ఆ విషయంలో అమెరికా తర్వాత భారతే: ట్రంప్
ABN , First Publish Date - 2020-08-11T17:21:03+05:30 IST
కోవిడ్ టెస్టుల్లో అగ్రరాజ్యం అమెరికాను ఏ దేశం అందుకోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో యూఎస్ అగ్రస్థానంలో ఉంటే... భారత్ రెండో స్థానంలో కొనసాగుతుందని తెలిపారు. కానీ, అమెరికాను ఇండియా అందుకునే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు.

వాషింగ్టన్ డీసీ: కోవిడ్ టెస్టుల్లో అగ్రరాజ్యం అమెరికాను ఏ దేశం అందుకోలేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో యూఎస్ అగ్రస్థానంలో ఉంటే... భారత్ రెండో స్థానంలో కొనసాగుతుందని తెలిపారు. కానీ, అమెరికాను ఇండియా అందుకునే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్... "ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 65 మిలియన్ల కరోనా పరీక్షలు నిర్వహించాం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మా తరువాత 150 కోట్ల జనభా ఉన్న భారత్ 11 మిలియన్ల కోవిడ్ టెస్టులతో రెండో స్థానంలో ఉంది. కనుక కోవిడ్ టెస్టుల్లో అమెరికాకు దరిదాపుల్లో మరేదేశం లేదని స్పష్టం అవుతోంది." అని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది చివర వరకు ఈ మహమ్మారికి వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ఆయన అన్నారు.
అంతేగాక వారం రోజులుగా యూఎస్‌లో పాజిటివ్ కేసులు 14 శాతం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 7 శాతం, మరణాలు 9 శాతం తగ్గాయని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉంటే... అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఇప్పటివరకు 52 లక్షల మందికి ప్రబలింది. లక్ష 66 వేల మందిని కబళించింది. దీంతో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల్లో ప్రపంచంలోనే అగ్రరాజ్యం అగ్రస్థానంలో ఉంది. భారత్ విషయానికి వస్తే 22 లక్షల మందికి సోకిన ఈ మహమ్మారి 45 వేల మంది వరకు బలిగొంది. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియానే ఉంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితులు రెండు కోట్ల మంది ఉంటే... 7 లక్షల 38వేల మందిని కోవిడ్ పొట్టనబెట్టుకుంది.