కొవిడ్ విజృంభణ.. ఒక్కరోజే !
ABN , First Publish Date - 2020-10-03T13:21:59+05:30 IST
యూఏఈలో మహమ్మారి కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది.

అబుధాబి: యూఏఈలో మహమ్మారి కొవిడ్-19 విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 107,187 కరోనా పరీక్షల్లో 1,181 మందికి పాజిటివ్‌గా తేలింది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఒకేరోజు ఇంత మందికి ఈ వైరస్ సోకడం ఇదే తొలిసారి అని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు యూఏఈ వ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 96,529కు చేరింది. అలాగే నిన్న 1,181 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో మొత్తం రికవరీలు 86,071 అయ్యాయి. కాగా, ఇప్పటికే 424 మందిని ఈ మహమ్మారి కబళించింది. ప్రస్తుతం దేశంలో 10,034 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మరోవైపు వైరస్ వ్యాప్తి నియంత్రణకు ముమ్మరంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న యూఏఈ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏకంగా 9.79 మిలియన్ల కొవిడ్ టెస్టులు పూర్తి చేసింది. అటు దేశ ప్రజలు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఆరోగ్యశాఖ అధికారులు పలు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో ఉష్ణోగ్రత పరీక్షలు, కొవిడ్‌పై బహుళ భాషా అవగాహన కార్యక్రమాలు, సమగ్ర కరోనా పరీక్షలు, దేశవ్యాప్తంగా స్టెరిలైజేషన్ డ్రైవ్‌లు చేపడుతున్నారు. అయినా మహమ్మారిని కట్టడి చేయడంలో యూఏఈ విఫలం కావడం ఆందోళన కలిగించే విషయం. ప్రజలు ముందు జాగ్రతచర్యలను పాటించకపోవడం వల్లే వైరస్ వ్యాప్తి నియంత్రణ కష్టంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్ నెల మొదటి 15 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 24,894 కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. ముఖానికి మాస్క్ ధరించకపోవడం ఉల్లంఘనల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.