ట్రంప్ నోట మొదటిసారి ‘బైడెన్ గెలిచాడు’ అన్న మాట

ABN , First Publish Date - 2020-11-16T03:10:37+05:30 IST

అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాడిన పాటనే మరోసారి పాడారు.

ట్రంప్ నోట మొదటిసారి ‘బైడెన్ గెలిచాడు’ అన్న మాట

వాషింగ్టన్: అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాడిన పాటనే మరోసారి పాడారు. ట్రంప్ మోసం జరిగిందని చెప్పినప్పటికి.. మొట్టమొదటిసారిగా ఆయన నోటి నుంచి జో బైడెన్ గెలిచాడన్న మాట వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ట్రంప్ ఎక్కడా జో బైడెన్ గెలిచినట్టు అధికారికంగా చెప్పలేదు. ఆదివారం చేసిన ట్వీట్‌లో మాత్రం రిగ్గింగ్ జరగడం వల్లే బైడెన్ గెలిచాడంటూ ట్రంప్ చెప్పడం ఆసక్తిగా మారింది. ‘అతడు గెలిచాడు.. ఎందుకంటే ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపును చూసేందుకు కనీసం ఎవరికి అనుమతి ఇవ్వలేదు’ అంటూ ట్రంప్ తాజాగా ట్వీట్ చేశారు. 


ఈ ట్వీట్‌లోని ‘అతడు గెలిచాడు’ అన్న పదం ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. ఎట్టకేలకు ట్రంప్ తాను ఓడినట్టు.. జో బైడెన్ గెలిచినట్టు ఒప్పుకున్నారని నెటిజన్లు ట్విటర్‌లో ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఆ తరువాత మరో ట్వీట్ చేసిన ట్రంప్.. ఆ ట్వీట్‌లో.. ‘కేవలం ఫేక్ న్యూస్ మీడియా చూపించిన కళ్లలోనే అతడు గెలిచాడు. నేను అంగీకరించింది ఏమీలేదు. మేము ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది. ఇవి రిగ్గింగ్ జరిగిన ఎన్నికలు’ అని రాసుకొచ్చారు. 


ఇదిలా ఉండగా.. ట్రంప్‌ మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా ఉండాలంటూ ఆయన మద్దతుదారులు శనివారం వాషింగ్టన్‌ డీసీలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఉదయం ఈ ర్యాలీలో ఎటువంటి ఆందోళనకర పరిస్థితులు కనిపించకపోయినప్పటికి.. రాత్రికి మాత్రం ర్యాలీ హింసాత్మకంగా మారింది. డెమొక్రాటిక్ పార్టీ మద్దతుదారులు, రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణను ఆపేందుకు యత్నించిన పలువురు పోలీసు అధికారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఓ వ్యక్తిని ప్రత్యర్థి వర్గం కత్తితో కూడా పొడిచినట్టు తెలుస్తోంది. ఈ దాడులకు కారణమైన 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2020-11-16T03:10:37+05:30 IST