వందే భార‌త్ మిష‌న్: దుబాయి నుంచి అద‌నంగా మ‌రో రెండు విమానాలు

ABN , First Publish Date - 2020-06-19T20:06:38+05:30 IST

క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే.

వందే భార‌త్ మిష‌న్: దుబాయి నుంచి అద‌నంగా మ‌రో రెండు విమానాలు

పానాజీ: క‌రోనా లాక్‌డౌన్ వ‌ల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం 'వందే భార‌త్ మిష‌న్' ద్వారా స్వ‌దేశానికి త‌ర‌లిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మిషన్‌లో భాగంగా 2.50 ల‌క్ష‌ల‌ మందిని స్వ‌దేశానికి తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ‌శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్ప‌టికే రెండు ద‌శ‌లు పూర్తి చేసుకున్న ఈ మిష‌న్‌లో‌... ప్ర‌స్తుతం మూడో ద‌శ కొన‌సాగుతోంది. ఈ ద‌శ‌లో భాగంగా 41 దేశాల నుంచి భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించ‌నున్నారు. కాగా, 4.50లక్షల మంది ఎన్నారైలు ఇండియాకు వ‌చ్చేందుకు‌ రిజిస్టర్ చేసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.


ఇదిలా ఉంటే... 'వందే భార‌త్ మిష‌న్'లో భాగంగానే దుబాయి నుంచి గోవాకు అద‌నంగా మ‌రో రెండు రిపాట్రియేష‌న్ విమానాలు న‌డ‌ప‌నున్న‌ట్లు భార‌త అధికారులు వెల్ల‌డించారు. జూన్ 21, 25 తేదీల్లో ఈ రెండు విమానాలు దుబాయి నుంచి గోవాకు రానున్నాయి. ఈ రెండు ఫ్లైట్స్ కూడా చెరో 149 మంది భార‌త ప్ర‌వాసుల‌తో గోవాకు వ‌స్తాయ‌ని ఎయిరిండియా అధికార ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఆయా తేదీల్లో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు దుబాయి నుంచి బ‌య‌ల్దేరే విమానాలు త‌రువాతి రోజు తెల్ల‌వారుజామున 4.40 గంట‌ల‌కు గోవాలోని డ‌బోలిం విమానాశ్ర‌యానికి చేరుకుంటాయి. దుబాయిలో చిక్కుకుపోయిన భార‌త‌ ప్ర‌వాసుల అభ్య‌ర్థ‌న మేర‌కు అద‌నంగా ఈ రెండు విమానాల‌ను న‌డుపుతున్న‌ట్లు సంబంధిత అధికారులు వెల్ల‌డించారు.   

Updated Date - 2020-06-19T20:06:38+05:30 IST