తెలుగు బాలికను సత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ABN , First Publish Date - 2020-05-18T21:29:42+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అండగా

తెలుగు బాలికను సత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుతున్న ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అండగా నిలబడుతున్న వారిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సహాయం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ట్రంప్ ప్రశంసలను అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రావ్య అన్నపరెడ్డి(10) అనే బాలిక కూడా ఉండటం విశేషం. శ్రావ్య తోటి గర్ల్ స్కౌట్స్ బృందంతో కలిసి నర్సులు, అగ్నిమాపక సిబ్బందికి వంద బాక్సుల కుకీలను అందించింది. అంతేకాకుండా హెల్త్‌కేర్ వర్కర్లను ప్రోత్సహించేలా వారికి గ్రీటింగ్ కార్డులను కూడా పంపింది. శ్రావ్య, తన బృందం చేసిన చిన్న సాయం అమెరికా అధ్యక్షుడి దృష్టిని ఆకర్షించింది. శ్రావ్యతో పాటు లైలా ఖాన్, లారెన్ మాట్నీలకు ట్రంప్ ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రతిఒక్కరు సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలనేదే తమ బృందం ముఖ్య ఉద్దేశమని శ్రావ్య చెప్పింది. తాము చేసిన చిన్న సాయం ట్రంప్‌ను ఆకర్షించి వేల మందికి ప్రేరణగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది. తన తల్లిదండ్రులు భారతీయ విలువలతో తనను పెంచారని.. ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని చెప్పారని శ్రావ్య పేర్కొంది. కాగా.. శ్రావ్య అమెరికాలోనే జన్మించింది. మేరీల్యాండ్‌లోని హ్యానోవర్‌లో తల్లిదండ్రులతో నివసిస్తోంది. శ్రావ్య తండ్రి విజయ్ రెడ్డి అన్నపరెడ్డి మేరీల్యాండ్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. శ్రావ్య తండ్రి గుంటూరు జిల్లాకు చెందినవారు. శ్రావ్య సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుందని విజయ్ రెడ్డి చెప్పారు. శ్రావ్య సేవలను వైట్‌హౌస్ గుర్తించడం ఆనందంగా ఉందని.. శ్రావ్య సమాజానికి మరింత సేవ చేయడానికి ఈ ప్రోత్సాహం మరింత ఉపయోగపడనుందని అన్నారు.


Video Credits: NBC News

Updated Date - 2020-05-18T21:29:42+05:30 IST