తన అభిమాన న్యూస్ ఛానల్‌పై మండిపడ్డ ట్రంప్..!

ABN , First Publish Date - 2020-10-28T19:50:51+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అభిమాన న్యూస్ ఛానల్ ఫాక్స్ న్యూస్‌పై మండిపడ్డారు.

తన అభిమాన న్యూస్ ఛానల్‌పై మండిపడ్డ ట్రంప్..!

వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అభిమాన న్యూస్ ఛానల్ ఫాక్స్ న్యూస్‌పై మండిపడ్డారు. దీనికి కారణం... తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాల్గొన్న ఎన్నికల ర్యాలీని ఫాక్స్ న్యూస్‌ ప్రత్యక్ష ప్రసారం చేయడమే. మంగళవారం ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఒబామా నిర్వహించిన ఎన్నికల ర్యాలీని ఫాక్స్ న్యూస్‌ కవర్ చేసింది. అంతే.. ఇది ట్రంప్‌కు మింగుడుపడలేదు. తాను ఎంతో అభిమానించి, తరచూ ఇంటర్వ్యూలు ఇచ్చే మీడియా సంస్థ తన ప్రత్యర్థి నిర్వహించిన ర్యాలీని ప్రసారం చేయడం జీర్ణించుకోలేకపోయారు. "అనుక్షణం నాపై ఫోకస్ పెట్టే ఫాక్స్ న్యూస్... అప్పుడప్పుడు బైడెన్‌ను కూడా కవర్ చేయాలి. పెన్సిల్వేనియా ర్యాలీలో ఆయన నిద్రపోయిన దృశ్యాలను చూపించాల్సింది. ఇలాంటివి వదిలిపెట్టి పనికిమాలినవన్నీ ప్రసారం చేస్తుంది." అని వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు. అదే సమయంలో తన పేరును మరిచిపోయి తప్పుగా చెప్పిన బైడెన్‌ను చూపించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ట్రంప్ గుర్తు చేశారు.


ఇక ఓ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న జో బైడెన్..  ట్రంప్‌ను ‘జార్జ్’ అంటూ సంభోధించారు. "మరో నాలుగేళ్ల పాటు జార్జ్ అధ్యక్షుడిగా ఉంటే.. అమెరికా అస్తవ్యస్థం అయిపోతుంది" అని అన్నారు. జార్జ్ బుష్ అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయన పేరునే జో బైడెన్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా సంభోధించినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ట్రంప్... వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని ప్రస్తుత అధ్యక్షుడి పేరు మరిచిపోవడం విడ్డూరం అంటూ విరుచుకుపడ్డారు. బైడెన్‌కు సంబంధించిన ఆ దృశ్యాలను చూపించి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్ నన్ను చాలా నిరాశపరిచిందన్నారు. కాగా, అధ్యక్షుడు ట్రంప్ తరచుగా ఫాక్స్ న్యూస్‌‌కు ఇంటర్వ్యూలు ఇస్తుంటారనే విషయం తెలిసిందే.  

Updated Date - 2020-10-28T19:50:51+05:30 IST