అమెరికాలో విమానాశ్రయానికి డొనాల్డ్ ట్రంప్ పేరు!?

ABN , First Publish Date - 2020-12-28T19:29:55+05:30 IST

మరికొద్ది రోజుల్లో శ్వేతసౌధాన్ని వీడివెళ్లనున్న డొనాల్డ్ ట్రంప్.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అమెరికాలో విమానాశ్రయానికి డొనాల్డ్ ట్రంప్ పేరు!?

వాషింగ్టన్: మరికొద్ది రోజుల్లో శ్వేతసౌధాన్ని వీడివెళ్లనున్న డొనాల్డ్ ట్రంప్.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాలోని ఏదైనా ఓ విమానాశ్రయానికి తన పేరును పెట్టుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఆయన పేరు ఇప్పటికే చరిత్రపుటల్లోకి ఎక్కినప్పటికీ.. తన పేరును ప్రజలు ఎప్పుడూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై సన్నిహితులు, సలహాదారులతో కూడా ట్రంప్ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫ్లోరిడాలోని పామ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తన పేరును పెట్టాలని నిర్ణయించుకున్నారట. వైట్‌హౌస్ వీడిన తర్వాత ట్రంప్ దంపతులు మార్-ఏ-లాగోలో ఉన్న నివాసానికి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ ప్రాంతానికి పామ్ బీచ్ ఎయిర్‌పోర్టే దగ్గర ఉండటంతో ట్రంప్ దీన్ని ఎంపిక చేసుకున్నారట. ఈ అంశం అమెరికాలో ప్రస్తుతం చర్చనీయాంశం కావడంతో వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీని మీడియా వివరణ కోరింది. అయితే దీనిపై ప్రెస్ సెక్రటరీ స్పందిస్తూ.. వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.  


Updated Date - 2020-12-28T19:29:55+05:30 IST