టిక్‌టాక్ టెక్ భాగస్వాములుగా వాల్‌మార్ట్, ఒరాకిల్ ఉంటే బాగుంటుంది: ట్రంప్

ABN , First Publish Date - 2020-09-20T09:52:40+05:30 IST

టిక్‌టాక్‌ అమెరికా ఆపరేషన్స్‌‌కు ఒరాకిల్, వాల్‌మార్ట్ సంస్థలు టెక్ భాగస్వాములుగా

టిక్‌టాక్ టెక్ భాగస్వాములుగా వాల్‌మార్ట్, ఒరాకిల్ ఉంటే బాగుంటుంది: ట్రంప్

వాషింగ్టన్: టిక్‌టాక్‌ అమెరికా ఆపరేషన్స్‌‌కు ఒరాకిల్, వాల్‌మార్ట్ సంస్థలు టెక్ భాగస్వాములుగా ఉంటే అద్భుతంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. టిక్‌టాక్ ఈ రెండు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటే అద్భుతంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఒప్పందానికి తన ఆశీస్సులు అందించానని.. ఒకవేళ ఈ ఒప్పందం జరిగితే గొప్పగా ఉంటుందని.. జరగకపోయినా పర్లేదని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. టిక్‌టాక్ డౌన్‌లోడ్లపై శుక్రవారం అమెరికా ప్రభుత్వం బ్యాన్ విధించింది. టిక్‌టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను అమెరికా సంస్థకు అమ్మేయాలని.. లేదంటే టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తామని ఇప్పటికే అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు సూచించింది. 


ఇందులో భాగంగా అమెరికా ప్రభుత్వం బైట్‌డ్యాన్స్‌కు ఇచ్చిన గడువు నవంబర్ 12తో ముగియనుంది. కాగా..చైనా ప్రభుత్వం టిక్‌టాక్ యాప్ ద్వారా అమెరికన్ల డేటాను వాడుకుంటోందని, దీని వల్ల అమెరికన్ల భద్రతకు ముప్పు ఉందని అమెరికాకు చెందిన నిపుణులు ఆరోపిస్తున్నారు. అయితే చైనా వాణిజ్య శాఖ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించిందంటూ మండిపడింది. టిక్‌టాక్ వల్ల అమెరికన్ల భద్రతకు ముప్పు ఉందనే దానికి అమెరికా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పింది. 

Updated Date - 2020-09-20T09:52:40+05:30 IST