'సినోఫార్మ్' వ్యాక్సినేషన్ ప్రారంభించిన యూఏఈ !
ABN , First Publish Date - 2020-12-15T15:27:24+05:30 IST
చైనాకు చెందిన కొవిడ్ టీకా 'సినోఫార్మ్' వ్యాక్సినేషన్‌ను రాజధాని అబుధాబిలో ప్రారంభించినట్లు సోమవారం యూఏఈ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

అబుధాబి: చైనాకు చెందిన కొవిడ్ టీకా 'సినోఫార్మ్' వ్యాక్సినేషన్‌ను రాజధాని అబుధాబిలో ప్రారంభించినట్లు సోమవారం యూఏఈ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో 'సినోఫార్మ్' వ్యాక్సినేషన్ ప్రారంభించిన తొలి దేశంగా యూఏఈ నిలిచింది. బహ్రెయిన్, యూఏఈ మొదట ఈ టీకాను ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం అనుమతి ఇచ్చాయి. అయితే, వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో అద్భుతమైన ఫలితాలు రావడంతో దేశ ప్రజలకు కూడా ఇవ్వాలని యూఏఈ నిర్ణయించింది. అలా టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన ఆరోగ్యశాఖ వెంటనే వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించేసింది. రాజధానిలోని నివాసితులు అబుధాబి హెల్త్ సర్వీసెస్(ఎస్ఈహెచ్ఏ) హాట్‌లైన్ ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
"ఎలాంటి రుసుము చెల్లించకుండా రెసిడెంట్స్ టీకా కోసం తమ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. 45 ఆస్పత్రులు, క్లినిక్లను వ్యాక్సినేషన్ కోసం ఎంపిక చేశాం. రెండు డోసులుగా టీకా ఇవ్వడం జరుగుతుంది. మొదటి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత రెండోది ఇస్తారు." అని ఎస్ఈహెచ్ఏ ఆపరేటర్ ఒకరు మీడియాతో అన్నారు. ఇక గల్ఫ్ దేశాలైన కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇప్పటికే అమెరికాకు చెందిన ఫైజర్, జర్మన్ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. యూఏఈలో తీవ్ర ప్రభావాన్ని చూపిన మహమ్మారి ఇప్పటివరకు 1.84 లక్షల మందికి ప్రబలింది. 617 మందిని కబళించింది.