చర్చనీయాంశమైన ట్రంప్ వ్యాఖ్యలు.. వర్క్ వీసాలపై..!

ABN , First Publish Date - 2020-06-21T22:50:43+05:30 IST

వర్క్ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కోట్లాది మంది అమెరికన్లు ఉద్యో

చర్చనీయాంశమైన ట్రంప్ వ్యాఖ్యలు.. వర్క్ వీసాలపై..!

వాషింగ్టన్: వర్క్ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కోట్లాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. మరోవైపు అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. మళ్లీ అధికారపగ్గాలు చేపట్టడంపై దృష్టిసారించిన ట్రంప్.. వర్క్ వీసాల విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్థానికంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. వర్క్ వీసాలపై విధించబోయే కొత్త ఆంక్షలను రెండు, మూడు రోజుల్లో వెల్లడించనున్నట్లు ప్రకటించారు. 


ఇదిలా ఉంటే.. అమెరికన్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఇతర దేశస్తులకిచ్చే హెచ్-1బీ, హెచ్-2బీ, జే-1, ఎల్-1 వంటి వీసాలును నిలిపివేసేందుకు ట్రంప్ యోచిస్తున్నారని గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు చేసిన వ్యాఖ్యలు ప్రధాన్యం సంతరించుకున్నాయి. వర్క్ వీసాలపై ట్రంప్.. ఎటువంటి ఆంక్షలు విధిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. అయితే ఈ విషయంపై స్పందించిన వ్యాపార సంస్థలు.. వర్క్ వీసాలపై ఆంక్షలు విధించడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతుందని.. ఆంక్షలు విధించే ఆలోచన మానుకోవాలని ట్రంప్‌ను కోరాయి. కాగా.. ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వర్క్ వీసాలపై ఆంక్షలు విధించడం ద్వారా అమెరికాకు విదేశీయుల రాకను అడ్డుకోవాలనే చిరకాల కోరికను నెరవేర్చుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తునారని విపక్షపార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2020-06-21T22:50:43+05:30 IST