స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు.. గైడ్ లైన్స్ ను ప్రకటించిన దుబాయి సర్కారు..
ABN , First Publish Date - 2020-06-23T16:16:26+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది.. ఓ వైపు భారీ సంఖ్యలో కరోనా కేసులతో అమెరికా అగ్రభాగాన నిలువగా.. మరో వైపు భారత్ లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది..

దుబాయి: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది.. ఓ వైపు భారీ సంఖ్యలో కరోనా కేసులతో అమెరికా అగ్రభాగాన నిలువగా.. మరో వైపు భారత్ లో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తోంది.. గల్ఫ్ దేశాలు కూడా కరోనా ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటివరకు యూఏఈలో 45,303 కరోనా కేసులు నమోదయ్యాయి. 303 మంది మరణించారు. 33,046 మంది కోలుకోగా.. ఇంకా ఆసుపత్రుల్లో 11,954 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భవిష్యత్ ప్రణాళికలను దుబాయి సర్కారు సిద్ధం చేస్తోంది. రాబోయే విద్యా సంవత్సరంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు ఎలాంటి నిబంధనలను పాటించాలి..? అన్న దానిపై గైడ్ లైన్స్ ను సిద్ధం చేసింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయే విద్యాసంవత్సరంలో ఈ నియమ నిబంధనలను దేశంలోని ప్రతీ ఒక్క స్కూలు, కాలేజీ తప్పనిసరిగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పింది. అదే సమయంలో ప్రయాణాలు చేసేందుకు దేశంలోని అందరు పౌరులకు అనుమతి లేదనీ.. వయసు, రిస్క్ ను బట్టి అధికారులు అనుమతి ఇస్తుంటారని స్పష్టం చేసింది. పౌరులు వెళ్లబోయే దేశాల్లో పరిస్థితులను బట్టి కూడా అనుమతిని నిరాకరించవచ్చునని వివరించింది.
దుబాయి సర్కారు విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం.. స్కూళ్లు, కాలేజీలను తెరవాలంటే..
1. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆఫీస్ స్టాఫ్.. అందరికీ శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసిన తర్వాతే స్కూళ్లలోకి అనుమతించాలి.
2. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి. తరగతి గదుల్లో విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగా ఉండేలా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.
3. విద్యార్థులు మూకుమ్మడిగా ఒక్క చోట చేరే కార్యక్రమాలు ఉండకూడదు. అసెంబ్లీలు, ట్రిప్స్, స్పోర్ట్స్, క్యాంప్స్, పార్టీలు వంటి వాటిని రద్దుచేయాలి.
4. తరగతి గదులు, ల్యాబ్స్.. వంటి వాటిని ప్రతీరోజూ విధిగా శుభ్రం చేయాలి.
5. విద్యార్థులు భోజనాలను ఒకరినొకరు పంచుకోకుండా యాజమాన్యాలు చూసుకోవాలి.
6. బస్సుల్లో 30శాతం కంటే ఎక్కువగా విద్యార్థులు ఉండకూడదు. బస్సు ఎక్కే సమయంలో కూడా విద్యార్థులకు శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలి.
7. ప్రతీ ఒక్క విద్యాలయంలోనూ నర్సింగ్ స్టాఫ్ ఉండాలి.
8. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. ఏమయినా తేడాగా అనిపిస్తే స్కూల్ యాజమాన్యానికి వెంటనే సమాచారం అందించాలి.