ఎన్నికలు వాయిదా వేసే ఆలోచన లేదు: ట్రంప్
ABN , First Publish Date - 2020-04-28T21:41:46+05:30 IST
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అమెరికా కరోనాకు

వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా అమెరికా కరోనాకు కేంద్రంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఇక కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య దాదాపు 57 వేలకు చేరింది. ఇదిలా ఉండగా.. అమెరికాలో నవంబర్ 3వ తేదీన జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అనేక వార్తలు వచ్చాయి. డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ కూడా ట్రంప్ ఎన్నికల తేదీని మార్చనున్నారని ఇటీవల మీడియాకు తెలిపారు. ట్రంప్ ఏదో ఒక సాకుతో ఎన్నికలను వాయిదా వేస్తారని, తన మాటలను గుర్తుపెట్టుకోమంటూ జో బిడెన్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపడేశారు. నవంబర్ 3వ తేదీనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఎన్నికల తేదీ మార్చాలనే ఆలోచన కూడా చేయలేదని, ఆ అవసరం కూడా లేదన్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం తాను ఎదురుచూస్తున్నానని ట్రంప్ అన్నారు. ఎవరో చిన్న చిన్న వార్తలు రాసుకునే వారు ఈ పుకారును సృష్టించారని, ఆ పుకారునే జో బిడెన్ నిజం అనుకుని చెబుతున్నారని ట్రంప్ చెప్పారు.
ఇదే సందర్భంగా రిపోర్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిచ్చారు. వియత్నాం యుద్దంలో మరణించిన వారి కంటే కరోనా కారణంగా చనిపోయిన అమెరికన్లే ఎక్కువగా ఉన్నారని మీడియా ట్రంప్‌కు వివరించింది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు మరోమారు అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్హులా అని మీడియా ట్రంప్‌ను సూటిగా ప్రశ్నించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. నిపుణులు 22 లక్షల మంది మరణించే అవకాశం ఉందని వెల్లడించారని.. కానీ అమెరికా ప్రభుత్వం 50 నుంచి 70 వేల వరకే ఈ సంఖ్య ఉండేలా సమర్థవంతంగా పనిచేసిందన్నారు. కరోనాను నియంత్రించేందుకు తాను ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నానన్నారు. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించడం, బోర్డర్ మూసివేయడం ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని ఆపగలిగామన్నారు. కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య 70వేల వరకు చేరుకునే అవకాశముందని ట్రంప్ అన్నారు. కాగా.. కొద్ది రోజుల క్రితం ట్రంప్ ఈ సంఖ్య 60 వేల వరకు చేరుకోవచ్చని చెప్పడం గమనార్హం.