భారత్‌లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రంప్‌

ABN , First Publish Date - 2020-09-29T13:59:39+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దేశంలో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఏడాది (2017లో) ట్రంప్‌ ఆ దేశంలో 750 డాలర్ల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించారు. అదే ఏడాది ఆయన కంపెనీలు భారత్‌లో మాత్రం 1,45,400 డాలర్లు, ఫిలిప్పైన్స్‌లో 1,56,824 డాలర్ల పన్ను చెల్లించాయి.

భారత్‌లోనే ఎక్కువ పన్ను చెల్లించిన ట్రంప్‌

2017లో ఇండియాలో 1,45,400 డాలర్ల చెల్లింపు

అమెరికాలో 750 డాలర్లే చెల్లించిన అధ్యక్షుడు

నేడు ట్రంప్‌, బైడెన్‌ తొలి ముఖాముఖి


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దేశంలో కంటే భారత్‌లోనే ఎక్కువ ఆదాయపు పన్ను చెల్లించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ఏడాది (2017లో) ట్రంప్‌ ఆ దేశంలో 750 డాలర్ల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించారు. అదే ఏడాది ఆయన కంపెనీలు భారత్‌లో మాత్రం 1,45,400 డాలర్లు, ఫిలిప్పైన్స్‌లో 1,56,824 డాలర్ల పన్ను చెల్లించాయి. తన ప్రత్యర్థి జో బైడెన్‌తో ముఖాముఖి చర్చకు కొన్ని రోజుల ముందే ఈ వార్త బయటికి పొక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. ట్రంప్‌ గత 15 ఏళ్లలో తన వ్యాపారాల్లో నష్టాన్ని చూపిస్తూ 10 ఏళ్ల పాటు పన్ను చెల్లించలేదు. అమెరికా అధ్యక్షుడు తన వ్యక్తిగత ఆదాయపు వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కానీ రిచర్డ్‌ నిక్సన్‌ నుంచి మొదలుకొని ప్రతి అధ్యక్షుడు ఆ వివరాలు వెల్లడించారు.


ట్రంప్‌ మాత్రం తన ఆదాయపు వివరాలు వెల్లడించలేదు. దీనికి సంబంధించి ఆయన కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీ్‌స(ఐఆర్‌ఎ్‌స)కు ట్రంప్‌ ఇచ్చిన నివేదికల ప్రకారం ఏడాదికి వందల మిలియన్ల డాలర్లు సంపాదించే వ్యాపారవేత్త. అదే సందర్భంలో ఆయన పన్నులు ఎగ్గొట్టేందుకు దీర్ఘకాలిక నష్టాలను చూపిస్తారని మీడియా పేర్కొన్నది. అధ్యక్షుడిగా ఉన్న తొలి రెండేళ్లలో ట్రంప్‌కు విదేశాల నుంచి 73 మిలియన్ల డాలర్ల ఆదాయం వచ్చింది. కాగా, పన్ను ఎగవేత వార్తలను ట్రంప్‌ ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని, మీడియా గతంలోనూ ఇలాంటి దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు.
ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ వర్సిటీ వేదికగా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక ఘట్టానికి చేరుకుంది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌(రిపబ్లికన్‌ పార్టీ), జో బైడెన్‌(డెమోక్రటిక్‌ పార్టీ)ల తొలి ముఖాముఖి చర్చకు రంగం సిద్ధమైంది. మూడు ముఖాముఖిల్లో భాగంగా తొలి చర్చ మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6.30 నిమిషాలకు) జరగనుంది. ‘సూపర్‌ బౌల్‌ ఆఫ్‌ అమెరికన్‌ డెమోక్రసీ’ అని పిలిచే ఈ కీలక చర్చకు ఒహియోలోని క్లీవ్‌లాండ్‌ విశ్వవిద్యాలయం వేదిక కానుంది. అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో, అదే నెల 22న టెన్నెసీలోని నష్‌విల్లేలో రెండో, మూడో విడత ముఖాముఖి చర్చలు జరుగుతాయి.  

Updated Date - 2020-09-29T13:59:39+05:30 IST