‘నా కుమారుడు హ్యాపీగా లేడు.. అయినా తప్పదు..’.. ట్రంప్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-04-05T19:39:09+05:30 IST

అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 40 రాష్ట్రాలు షట్‌డౌన్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం శ్వేతసౌధంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికా కరోనాను ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని

‘నా కుమారుడు హ్యాపీగా లేడు.. అయినా తప్పదు..’.. ట్రంప్ వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే 40 రాష్ట్రాలు షట్‌డౌన్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం శ్వేతసౌధంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికా కరోనాను ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితిని తెలియజేశారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియానుద్దేశించి మాట్లాడారు. మీడియా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా ఏ మీడియా పేరును ప్రస్థావించలేదు. కానీ, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేయకూడదని హెచ్చరించారు.


అమెరికాలో వైరస్ ప్రభావం ఉందని, వీలైనంత వరకు ప్రాణాలను కాపాడడానికే ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ట్రంప్ ఇదివరకే  కొన్ని మీడియా సంస్థలపై ‘ఫేక్ మీడియా’ అని ముద్రవేశారు. మీడియా సంస్థల పేరు ప్రస్థావించని ట్రంప్ రేటింగ్ కోసం ఇలా చేయడం దేశానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన కుమారుడు బారన్(14) గురించి వెల్లడించారు. చాలా మంచి క్రీడాకారుడయిన బారన్ కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమయ్యాడని, అందువల్ల అతడు సంతోషంగా లేడన్నారు. బారన్‌కు ఫుట్‌బాల్ క్రీడా అంటే చాలా ఇష్టమని ట్రంప్ తెలిపారు. కరోనాను తరిమికొట్టాలంటే షట్‌డౌన్ పాటించక తప్పదని, అందరూ ఇళ్లకే పరిమితం కావాలనే చెప్పారు.


కాగా ఇప్పటికే అమెరికాలో మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 8,162 మంది మరణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీతో శనివారం ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌లో కరోనా వైరస్‌ నివారణకు ప్రివెంటివ్‌ ఔషధంగా వినియోగిస్తున్న హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను అమెరికాకు ఎగుమతి చేయాల్సిందిగా ప్రధాని మోదీని ట్రంప్ కోరారు. అమెరికా ఆర్డర్ చేసిన వరకైనా పంపాలని మోదీకి చెప్పారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులను, భారత్‌కు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను మలేరియా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ నివారణ చికిత్సకు వినియోగిస్తారు. క్లినికల్‌గా ఇంకా రుజువు కాకపోయినా కోవిడ్‌-19 వైరస్‌ నివారణకు ఇది బాగా ఉపయోగపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-05T19:39:09+05:30 IST